అడ్వాన్స్‌డ్ నర్సింగ్ శిక్షణ కేంద్రం ప్రారంభం
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:43 AM
నర్సుల్లో నైపుణ్యాలను పెంచడానికి కృషిచేసే అడ్వాన్స్‌డ్ సిమ్యులేషన్ కేంద్రం హైదరాబాద్‌లో సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): నర్సుల్లో నైపుణ్యాలను పెంచడానికి కృషిచేసే అడ్వాన్స్‌డ్ సిమ్యులేషన్ కేంద్రం హైదరాబాద్‌లో సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. శిక్షణ పొందిన నర్సుల సంఘం (టీఎన్‌ఏఐ) తెలంగాణ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన దీనిని అకడమిక్ డీఎంఈ డాక్టర్ శివరాం ప్రసాద్ ప్రారంభించారు. నర్సింగ్ విద్య, సిమ్యులేషన్ ఆధారిత శిక్షణ, క్లినికల్ నైపుణ్యాల అభివృద్ధి, రోగుల భద్రత, నాణ్యమైన ఆరోగ్య సేవల బలోపేతానికి ఈ కేంద్రం ఓ మైలురాయిగా నిలుస్తుందని టీఎన్‌ఏఐ తెలిపింది. ప్రపంచ స్థాయి నర్సింగ్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రూ.3 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు పేర్కొంది. అకడమిక్ డీఎంఈ డాక్టర్ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ.. వైద్యులు, నర్సులు సమన్వయంతో పనిచేసినప్పుడే నాణ్యమైన వైద్య సేవలు అందించగలమన్నారు. ఈ కేంద్రం ద్వారా నర్సింగ్ విద్యార్థులకు అత్యాధునిక సిమ్యులేషన్ ఆధారిత ప్రాక్టికల్ శిక్షణ అందించి వారి క్లినికల్ నైపుణ్యాలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. నర్సింగ్ విద్యాభివృద్ధికి, పరిశోధనలు, అధ్యాపక శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందిస్తున్న టీఎన్‌ఏఐ ప్రధాన కార్యాలయాన్ని ఆయన అభినందించారు.