Share News

లాల్‌దర్వాజ కాడా అదిరె బోనాల బాజా!

ABN , Publish Date - Aug 10 , 2026 | 05:49 AM

మొక్కుల్లో భాగంగా కోళ్లు, యాటలు తెగాయ్‌! ఆ వెంటనే డోలు, సన్నాయిల నడుమ శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు!

లాల్‌దర్వాజ కాడా అదిరె బోనాల బాజా!

  • ఘనంగా మహంకాళి అమ్మవారి ఉత్సవాలు

  • ప్రభుత్వం తరఫున సురేఖ, పొన్నం పట్టువస్త్రాలు

  • దర్శించుకున్న బండి, దత్తాత్రేయ, కేటీఆర్‌, కవిత

  • ఆలయంలో సీపీ సజ్జనార్‌ పూజలు

  • దర్బార్‌ మైసమ్మ ఆలయంలో కిషన్‌రెడ్డి పూజలు

  • హైదరాబాద్‌లో వాడవాడలా బోనాల కోలాహలం

చాంద్రాయణగుట్ట, హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మొక్కుల్లో భాగంగా కోళ్లు, యాటలు తెగాయ్‌! ఆ వెంటనే డోలు, సన్నాయిల నడుమ శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు! చెర్నాకోలలతో పోతరాజులు విన్యాసాలు చేశారు! దారిపొడుగునా భారీ హోర్డింగులు.. ప్రత్యేక వేదికలపై జానపద నృత్యాలు, ఎల్‌ఈడీ స్ర్కీన్లపై ఆ దృశ్యాలు పాదచారులను కట్టిపడేశాయ్‌: అన్నింటికీ మించి డీజేల్లో అమ్మవార్ల పాటలు హోరెత్తించాయ్‌! ఆట బొమ్మలు, బుడగలు పట్టుకొని పిల్లల కేరింతలు.. సంప్రదాయ వస్త్రాలు ధరించి నెత్తిన బోనమెత్తుకొని కదిలిన మహిళలు, యువతులు .. ఇలా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా భాగ్యనగరంలోని అమ్మవార్ల ఆలయాలన్నీ జన జాతరతో హోరెత్తాయ్‌! ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యల్లో భక్తుల కోలాహలం కనిపించింది. రాజకీయ, సినీ ప్రముఖులు బోనాల ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీ లాల్‌ దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి బోనాల జాతర అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం ఏడు గంటల నుంచే ఆలయాల వద్ద బారులు తీరారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఇన్‌చార్జి మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు, ఉన్నతాధికారులు లాల్‌దర్వాజా అమ్మవారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు బోనంతో వచ్చి అమ్మవారిని నైవేద్యం సమర్పించారు.


హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న దేవాలయం, సుల్తాన్‌షాహి శ్రీ జగదాంబ దేవాలయం, ఉప్పుగూడ శ్రీ మహంకాళి ఆలయం, గౌలిపురా శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత దేవాలయం, మీరాలమండి శ్రీ మహంకాళి దేవాలయం, చందూలాల్‌ బేలా శ్రీ ముత్యాలమ్మ దేవాలయం, హరిబౌలి శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం, చార్మినార్‌ భాగ్యలక్ష్మి దేవాలయం, మేకలబండ నల్లపోచమ్మ దేవాలయం, గౌలిపురా సీఐబీ క్వార్టర్స్‌ దేవాలయంతో పాటు బస్తీలలో గల ఆలయాల వద్ద అధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. పాతబస్తీ బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లను సీపీ వీసీ సజ్జనార్‌ పర్యవేక్షించారు. లాల్‌ దర్వాజ అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. మహంకాళి అమ్మవారి ఆలయంలో ఉదయం మాజీ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ కుటుంబసభ్యులు మహాభిషేకాన్ని నిర్వహించి తొలి బోనాన్ని సమర్పించారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి బండి సంజయ్‌, ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం, పైడి రాకేశ్‌రెడ్డి, రాజ్‌ఠాకూర్‌, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, మహిళా కమిషనర్‌ చైర్మన్‌ గద్వాల విజయలక్ష్మీ, తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, హైదరాబాద్‌ కలెక్టర్‌ ప్రియాంక, మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి తలసాని, సినీ దర్శకుడు వంగా సందీప్ రెడ్డి, ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ హన్మంతరావు, బీసీ సంక్షేమశాఖ ప్రభుత్వ సలహాదారు వి.హన్మంతరావు తదితరులు ఉన్నారు. కార్వాన్‌ దర్బార్‌ మైసమ్మ ఆలయంలో అమ్మవారికి మంత్రి దామోదర పట్టువస్త్రాలు సమర్పించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కట్టమైసమ్మ ఆలయంలో శ్రీధర్‌బాబు పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, భద్రకాళి బ్యానర్‌పై రూపొందుతున్న తన కొత్త సినిమా విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు సినీనటుడు విజయ్‌ దేవరకొండ తెలిపారు.

Updated Date - Aug 10 , 2026 | 05:50 AM