హైదరాబాద్‌లో బాంబు వేస్తే అంతా ఖతం
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:48 AM
అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమై ఉంది. వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి అన్ని జిల్లా కేంద్రాలకు విస్తరించాలి’ అని సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు కోరారు.
ఐటీ కంపెనీలు ఉద్యోగుల రక్తం పీలుస్తున్నాయి
పాలకులకు ఏటీఎంలుగా సాగునీటి ప్రాజెక్టులు
శాసనసభలో ఎమ్మెల్యే కూనంనేని
హైదరాబాద్, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ‘అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమై ఉంది. వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి అన్ని జిల్లా కేంద్రాలకు విస్తరించాలి’ అని సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు కోరారు. ‘ఇప్పుడు యుద్ధాల కాలం నడుస్తోంది. ఎవరైనా ఇక్కడ ఒక్క బాంబు వేస్తే హైదరాబాద్ అంతా ఖతమవుతుంది’ అన్నారు. బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్న ఐటీ రంగంపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని.. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని, కంపెనీలు ఉద్యోగుల రక్తం పీలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి, ఆర్టీసీలను ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచన కనిపిస్తోందని చెప్పారు. సింగరేణిలో ఒక్కో విభాగం ప్రైవేటుకు అప్పగిస్తున్నారని, ఇప్పుడు బొగ్గు సేకరణ సైతం ప్రైవేటుపరం చేశారన్నారు. ఆర్టీసీలో ఎలక్ర్టిక్ బస్సులను ప్రవేశపెట్టి అంతా ప్రైవేటుకే అప్పగిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ కాలంలో జలయజ్ఞం పేరుతో ప్రారంభమైన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు పాలకులకు ఏటీఏంలుగా మారుతున్నాయని, అనేక ఏళ్లుగా సాగుతున్న ప్రాజెక్టులను ఎప్పుడు పూర్తిచేస్తారని ప్రశ్నించారు. ఇప్పుడున్న ప్రాజెక్టులన్నీ పూర్తిచేయాలంటే రూ.2లక్షల కోట్లు అవసరమవుతాయని, బడ్జెట్‌లో రూ.22,966 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు మేలు కలిగించేందుకు ఉద్దేశించిన భారీ ప్రాజెక్టు అని, దీనికి దేవుడి పేరు పెట్టినందున పేరు పవిత్రతను కాపాడాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేయవద్దన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యాలన్నీ ఆచరణ సాధ్యమేనన్నారు.