ఐదో అంతస్తు నుంచి కింద పడి.. మృత్యువును జయించిన బాలుడు
ABN , Publish Date - Jul 09 , 2026 | 06:03 AM
ఐదో అంతస్తు నుంచి కింద పడి, ప్రాణాంతక గాయాలతో కోమాలోకి వెళ్లిన బాలుడు.. ఐదువారాల చికిత్స అనంతరం కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నాడు.
ఐదువారాల క్రితం హైదరాబాద్‌లో ఘటన
అధిక రక్తస్రావంతో కోమాలోకి బాలుడు
ప్రాణాలు కాపాడిన రెయిన్‌బో వైద్యులు
హైదరాబాద్ సిటీ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఐదో అంతస్తు నుంచి కింద పడి, ప్రాణాంతక గాయాలతో కోమాలోకి వెళ్లిన బాలుడు.. ఐదువారాల చికిత్స అనంతరం కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నాడు. ఈ ప్రమాదంలో అతడి బృహద్ధమని (గుండె నుంచి ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్న రక్తాన్ని శరీరంలోని మిగిలిన భాగాలకు తీసుకెళ్లే అతిపెద్ద ధమని), మెదడు, క్లోమగ్రంథి దెబ్బతిన్నా.. మూత్రపిండాలు విఫలమైనా.. రెయిన్‌బో ఆస్పత్రి వైద్యుల కృషితో మృత్యువును జయించాడు!! హైదరాబాద్‌లోని నిజాంపేట ప్రాంతానికి చెందిన పదమూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు ఐదంతస్తుల భవనం మీద నుంచి జారిపడ్డాడు. తల్లిదండ్రులు అతణ్ని తొలుత సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కానీ, అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆస్పత్రికి తరలించారు. భవనం మీద నుంచి పడటం వల్ల ఆ బాలుని తొడ ఎముక విరిగిందని, తలకు తీవ్రగాయాలయ్యాయని.. శరీరంలోని బృహద్ధమనికి ప్రాణాంతకమైన రీతిలో గాయమైందని.. మెదడు, క్లోమగ్రంథికి కూడా గాయాలయ్యాయని.. మూత్రపిండాలు విఫలమయ్యాయని వైద్యులు తెలిపారు. అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. ఇలాంటి గాయా ల బారిన పడిన వారిలో 80-90 శాతం మంది రోగులు మరణిస్తారని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యం లో.. బాలుడికి సమగ్ర చికిత్స చేసి, అతడి ప్రాణాలు కాపాడేందుకు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, న్యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఆర్థోపెడిక్ సర్జన్, క్రిటికల్ కేర్ నర్సులు, ఫిజియోథెరపి్‌స్టలు.. ఇలా వివిధ విభాగాల నిపుణులతో ఒక బృందాన్నే ఏర్పాటు చేసినట్టు రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ అనుపమ పేర్కొన్నారు.
అసాధారణమైన పీడియాట్రిక్ ట్రామా రికవరీలలో ఒకటిగా ఈ కేసును ఆమె అభివర్ణించారు. బాలుడు ఆస్పత్రికి వచ్చినప్పుడు ప్రధాన అవయవ వ్యవస్థ దెబ్బతిని ఉన్నదని.. అందుకే అన్ని విభాగాల నిపుణులూ సమన్వయంతో అతడికి చికిత్స చేసినట్టు చెప్పారు. బాలుడికి సుదీర్ఘకాలం మెకానికల్ వెంటిలేషన్, డయాలసిస్.. అనుక్షణం వైద్య పర్యవేక్షణ అవసరమైందని తెలిపారు. డాక్టర్లు, నర్సులు, పారామె డికల్ సిబ్బంది కృషి వల్ల అతను కోలుకోగలిగాడన్నారు. ఆస్పత్రిలో చేరిన రెండు వారాలకు అతనికి వెంటిలేషన్ తొలగించామని, ఐదు వారాల తర్వాత పూర్తి ఆరోగ్యంతో ఆ బాలుడు ఇంటికి వెళ్లాడని ఆమె తెలిపారు. కాగా.. బాలుడి బృహద్ధమనికి అయిన గాయం ప్రాణంతకమైనదని రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరావు కోనేటి తెలిపారు. దానికి తక్షణ చికిత్స అవసరమని.. కొద్దిపాటి ఆలస్యమైనా ప్రాణా లు పోయే ప్రమాదం ఉందని వివరించారు.