Share News

హైదరాబాద్‌లో ఫార్చ్యూన్‌ 500 కంపెనీల జీసీసీలు

ABN , Publish Date - Jun 04 , 2026 | 06:14 AM

ప్రపంచస్థాయి మెడికల్‌ టూరిజం కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో ఫార్చ్యూన్‌ 500 కంపెనీల జీసీసీలు

  • గ్లోబల్‌ మెడికల్‌ టూరిజం కేంద్రంగా భాగ్యనగరం

  • ప్రపంచ అగ్రశ్రేణి సంస్థల కీలక పదవుల్లో హైదరాబాదీలు

  • దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు, జర్మనీలోని తురింగియా రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి

  • దక్షిణాఫ్రికా, జర్మనీతో తెలంగాణ వ్యూహాత్మక భాగస్వామ్యం

  • ‘తెలంగాణ రైజింగ్‌-2047’ లక్ష్యాలకు ఇరు దేశాల మద్దతు

  • పలు రంగాల్లో సహకారానికి తురింగియాతో ఎంవోయూ

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ప్రపంచస్థాయి మెడికల్‌ టూరిజం కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్యసేవలు అందుబాటులో ఉండటంతో పశ్చిమాసియా దేశాలతో పాటు అనేక దేశాల ప్రజలు హైదరాబాద్‌ వస్తున్నారని తెలిపారు. అత్యాధునిక ఆస్పత్రులు, నిపుణులైన వైద్యులు, మెరుగైన ఆరోగ్య మౌలిక వసతులు తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయని చెప్పారు. బుధవారం సీఎం రేవంత్‌తో దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్‌ మషాటిలే, జర్మనీ దేశం తురింగియా రాష్ట్ర ముఖ్యమంత్రి మారియో వోయిట్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందాలు సమావేశమయ్యాయి. ఈ భేటీల్లో విద్య, వైద్యం, పరిశ్రమలు, పెట్టుబడులు, స్టార్ట్‌పలు, నైపుణ్యాభివృద్ధి, సెమీకండక్టర్లు, మెడికల్‌ టూరిజం రంగాల్లో సహకార విస్తరణపై కీలక చర్చలు జరిగాయి. తురింగియా, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ సమావేశాలు రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ప్రాధాన్యాన్ని చాటాయి. ముందుగా దక్షిణాఫ్రికా బృందంతో చర్చించిన సీఎం.. తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్‌ ప్రత్యేకతలను వివరించారు. ఐటీ, ఫార్మా, రక్షణ, ఏరోస్పేస్‌ వంటి రంగాలకు నైపుణ్య మానవ వనరులను తయారుచేసి ప్రపంచానికి అందించేలా హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఫార్చ్యూన్‌-500 కంపెనీలు తమ గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలు, విశ్వ విద్యాలయాలు, పరిశోధన కేంద్రాలు హైదరాబాద్‌ను నాలెడ్జ్‌ సిటీగా మార్చాయన్నారు.


30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’ ప్రాజెక్టును గురించి కూడా వివరించారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2025 భారీ విజయం సాధించిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, దౌత్యవేత్తలు, పాల్గొనడంతో కొత్త పెట్టుబడి అవకాశాలు లభించాయని చెప్పారు. ఈ ఏడాది కూడా డిసెంబరులో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించారు. దీనికి దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు సానుకూలంగా స్పందిస్తూ పెద్దసంఖ్యలో తమ ప్రతినిధులు పాల్గొంటారని చెప్పా రు. తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయని, భవిష్యత్తులో మరింత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ భేటీ ద్వారా తెలంగాణ-దక్షిణాఫ్రికా మధ్య విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమల రంగాల్లో కొత్త సహకార అవకాశాలకు మార్గం సుగమమైందని అభిప్రాయపడుతున్నారు.

ఆవిష్కరణకు కేంద్ర బిందువుగా తెలంగాణ

టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్ట్‌పలు, లైఫ్‌ సైన్సె స్‌ రంగాల్లో పరస్పర సహకారం కోసం తెలంగాణ ప్రభుత్వం, జర్మనీలోని తురింగియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓ యూ) కుదిరింది. తురింగియా సీఎం మారియో వోయిట్‌ తెలంగాణను భారతదేశంలో అభివృద్ధి, ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా అభివర్ణించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన ‘తెలంగాణ రైజింగ్‌-2047’ విజన్‌పై ప్రశంసలవర్షం కురిపించారు. భారత-జర్మనీ సంబంధాల్లో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పా రు. ఇంతటి వృద్ధి సాధించిన రాష్ట్రంతో భాగసామ్యం కావడం తమకు గౌరవంగా ఉందన్నారు. రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర యువత ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభ చాటుతున్నారని, సిలికాన్‌ వ్యాలీ విజయాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. హైదరాబాద్‌లో జర్మన్‌ భాషా శిక్షణకు సహకరించాలని తురింగియా ప్రతినిధులను సీఎం కోరారు. జర్మనీ, జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలకు అవసరమైన నైపుణ్యాలతో తెలంగాణ యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ వర్సిటీ, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో బోధ న విధానాలను మార్చేందుకు తురింగియా సహకారం కావాలని కోరారు. అందుకు తమ విద్యాసంస్థలు, పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయని మారి యో వోయిట్‌ తెలిపారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తుండగా, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల రా ష్ట్రాలు భాగస్వామ్యం కోసం ముందుకురావడం రాష్ట్ర ప్రతిష్ఠను మరింత పెంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఒప్పందం రాష్ట్ర యువతకు అంతర్జాతీయస్థాయి అవకాశాలను అందించే దిశగా కీలక అడుగు అని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశాల్లో మంత్రులు దామోదర, శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 06:14 AM