Share News

హత్యకు వారం రోజులుగా రెక్కీ

ABN , Publish Date - May 09 , 2026 | 06:28 AM

చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగిన బీటెక్‌ విద్యార్థి బొమ్మన యావన్‌ అలియాస్‌ అఖిల్‌(23) హత్య పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.

హత్యకు వారం రోజులుగా రెక్కీ

  • యావన్‌ను చంపిన యువతి బావ, అన్న

  • పోలీసు కేసు పెట్టాలని యువతిపై ఒత్తిడి

  • లేదంటే చంపేస్తామని ముందే హెచ్చరిక

  • యావన్‌కు ఫోన్‌ చేసి చెప్పిన యువతి

  • పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

బౌద్ధనగర్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగిన బీటెక్‌ విద్యార్థి బొమ్మన యావన్‌ అలియాస్‌ అఖిల్‌(23) హత్య పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. యావన్‌ ప్రేమించిన యువతి బంధువులు వారం నుంచి హత్యకు పథకం వేసినట్లు వెల్లడైంది. జవహర్‌నగర్‌కు చెందిన యావన్‌, మేడిబావికి చెందిన యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యావన్‌ తరచూ మేడిబావికి వచ్చి తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ స్నేహితులను కలిసేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి 9గంటల సమయంలో ఇందిరానగర్‌కాలనీ రోడ్డునెంబర్‌-5లో యావన్‌ తన స్నేహితులతో కలిసి ఓ ఇంటి అరుగుపై కూర్చొని ఉండగా.. బైక్‌లపై వచ్చిన ఆరుగురు యువకులు యావన్‌తో వాగ్వాదానికి దిగి, కత్తులతో దాడి చేసి పరారయ్యారు. యావన్‌ను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హత్యచేసిన తర్వాత నిందితులు యావన్‌ ఫొటోపై ‘ఫుల్‌ మర్డర్‌’ అని రాసి స్నాప్‌చాట్‌లో పోస్టు చేయడంతో పోలీసులు రంగంలో దిగారు. యువతి బావ సాయి, సోదరుడు పరమేశ్‌ ప్రధాన సూత్రధారులని విచారణలో గుర్తించారు.


యావన్‌కు యువతి ఫోన్‌ చేసి హెచ్చరించినా..

యావన్‌పై యువతితో పోలీస్‌ కేసు పెట్టించేందుకు ఆమె కుటుంబసభ్యులు ప్రయత్నించినట్లు, లేదంటే ఇద్దరినీ చంపేస్తామని ఆమె బావ సాయి హెచ్చరించినట్లు ఓ ఆడియో కాల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ‘‘నీపై పోలీసు కేసుపెట్టాలని ఇంట్లో ఒత్తిడి చేస్తున్నారు. కాలేజీకి వెళ్లకు.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చి టార్చర్‌ చేస్తున్నాడని చెప్పు అంటున్నారు. ఇదంతా మా బావ ప్లానే. మేం ఫిర్యాదు రాస్తాం, నువ్వు వచ్చి సంతకం పెట్టాలన్నాడు. లేదా ఇద్దరినీ చంపేస్తానని మా బావ అంటున్నాడు’’ అని యువతి పేర్కొన్నట్టుగా అందులో ఉంది. అయితే.. ‘ఇప్పుడు కామ్‌గా ఉన్నాం కదా! మళ్లీ ఇదేం లొల్లి?’ అని యావన్‌ ప్రశ్నించినట్టు ఉంది. ఈ ఆడియో కాల్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, నిందితుడు సాయికి నేర చరిత్ర ఉంది. గతంలో మేడిబావికి చెందిన ఏడుగురిని కొట్టిన కేసులో 15 రోజులు రిమాండ్‌కు వెళ్లి విడుదలయ్యాడు. ఇటీవల ఓ స్విగ్గీ డెలివరీ బాయ్‌పై, మరొకరిపై దాడి చేయడంతో కేసు నమోదుకాగా.. రాజీ కుదుర్చుకున్నాడు.

యువతి ఇంటి ముట్టడికి యత్నం..

యావన్‌ కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు శుక్రవారం ఉదయం యువతి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారిని పట్టుకుంటామని సికింద్రాబాద్‌ జోన్‌ డీసీపీ రక్షితకృష్ణమూర్తి తెలిపారు. యావన్‌ మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించగా, శుక్రవారం సాయంత్రం పోలీస్‌ బందోబస్తు మధ్య సీతాఫల్‌మండి స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - May 09 , 2026 | 06:29 AM