కప్పం కడితేనే కట్టుకోనిస్తాం!
ABN , Publish Date - Jul 09 , 2026 | 05:43 AM
హైదరాబాద్ నగర శివార్లలోని ఓ మున్సిపాలిటీ.. ఒకరు తన స్థలంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. అప్పుడే ఓ స్థానిక ప్రజా ప్రతినిధి నుంచి ఫోన్ వచ్చింది.. స్థలంలో నిర్మాణాన్ని బట్టి తమకు..
111 జీవో పరిధిలో వసూల్‌రాజ్!.. చదరపు అడుగుకు రూ.250 దాకా వసూలు
మొయినాబాద్ పరిధిలో రిటైర్డ్ జడ్జి స్థలంలోనూ నిర్మాణాలను అడ్డుకుంటామంటూ బెదిరింపులు
రూ.12 లక్షలు ఇవ్వాలని డిమాండ్
మందుపార్టీకి ఫామ్‌హౌస్ ఇవ్వకుంటే.. కూల్చేస్తామంటూ మరొకరికి బెదిరింపులు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)
హైదరాబాద్ నగర శివార్లలోని ఓ మున్సిపాలిటీ.. ఒకరు తన స్థలంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. అప్పుడే ఓ స్థానిక ప్రజా ప్రతినిధి నుంచి ఫోన్ వచ్చింది.. స్థలంలో నిర్మాణాన్ని బట్టి తమకు సొమ్ము ముట్టజెప్పాలని, లేకుంటే నిర్మాణం సజావుగా సాగే పరిస్థితులు ఉండవని బెదిరింపులు వచ్చాయి. ఆ ఒక్క చోట కాదు.. హైదరాబాద్ శివార్లలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ముఖ్యంగా హిమాయత్‌సాగర్, గండిపేట జంట జలాశయాలకు ఎగువన 111 జీవో పరిధిలో ఉన్న ప్రాంతాల్లో వసూళ్ల పర్వం విచ్చలవిడిగా సాగుతోంది. జంట జలాశయాల పరీవాహక ప్రాంతంలో నిర్మాణాలను నియంత్రించే ఈ 111 జీవోను రద్దు చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించినా అమల్లోకి రాకపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 111 జీవో ఇంకా అమల్లోనే ఉందని ప్రకటించడంతో అనిశ్చితి కొనసాగుతోంది. మరోవైపు పెద్ద సంఖ్యలో నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం ఉండటం లేదని, ఎంతోకొంత ఇచ్చి సెటిల్ చేసుకోవాలని వారూ ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవలి ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చుచేసిన ఒక కీలక ప్రజాప్రతినిధి నేరుగా బెదిరింపులకు పాల్పడుతుండటం చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీ పరిధిలో ఓ రిటైర్డ్ జడ్జి తాను కొనుగోలు చేసిన ఓ స్థలంలో ఇటీవల నిర్మాణం మొదలు పెట్టారు. గుంతలు తవ్వించారు.
ఈ స్థలంలో నిర్మాణ బాధ్యతలు చూస్తున్నవారికి సదరు ప్రజాప్రతినిధి నుంచి బెదిరింపులు వచ్చినట్టు తెలిసింది. తాను నేరుగా డబ్బు అడగకుండా, స్థానికంగా ఉండే మరో కిందిస్థాయి ప్రజాప్రతినిధిని పంపి డబ్బు డిమాండ్ చేయించినట్టుగా ఉన్న ఒక ఆడియో కాల్ వైరల్‌గా మారింది. ‘‘అన్న (కీలక ప్రజాప్రతినిధి) పంపితే వచ్చా.. నిర్మాణం చేపడుతున్న ప్రతి చదరపు అడుగుకు రూ.250 చొప్పున ఇవ్వాల్సిందే.. ఫ్లోర్ల సంఖ్య లెక్కన, చదరపు అడుగుల చొప్పున చెల్లించాలి..’’ అని ఈ ప్రజాప్రతినిధి డిమాండ్ చేశారు. అలా లెక్కేస్తే రూ. 18.5 లక్షలు అవుతుందని, అలా ఎలా ఇస్తామని నిర్మాణ బాధ్యులు ప్రశ్నించగా.. చదరపు అడుగుకు రూ.250 చొప్పున రూ.12లక్షలు కడితే చాలని పక్కనే ఉన్న మరో ప్రజాప్రతినిధి పేర్కొన్నట్టుగా ఆ ఆడియోకాల్‌లో ఉంది. ఇలా వసూళ్ల కోసం ఇప్పటికే వేరే వాళ్ల వద్దకూ వెళ్లివచ్చినట్టు వారు పేర్కొనడం గమనార్హం.
మందు పార్టీకి ఫామ్‌హౌస్ ఇవ్వకుంటే కూల్చేస్తాం!
సదరు కీలక ప్రజాప్రతినిధి ఇటీవల ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడికి ఫోన్ చేసి తాము మందుపార్టీ చేసుకుందుకు ఫామ్‌హౌస్ కావాలని అడిగారని.. ఇందుకు అంగీకరించకపోవడంతో ఫామ్‌హౌస్ కూల్చివేయిస్తానని బెదిరించారని ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే కుమారుడు తన స్నేహితుడైన అధికార పార్టీ ఎంపీకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారని.. ఆ ఎంపీ ఈ స్థానిక ప్రజాప్రతినిధికి ఫోన్ చేసి మందలించడంతో వ్యవహారం సద్దుమణిగిందని తెలిసింది.