మరో ఢిల్లీలా మారొద్దనే ఈవీ బస్సులు: పొన్నం
ABN , Publish Date - May 28 , 2026 | 03:29 AM
హైదరాబాద్ నగరం వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుని మరో ఢిల్లీలా మారకూడదనే పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు...
కూకట్‌పల్లి డిపోలో 60 ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, మే 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరం వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుని మరో ఢిల్లీలా మారకూడదనే పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా కూకట్‌పల్లి డిపోలో 60 నూతన ఎలక్ట్రిక్ బస్సులను బుధవారం జెండా ఊపి ప్రాంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 540, రాష్ట్రవ్యాప్తంగా 1050 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయన్నారు. త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు నిర్వహి స్తామని, ఆ తర్వాత ఎన్నికైన సంఘాలతో కలిసి ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. కార్మికులకు పీఆర్‌సీ అమలుతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఈవీ బస్సుల విస్తరణలో భాగంగా ప్రధాన డిపోలు, బస్టాండ్లలో అత్యాధునిక చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. అనంతరం మంత్రి పొన్నం, ఎండీ నాగిరెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేశ్ నూతన ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించారు.
గుర్తింపు సంఘం ఎన్నికల తర్వాతే ఆర్టీసీ విలీనం: పొన్నం
ఆర్టీసీలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలకు ఎన్నికలు నిర్వహించిన తర్వాతే.. సంస్థ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని అనంతరం గెలిచిన గుర్తింపు సంఘం ప్రతినిధులు, అధికారులు కమిటీగా ఏర్పడి విలీన ప్రక్రియ ప్రారంభిస్తారని తెలిపారు. పొరుగున ఉన్న ఏపీలో విలీనం తర్వాత అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇక్కడ ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త వహిస్తున్నామని చెప్పారు.