Share News

చంచల్‌గూడలో జైలు మ్యూజియం

ABN , Publish Date - May 12 , 2026 | 04:05 AM

పాత కాలంలో జైళ్లు ఎలా ఉండేవి. అక్కడ ఉండే ఖైదీలకు ఎటువంటి శిక్షలు విధించేవారు? ఖైదీల జీవనం ఎలా ఉంటుంది....

చంచల్‌గూడలో జైలు మ్యూజియం

  • మారిన జైళ్ల స్వరూపంపై ప్రజలకు అవగాహన కల్పించేలా ‘ఫీల్‌ ద జైల్‌’

  • నేడు ప్రారంభించనున్న గవర్నర్‌

  • పాతకాలం నాటి జైళ్లలో పరిస్థితులు, క్రమేణా వచ్చిన మార్పులపై సమాచారం

  • ఖైదీల జీవితాన్ని తెలుసుకునేలా ‘ఒక రోజు జైలు జీవితం’

  • ఫీజు రూ.500.. మధ్యలో బయటకొస్తే రూ.వెయ్యి జరిమానా

హైదరాబాద్‌, సైదాబాద్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): ‘పాత కాలంలో జైళ్లు ఎలా ఉండేవి. అక్కడ ఉండే ఖైదీలకు ఎటువంటి శిక్షలు విధించేవారు? ఖైదీల జీవనం ఎలా ఉంటుంది? కాలక్రమేణా జైళ్లల్లో చేపట్టిన సంస్కరణలు ఎటువంటివి? నేరాలకు దూరంగా ఉంచేందుకు ఖైదీల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు జైళ్లలో ఏ శిక్షణ ఇస్తున్నారు?’.. ఇలా జైళ్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సామాన్య ప్రజ లు తెలుసుకునేందుకు రాష్ట్ర జైళ్ల శాఖ ‘ఫీల్‌ ద జైల్‌’ అనే కాన్సెప్ట్‌తో జైలు మ్యూజియంను రూపొందించింది. ఇప్పటి వరకు దేశంలో 4 ప్రాంతాల్లో జైలు మ్యూజియంలు ఉండగా మంగళవారం నుంచి తెలంగాణలో ఐదో మ్యూజియం అందుబాటులోకి రానుం ది. జైలు మ్యూజియంను గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా నేడు ప్రారంభించనున్నారు. కాగా, తెలంగాణలో జైలు మ్యూజియం ఏర్పాటు ఇదే తొలిసారి కాదు. 2016లో ప్రయోగాత్మకంగా సంగారెడ్డి జైల్లో ఏర్పాటు చేసారు. కరోనా తర్వాత అది మూతబడింది. ఈసారి హైదరాబాద్‌లోని చంచల్‌గూడలో జైలు మ్యూజియంను నెలకొల్పారు. నగరంలో ఉండటం వల్ల దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

1.jpg


సరికొత్త అనుభూతి

‘ఫీల్‌ ద జైల్‌’ కాన్సెప్ట్‌ సందర్శకులకు సరికొత్త అనుభూతి మిగల్చనుంది. చంచల్‌గూడలోని స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కరెక్షనల్‌ అడ్మినిస్ట్రేషన్‌(సీకా)లో జైలు మ్యూజియం ఏర్పాటు చేసారు. ఇప్పటి వరకు అండమాన్‌ అండ్‌ నికోబార్‌, అలీపూర్‌ (కోల్‌కతా), బెంగళూరు, గోవాల్లోనే ఈ తరహా మ్యూజియంలు ఉన్నాయి. చంచల్‌గూడ మ్యూజియంలో.. గతంలో ఖైదీలను బంధించటానికి ఉపయోగించిన సంకెళ్లు, నూలు వడికే పనిముట్లు, నిజాం నవాబు లండన్‌ నుంచి తెప్పించిన కంచుగంట, అప్పటి రేడియోలు, వాల్‌క్లాక్‌లు, తెలంగాణ చరిత్ర, భారత స్వాతంత్రోద్యమ చరిత్ర తాలూకు పెయింటింగ్‌లను ప్రదర్శనకు ఉంచారు. కోర్టు విచారణలు, జైల్లో ఖైదీలతో కుటుంబ సభ్యుల ములాఖత్‌లు ఎలా ఉంటాయో తెలిపేందుకు సందర్శకుల కోసం ఆడియో విజువల్‌ కార్యక్రమాన్నీ రూపొందించారు. ఈ మ్యూజియం లో ఒక రోజుపాటు (24 గంటలు) జైలు జీవితం గడిపే అవకాశం కూడా కల్పించారు. దీనికోసం రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్‌, ఇతర సాంకేతిక పరికరాలు వెంట ఉంచుకునేందుకు అనుమతి ఉండదు. ఖైదీల దుస్తులే ధరించాల్సి ఉంటుంది. నేలపై చాప పరుచుకుని పడుకోవాలి. ఎవరి లాక్‌పను వారే శుభ్రం చేసుకోవాలి. ఖైదీలకు ఇచ్చే ఆహారమే ఇక్కడ ఉండేవారికి అందిస్తారు. ఖైదీల మాదిరిగా తోటపని, క్లీనింగ్‌ పనులు చేయాల్సి ఉంటుంది. ఈ 24 గంటల జైలు జీవితం వద్దనుకుని మధ్యలో బయటకు రావాలనుకునే వారు రూ.వెయ్యి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆన్‌లైన్‌లో ‘ఫీల్‌ ద జైల్‌’ బుకింగ్‌ లేదు. ఒక రోజు ముందుగా నేరుగా అక్కడికే వెళ్లి బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డు వంటి ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకెళ్లాలి. సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు 040-24527846, 040-24528877.

స్వేచ్ఛ విలువను అర్థం చేయించే ప్రయత్నండీజీ సౌమ్యా మిశ్రా

‘స్వేచ్ఛ’ విలువను అర్థం చేయించేందుకే ఫీల్‌ ద జైల్‌ కాన్సెప్ట్‌ను రూపొందించామని జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా, నేరాల బాట పట్టకుండా ఈ కాన్సెప్ట్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఖైదీలు పడే మనోవేదన గురించి ఇక్కడికి వచ్చే వారికి అర్థమవుతుందని, నేర రహిత సమాజాన్ని రూపొందించంలో భాగంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.

2.jpg

Updated Date - May 12 , 2026 | 04:24 AM