Share News

గడపకు చేరని గణన!

ABN , Publish Date - Jun 10 , 2026 | 05:16 AM

ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న జనగణన ప్రక్రియ.. తొలిదశలో ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతమంతా తిరిగి ఇళ్ల వివరాలు నమోదు చేయాలి.

గడపకు చేరని గణన!

  • జనగణనలో ఇళ్ల నమోదు ప్రక్రియ పూర్తయిందని ప్రకటించిన గణాంకాల శాఖ

  • 99 శాతం ఇళ్ల వివరాలు సేకరించామని వెల్లడి

  • కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా పరిస్థితి

  • వివరాల కోసం తమ వద్దకు ఎవరూ రాలేదంటున్న 40 శాతం కుటుంబాలు

  • ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకున్నవారి ఇళ్లకూ వెళ్లని ఎన్యూమరేటర్లు

  • ‘ఆంధ్రజ్యోతి’ నమూనా సర్వేలో గుర్తింపు

  • అరకొరగా సర్వే పూర్తిచేశారన్న ఆరోపణలు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న జనగణన ప్రక్రియ.. తొలిదశలో ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతమంతా తిరిగి ఇళ్ల వివరాలు నమోదు చేయాలి. ఈ వివరాల ఆధారంగానే తర్వాతి దశలో కుటుంబాల వివరాలనూ సేకరించాలి. రాష్ట్రంలో ఇళ్ల నమోదు ప్రక్రియ (హెచ్‌ఎల్‌ఓ) మంగళవారంతో ముగిసినట్టు అధికారులు ప్రకటించారు. 99శాతం ఇళ్ల వివరాలు సేకరించామని తెలిపారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. చాలా మంది వివరాల సేకరణ కోసం తమ వద్దకు ఎవరూ రాలేదని చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో జనగణన కోసం నమోదు చేసుకున్నవారు కూడా తమను ఎన్యూమరేటర్లు సంప్రదించలేదంటున్నారు. దీంతో ‘ఆంధ్రజ్యోతి’ నమూనా సర్వే నిర్వహించింది. జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ సంస్థ కార్యాలయంలో 66 మంది ఉద్యోగులతో మాట్లాడింది. అందులో 37మంది తమ ఇళ్ల వద్దకు ఎన్యూమరేటర్లు వచ్చారని చెప్పగా.. మిగతా 29మంది ఇళ్ల వద్ద అందుబాటులోనే ఉన్నామని, ఎవరూ రాలేదని వెల్లడించారు. అంటే 44 శాతం మంది ఎన్యూమరేటర్లు తమ ఇళ్లవద్దకు రాలేదని చెప్పడం గమనార్హం. సర్వేలో పాల్గొన్నవారిలో హైదరాబాద్‌లోని కొత్తపేట, యూసు్‌ఫగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, బోయిన్‌పల్లి, ఫిల్మ్‌నగర్‌, అత్తాపూర్‌, మణికొండ హనుమాన్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, హైదర్‌నగర్‌, షేక్‌పేట, అత్తాపూర్‌, భరత్‌నగర్‌, కొండాపూర్‌, కీసర తదితర ప్రాంతాలకు చెందినవారు తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర జనాభాలో దాదాపు సగం మంది ఉండే గ్రేటర్‌ హైదరాబాద్‌లో జనగణన తీరు చర్చనీయాంశంగా మారింది.


99శాతం సర్వే పూర్తయిందన్న గణాంకాల శాఖ

జనగణనలో భాగంగా రాష్ట్రంలో తొలి దశ కింద ఏప్రిల్‌ 26 నుంచి మే 10 వరకు ఆన్‌లైన్‌లో వివరాల నమోదుకు అవకాశం కల్పించారు. రాష్ట్ర జనాభాలో కేవలం 5శాతం కుటుంబాలే అందులో నమోదు చేసుకున్నాయి. ఇక మే 11న ఇళ్ల నమోదు ఆపరేషన్‌ (హెచ్‌ఎల్‌ఓ)ను ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి హౌస్‌ సెన్సస్‌ నంబర్లు కేటాయించారు. ఆ వివరాలను సెన్సస్‌ మొబైల్‌ యాప్‌లో నమోదు చేశారు. ఈ ప్రక్రియ మంగళవారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వరకు 99శాతం సర్వే పూర్తి చేశామని గణాంకాల శాఖ పేర్కొంది. పూర్తి వివరాలను బుధవారం వెల్లడించనున్నట్టు తెలిపింది. ఇక ‘‘హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డు లోపలి ప్రాంతమైన ‘కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ(క్యూర్‌)’ పరిధిలో 46 లక్షల కుటుంబాలు ఉన్నట్టు గుర్తించాం. జనాభా 1.60కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక్కడ 98శాతానికిపైగా సర్వే పూర్తయింది. తాళం వేసి ఉన్న ఇళ్లకూ రెండు, మూడు పర్యాయాలు వెళ్లి వీలైనంత మేర వివరాలు సేకరించాం’’అని అధికారులు తెలిపారు. కానీ క్షేత్రస్థాయిలో చాలా మంది తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు ఎవరూ రాలేదని చెబుతున్నారు. స్వీయగణనలో భాగంగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకున్న వారూ ఎన్యూమరేటర్లు రాలేదంటున్నారు.

ఇళ్ల సెన్సస్‌ నంబర్లు కీలకం..

క్యూర్‌ పరిధిలోని 2,053 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని 20వేల హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌ (హెచ్‌ఎల్‌బీ)లుగా గుర్తించారు. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించేందుకు సుమారు 22 వేల మంది ఎన్యూమరేటర్లను నియమించారు. ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్‌లో ఉండే 200-300 ఇళ్లకు వెళ్లి 33 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలతో సమాచారం సేకరించాలి. ఈ ప్రక్రియ ఫిబ్రవరిలో జరగనుంది. కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి సంబంధించిన విద్య, ఉద్యోగం, కులం, ఇతర వివరాలు తీసుకుంటారు. అందుకోసం ఇప్పుడు కేటాయించిన హౌస్‌ సెన్సస్‌ నంబర్లు చాలా కీలకమని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు సెన్సస్‌ నంబర్లు వేయని ఇళ్లు, కుటుంబాల సమాచారాన్ని పూర్తిస్థాయి జనగణన సమయంలో పరిగణనలోకి తీసుకుంటారా,లేదా, అందుకు అవకాశం ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనగణన వివరాల ఆధారంగానే.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తారని అధికారులు చెబుతున్నారు. అంత కీలకమైన జనగణనలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఇంటింటికీ తిరగకుండానే.. రికార్డుల్లోని ఇంటి నంబర్ల ఆధారంగా నామ్‌కేవాస్తే సర్వే చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jun 10 , 2026 | 05:16 AM