Share News

డబ్బుల్లేకుంటేనేం.. స్వైపింగ్‌ మెషీన్‌ ఉందిగా..

ABN , Publish Date - Aug 31 , 2026 | 05:58 AM

ఆయన హైదరాబాద్‌ శివార్లలోని ఒక ఏసీపీ.. కీలకమైన ప్రాంతం కావడంతో భూముల సెటిల్మెంట్లకు దిగారు.. అందుకోసం ఓ న్యాయవాదితో సొంతంగా ఓ బృందాన్నే ఏర్పాటు చేసుకున్నారు.

డబ్బుల్లేకుంటేనేం.. స్వైపింగ్‌ మెషీన్‌ ఉందిగా..

  • భూముల సెటిల్మెంట్లలో ఓ ఏసీపీ వసూళ్లు

  • స్వైపింగ్‌ యంత్రాలు తెప్పించి మరీ దందా

  • కోట్లాది రూపాయల ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు

  • అందుకోసం న్యాయవాదితో సొంతంగా ఓ టీమ్‌

  • విషయం తెలియడంతో ఉన్నతాధికారుల విచారణ

  • చర్యలకు ఏర్పాట్లు.. అది తెలిసి సెలవులోకి ఏసీపీ!

  • సస్పెన్షన్‌ విధించకుండా పైరవీలు, నేతలతో ఒత్తిళ్లు

హైదరాబాద్‌/దిల్‌సుఖ్‌నగర్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఆయన హైదరాబాద్‌ శివార్లలోని ఒక ఏసీపీ.. కీలకమైన ప్రాంతం కావడంతో భూముల సెటిల్మెంట్లకు దిగారు.. అందుకోసం ఓ న్యాయవాదితో సొంతంగా ఓ బృందాన్నే ఏర్పాటు చేసుకున్నారు. తన కార్యాలయాన్నే అడ్డాగా చేసుకుని చెలరేగిపోయారు. డబ్బుల్లేవంటే.. స్వైపింగ్‌ యంత్రాలను తెప్పించి, క్రెడిట్‌ కార్డులు స్వైపింగ్‌ చేయించి మరీ వసూళ్లకు పాల్పడ్డారు. ఇది మరీ శృతిమించడంతో డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. డీజీపీ ఆదేశాల మేరకు నిఘా వర్గాలు విచారణ చేశాయి. ఆ నివేదిక ఆధారంగా సదరు ఏసీపీని సస్పెండ్‌ చేయడం కోసం డీజీపీ కార్యాలయంలో ఫైల్‌ సిద్ధమైంది. ఈ సంగతి తెలుసుకున్న సదరు ఏసీపీ.. అనారోగ్య కారణాలతో ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఆపై ఒక మంత్రి, మరో ఎంపీ, ఇంకో ప్రముఖ రాజకీయ నాయకుడి ద్వారా.. సస్పెన్షన్‌ విధించకుండా ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. ఆయన ఆస్పత్రిలో ఉత్తుత్తి వైద్యం చేయించుకుంటున్నారన్న విషయం ఉన్నతాధికారులు గుర్తించడంతో డిశ్చార్జి చేయించుకుని ఇంటికి చేరుకున్నారు. అయితే ఏసీపీ ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే పైరవీలతో తన సస్పెన్షన్‌ ఉత్తర్వులను నిలిపివేయించుకున్నారని పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. సదరు ఏసీపీ మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలోని కీలక ప్రాంతంలో ఓ భూ వివాదం సెటిల్‌ చేయడం కార్డ్‌ స్వైపింగ్‌ యంత్రాలను తన కార్యాలయానికి తెప్పించుకుని మరీ..


ఇరువర్గాల నుంచి డబ్బు లెక్కలు సరిచేశారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఒక న్యాయవాదితో సొంత ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ టీమ్‌ను రంగంలో దింపి.. పలు భూవివాదాలను సెటిల్‌ చేశాడని, ఏ ఫైల్‌ పట్టుకున్నా కనీసం అరకోటి లేనిదే పనికాదని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఉన్నతాధికారులు ఆ ఏసీపీపై చర్యల కోసం సిద్ధమవగా.. డ్యూటీకి రాకుండా, ఇంకొకరికి ఇక్కడ పోస్టింగ్‌ ఇవ్వనీయకుండా రాజకీయ నాయకుల ద్వారా చక్రం తిప్పుతున్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చేనెల 19వ తేదీ వరకు ఆయన సిక్‌లీవ్‌ పెట్టడంతో.. ప్రస్తుతం పక్కజోన్‌లో ఉన్న ఏసీపీకి ఆ బాధ్యతలను అప్పగించారు.

Updated Date - Aug 31 , 2026 | 05:59 AM