మీట నొక్కుతాడు..కారు నంబర్ మార్చేస్తాడు
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:57 AM
మీట నొక్కగానే.. వాహనం నంబర్ ప్లేట్ స్థానంలో నకిలీది ప్రత్యక్షం అవుతుంది.. మరోసారి నొక్కితే అసలుది కనిపిస్తుంది. ఇదేదో మ్యాజిక్ అనుకుంటే పొరపాటే.
చలానాల నుంచి తప్పించుకునే ఎత్తుగడ
ప్రబుద్ధుడి ఆటకట్టించిన పోలీసులు
బంజారాహిల్స్, ఏప్రిల్ 11(ఆంద్రజ్యోతి): మీట నొక్కగానే.. వాహనం నంబర్ ప్లేట్ స్థానంలో నకిలీది ప్రత్యక్షం అవుతుంది.. మరోసారి నొక్కితే అసలుది కనిపిస్తుంది. ఇదేదో మ్యాజిక్ అనుకుంటే పొరపాటే. ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ కారు యజమాని ఈ ఎత్తుగడ వేశాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద శుక్రవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఫిలింనగర్ వైపు నుంచి వస్తున్న బీఎండబ్ల్యూ కారును ఆపి డ్రైవర్‌కు శ్వాస పరీక్ష నిర్వహించగా 137 మిల్లీగ్రాముల మద్యం తాగినట్టు తేలింది. అతనిపై కేసు నమోదు చేసి కారు నంబర్ కోసం చూడగా ముందువైపు డీఎల్ 9సీఎం7097.. వెనుక భాగంలో టీఎ్‌స9ఎ్‌ఫక్యు9999 ఉండటాన్ని గమనించారు. డ్రైవింగ్ సీటులో ఉన్న గౌతంను ప్రశ్నించగా అతనిచ్చిన జవాబు పోలీసులను విస్తుపోయేలా చేసింది. డ్రంకెన్ డ్రైవ్, ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకునేందుకు వీలుగా నంబర్ ప్లేట్ ను మార్చుకునే వ్యవస్థను కారులో ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు. ట్రాఫిక్ ఎస్సై నర్సింహారావు ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు.