ట్రంప్ టవర్‌కు అనుమతులు!
ABN , Publish Date - Apr 25 , 2026 | 06:35 AM
హైదరాబాద్‌లో అత్యంత ఎత్తయిన నిర్మాణానికి హెచ్‌ఎండీఏ అనుమతులిచ్చింది. భాగ్యనగరంలో గ్రౌండ్ ప్లస్ 63 అంతస్తులతో ట్విన్ టవర్స్ నిర్మాణం జరగనుంది.
కోకాపేటలో 63 అంతస్తులతో ట్విన్ టవర్స్
నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన హెచ్‌ఎండీఏ
3 వేల నుంచి 5 వేల చ.అడుగుల వరకు
విస్తీర్ణంతో విలాసవంతమైన ఫ్లాట్లు!
పూర్తయితే దక్షిణాదిలోనే ఎత్తైన భవనంగా రికార్డు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో అత్యంత ఎత్తయిన నిర్మాణానికి హెచ్‌ఎండీఏ అనుమతులిచ్చింది. భాగ్యనగరంలో గ్రౌండ్ ప్లస్ 63 అంతస్తులతో ట్విన్ టవర్స్ నిర్మాణం జరగనుంది. హైదరాబాద్ మార్కెట్ వర్గాల్లో ’ట్రంప్’ టవర్‌గా పేర్కొంటున్న ఈ ప్రాజెక్టును కోకాపేటలోని గోల్డెన్ మైల్ లే అవుట్‌లో ఓ నిర్మాణ సంస్థ చేపడుతోంది. నిర్మాణం పూర్తయితే గనక దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత ఎత్తయిన భవనం ఇదేకానుంది. దీన్ని అత్యంత విలాసవంతమైన నివాస సముదాయంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిసింది. ఈ ట్విన్ టవర్స్‌లో 3బీహెచ్‌కే, 4బీహెచ్‌కే, 5బీహెచ్‌కేలతో 3వేల చ.అడుగుల నుంచి 5వేల చ.అడుగుల విస్తీర్ణం వరకు ఫ్లాట్ల నిర్మాణానికి ప్లాన్ చేశారు. ఈ జంట ఆకాశ హార్మ్యాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఏమాత్రం సంబంధం లేకున్నా ట్రంప్ టవర్ అనే అంటున్నారు. ఎందుకంటే.. ముంబై, పుణె, కోల్‌కతా, గుర్గావ్‌లలో నాలుగు భారీ నిర్మాణాలను ట్రంప్ టవర్ల పేరుతో నిర్మించారు. దీంతో కోకాపేటలో 63 అంతస్తులను నిర్మిస్తున్న సంస్థ కూడా ’ట్రంప్’ బ్రాండ్ తీసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. సదరు నిర్మాణ సంస్థ ఇప్పటి వరకు కొల్లూరు, కొంగరకలాన్, ఆదిభట్ల ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు చేపట్టిన్నట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ దక్షిణాదిన ఎత్తయిన భవన నిర్మాణాల్లో హైదరాబాదే టాప్‌లో ఉండేది. ఏపీ రాజధాని అమరావతిలో 48 అంతస్తులతో భవన సముదాయం నిర్మాణ దశలో ఉంది.
కొచ్చిలో 40 అంతస్తులతో, చెన్నైలో 45 అంతస్తులతో, బెంగుళూరులో 50 అంతస్తులతో ఇప్పటికే భారీ భవనాలున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే 58 అంతస్తుల భవనం ఉంది. దేశంలో అంత్యంత ఎత్తయిన నిర్మాణం ముంబైలో (88 అంతస్తులతో) ఉంది. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో.. ప్రధానంగా కోకాపేట, నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, ఖాజాగూడ, నార్సింగి, నల్లగండ్ల కొల్లురు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లలో బహుళ అంతస్తుల భవనాలు వస్తున్నాయి. ఆ ప్రాంతంలో చ.గజం ధర లక్షల్లో పలుకుతుండడం, అందుబాటులో స్థలం లేకపోవడంతో భారీ భవనాలను నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్ఐ) అనేది లేదు. ఎఫ్‌ఎస్ఐ ఉంటే ఎన్ని అంతస్తుల వరకు నిర్మాణం చేసుకోవాలనేది నిర్ణయిస్తారు. ఎఫ్‌ఎస్ఐ లేకపోవడంతో ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిరభ్యంతర పత్రం ఆధారంగా ఎన్ని అంతస్తుల వరకైనా భవనాన్ని నిర్మించుకోవచ్చు. ప్రస్తుతం ఐటీ కారిడార్‌లోని పుప్పాలగూడ, మణికొండ, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ర్ట్టిక్, నల్లగండ్లలో 40 అంతస్తుల నుంచి 58 అంతస్తుల వరకు, మిగతాచోట్ల 30 అంతస్తులతో నిర్మాణాలు చేపడుతున్నారు.
72 అంతస్తులతో భవనం
ఘట్‌కేసార్‌లో 72 అంతస్తులతో భవనాన్ని నిర్మించడానికి ఓ నిర్మాణ సంస్థ ఆసక్తి చూపుతోంది. నెల క్రితం భవన నిర్మాణ అనుమతుల కోసం హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసుకుంది. అన్ని రకాల ధ్రువీకరణలు జతపరుస్తూ నిర్మాణసంస్థ ముందుకొస్తే హెచ్‌ఎండీఏ అనుమతులు జారీ చేయనుంది. కోకాపేటలోని నియో పోలీసు లేఅవుట్‌లో కూడా ఓ సంస్థ 80 అంతస్తుల రెసిడెన్షియల్ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లుగా తెలిసింది.