త్వరలో అంబేడ్కర్ మ్యూజియం!
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:47 AM
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరాన కొలువైన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ప్రాంగణంలో త్వరలోనే అద్భుతమైన మ్యూజియం అందుబాటులోకి రానుంది.
15 కోట్లతో విగ్రహం దిగువన ఏర్పాటుకు సన్నాహాలు
టెండర్లు ఆహ్వానించిన హెచ్‌ఎండీఏ
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి9 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరాన కొలువైన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ప్రాంగణంలో త్వరలోనే అద్భుతమైన మ్యూజియం అందుబాటులోకి రానుంది. విగ్రహం దిగువన 50 అడుగుల ఎత్తుతో, పార్లమెంటు ఆకారంలో నిర్మించిన పీఠం లోపల ఈ మ్యూజియంను ఏర్పాటు చేసేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రూ.15 కోట్లతో అధికారులు తాజాగా టెండర్లను ఆహ్వానించిచారు. ఈ మ్యూజియంలో అంబేడ్కర్ జీవిత చరిత్ర, ఆయన వాడిన అరుదైన వస్తువులు, ఫొటో గ్యాలరీ, భారీ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నారు. గత అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఎంపికైన కళాఖండాలను కూడా ఇక్కడ ప్రదర్శించనున్నారు. వచ్చే అంబేడ్కర్ జయంతి నాటికి ఈ మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని హెచ్‌జీసీఎల్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.