హుజూర్‌నగర్‌లో ‘మోడల్ కాలనీ’ సిద్ధం
ABN , Publish Date - Apr 04 , 2026 | 05:11 AM
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్మిస్తున్న మోడల్ కాలనీ ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. జీ ప్లస్-1 తరహాలో 2,160 ఇళ్లు నిర్మించగా, రహదారులు....
జీ ప్లస్-1 తరహాలో 2,160 ఇళ్ల నిర్మాణం
రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి వసతులు
తెలంగాణలో పెద్ద కాలనీల్లో ఒకటి
సూర్యాపేట, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్మిస్తున్న మోడల్ కాలనీ ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. జీ ప్లస్-1 తరహాలో 2,160 ఇళ్లు నిర్మించగా, రహదారులు, విద్యుత్, డ్రైనేజీ, మంచినీటి వసతి కల్పించారు. తెలంగాణలో పెద్దదైన కాలనీల్లో ఇది ఒకటి కాగా, హుజూర్‌నగర్ పట్టణానికి 5 కి.మీ. దూరంలో ఉన్న సీతారామచంద్రస్వామి ఫణిగిరి గట్టు వద్ద సుమారు 70 ఎకరాల్లో నిర్మించారు. ఇందుకోసం 70 ఎకరాల భూమి దేవాదాయ శాఖ నుంచి రెవెన్యూ శాఖకు బదలాయింపు చేశారు. 2012-13లో అప్పటి గృహనిర్మాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రూ.200 కోట్ల అంచనా వ్యయంతో మోడల్ కాలనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏడాదిపాటు నిర్మాణ పనులు కొనసాగగా, 25శాతం పూర్తయింది. 2014లో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో పనులు ఆగిపోయాయి. 2024 ఫిబ్రవరిలో తిరిగి నిర్మాణ పనులు మొదలయ్యాయి. మౌలిక సదుపాయాలైన మంచినీరు, రోడ్లు, విద్యుత్ స్థంబాలను ఏర్పాటుచేశారు. మురుగునీటిని శుభ్రపర్చి నిత్యావసరాలకు వాడుకునేలా 1ఎంఎల్‌డీ సామర్థ్యంతో సీవరేజ్ ట్రీట్‌మెంట్ (ఎస్టీపీ) ప్లాంట్‌ను సిద్ధం చేశారు.
మొత్తం 135 బ్లాక్‌లు
మోడల్ కాలనీలో మొత్తం 135 బ్లాక్‌లు ఉండగా, 2160 ఇళ్లు జీప్లస్-1 తరహాలో నిర్మించారు. 217 చదరపు అడుగుల్లో గ్రౌండ్ లెవల్‌లో సింగిల్ బెడ్ రూం, ఒక గది, హాల్ నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా పైన కూడా అవే కొలతలతో నిర్మించారు. ఒక్కో ఇంటికి భూమితో కలిపి రూ.8లక్షల దాకా ఖర్చు కాగా, మొత్తం రూ. 172.80 కోట్లు అయింది. మరో రూ.20 కోట్లు కూడా అదనంగా మంజూరయ్యాయి. ఎల్‌కేజీ నుంచి ఇంటర్ వరకు అదే కాలనీలో పాఠశాల భవనాన్ని రూ.10కోట్లతో నిర్మిస్తారు. మరో రూ.10కోట్లతో అంగన్‌వాడీ సెంటర్, కమ్యూనిటీ హాల్, వర్షపు నీళ్ళు వెళ్ళే కాల్వలు, పార్కు నిర్మాణం జరుగుతుంది. రహదారులన్నీ 30 అడుగుల వెడల్పుతో నిర్మించారు. ఇళ్ల కేటాయింపునకు దరఖాస్తులు ఆహ్వానించగా, సుమారు 5వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారం రోజుల్లో అర్హులైన వారందరినీ ఎంపికచేసి తుది జాబితాను ప్రభుత్వానికి సమర్పిస్తారు.
అర్హులందరికీ పట్టాలు ఇస్తాం
అర్హులైన పేదలందరికీ పట్టాలు పంపిణీ చేస్తాం. దాదాపు 1000కి పైగా ఇళ్ల సర్వే పూర్తయింది. ఇంకా ఎవరైనా ఉంటే ఎంపిక జాబితాలో పొందుపర్చుతాం. ఈ వారంలో ఎంపిక పూర్తవుతుంది.
- శ్రీనివాసులు, ఆర్డీవో హుజూర్‌నగర్