మా పాపను బతికించరూ..!
ABN , Publish Date - Jun 27 , 2026 | 06:49 AM
ముక్కు పచ్చలారని ఆ చిన్నారి అరుదైన జన్యు వ్యాధి బారిన పడింది. పాప బతకాలంటే సుమారు రూ.10 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉండటంతో..
అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న చైత్రిక
రూ.10 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్‌తో బతికే అవకాశం
దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు..
బౌద్ధనగర్, జూన్ 26: ముక్కు పచ్చలారని ఆ చిన్నారి అరుదైన జన్యు వ్యాధి బారిన పడింది. పాప బతకాలంటే సుమారు రూ.10 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉండటంతో.. అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేదని ఆమె తల్లితండ్రులు తల్లడిల్లుతున్నారు. తమ పాపను బతికించుకోవడానికి దాతల సాయం కోసం అర్థిస్తున్నారు. అంబర్‌పేటకు చెందిన 8 నెలల చిన్నారి చైత్రిక స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ(ఎస్‌ఎంఎస్) టైప్-1 ప్రమాదకర వ్యాధితో బాధపడుతోంది. వనపర్తి జిల్లా నెల్విడికి చెందిన ఆమె తల్లిదండ్రులు బేరి రమేశ్-మౌనికలు కొన్నేళ్ల కింద వలస వచ్చి అంబర్‌పేటలో ఉంటున్నారు. రమేశ్ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే పుట్టిన కొన్ని నెలలకే చైత్రిక కదలలేకపోవడం, అనారోగ్యం బారిన పడటంతో తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. ఎంతకీ నయం కాకపోవడంతో చివరికి నిమ్స్, రెయిన్‌బో ఆస్పత్రులకు తీసుకెళ్లగా.. పాప అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ బారిన పడిందని తేల్చారు. ఆమె కండరాలు బలహీనపడి, ఊపిరి తీసుకోవటం కూడా రానురాను కష్టంగా మారుతుందని.. ఈ వ్యాధిని నివారించాలంటే రెండేళ్ల వయసులోపే రూ.10 కోట్ల ఖరీదైన (ఒనాసెమ్మోజీన్ అబెపార్వోవెక్) ఇంజెక్షన్ చేయించాలని వైద్యులు సూచించారు. దీంతో అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేదని.. పాపను ఎలా బతికించుకోవాలని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. శుక్రవారం సీతాఫల్‌మండిలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ను కలిసి రమేశ్ దంపతులు తమ సమస్యను వివరించారు. స్పందించిన ఆయన వైద్య ఖర్చుల కోసం రూ.లక్ష ఇస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లి పాపను బతికించేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. స్థానిక బీఆర్‌ఎస్ నేత రామచందర్ కూడా రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు.