జీసీసీల గమ్యస్థానంగా హైదరాబాద్
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:55 AM
ప్రపంచంలోని దిగ్గజ ఆర్థిక సంస్థలన్నీ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్‌ను గమ్యస్థానంగా ఎంచుకున్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు..
నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలు ఉండటంతోనే దిగ్గజ సంస్థల రాక..
ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: శ్రీధర్ బాబు
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోని దిగ్గజ ఆర్థిక సంస్థలన్నీ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్‌ను గమ్యస్థానంగా ఎంచుకున్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే పికో టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు శనివారం సచివాలయంలో శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. పికో టెక్నాలజీ ఇండియా అనే అనుబంధ కంపెనీ ద్వారా ఇక్కడ జీసీసీ ఏర్పాటు చేయడానికి ఈ సంస్థ ముందుకొచ్చింది. ఈ సందర్భంగా మంత్రి వారికి ఇక్కడి అవకాశాలు, మౌలిక వసతుల గురించి వివరించారు. బెంగళూరు, ముంబై నగరాలతో పోలిస్తే ఇక్కడ ఆఫీసు స్థలాల ఆక్యుపెన్సీ 73 శాతం ఉందని చెప్పారు. ఇటు కోటి (10 మిలియన్లు) టెలివిజన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న హైదరాబాద్‌కు చెందిన ‘రేడియంట్ అప్లయన్సెస్ అండ్ ఎలక్ర్టానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ప్రతినిధుల్ని శ్రీధర్ బాబు సచివాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎలకా్ట్రనిక్స్ తయారీలో గ్లోబల్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. రేడియంట్ సంస్థ సాధించిన ఈ ఘనత తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో రెజల్యూట్ గ్రూప్‌చైర్మన్ రామిందర్ సింగ్ సోయిన్, డైరెక్టర్ మణికందన్ పాల్గొన్నారు.