Share News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో గంజాయి పట్టివేత

ABN , Publish Date - May 21 , 2026 | 03:26 AM

బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ.3.05 కోట్ల విలువైన గంజాయిని శంషాబాద్‌ విమానాశ్రయంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెంట్...

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో గంజాయి పట్టివేత

  • బ్యాంకాక్‌ నుంచి వస్తున్న ప్రయాణికుల వద్ద స్వాధీనం

  • విలువ రూ.3.05 కోట్లు

శంషాబాద్‌ రూరల్‌, హైదరాబాద్‌, మే 20(ఆంధ్రజ్యోతి): బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ.3.05 కోట్ల విలువైన గంజాయిని శంషాబాద్‌ విమానాశ్రయంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెంట్‌(డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన 6ఈ 1068 ఇండిగో విమానం దిగి బయటకు వస్తున్న ప్రయాణికుల బ్యాగులను తనిఖీలు చేస్తుండగా 8.705 గ్రాముల హైడ్రోపోనిక్‌ గంజాయి పట్టుబడింది. ఇద్దరిని అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తరచూ హైడ్రోఫోనిక్‌ గంజాయి పట్టుబడటం కలకలం సృష్టిస్తోంది. విదేశీ గంజాయి స్మగ్లర్లు హైడ్రోఫోనిక్‌ గంజాయి రవాణాకు బ్యాంకాక్‌ టు హైదరాబాద్‌, కౌలాలంపూర్‌ టు హైదరాబాద్‌ మార్గాలను ఎంచుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అమాయక ప్రయాణికులకు డబ్బు ఆశ చూపించి కొరియర్లుగా వాడుకుంటున్నట్లు భావిస్తున్నారు. సూత్రధారి కోసం కేంద్ర నిఘా సంస్ధలు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కస్టమ్స్‌, డీఆర్‌ఐ అధికారుల సోదాల్లో 90కిలోల హైడ్రోఫోనిక్‌ గంజాయి స్వాధీనం అయ్యింది. దీని విలువ రూ.45కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రగ్‌ స్మగ్లర్లలో తమకు కొరియర్లుగా మారిన వారిలో కొంతమందిని నేరుగా బ్యాంకాక్‌ లేదా కౌలాలంపూర్‌ నుంచి హైదరాబాద్‌ పంపుతుండగా, మరికొన్ని సందర్భాల్లో కస్టమ్స్‌, డీఆర్‌ఐ కళ్లు కప్పడానికి దుబాయి, ఖతార్‌ మీదుగా పంపిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని అధికారులు తెలిపారు. ఫాల్స్‌ బాటమ్‌ ట్రాలీ బ్యాగులు గంజాయి రవాణాలో కీలకంగా మారినట్లు పలు సందర్భాల్లో స్పష్టమైందని వివరించారు.

Updated Date - May 21 , 2026 | 03:26 AM