‘అమ్మా’.. అన్న పిలుపే వారికి అడ్డు
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:55 AM
అమ్మా.. నాన్నా.. అంటూ ముద్దుగా పిలిచే పిల్లలను తల్లిదండ్రులు ఎవరైనా గుండెలకు హత్తుకుంటారు.
పిల్లలను చిత్రహింసలు పెడుతున్న తల్లిదండ్రుల అరెస్ట్
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఘటన
హుజూర్‌నగర్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): అమ్మా.. నాన్నా.. అంటూ ముద్దుగా పిలిచే పిల్లలను తల్లిదండ్రులు ఎవరైనా గుండెలకు హత్తుకుంటారు. కానీ, ఆ జంట మాత్రం ఆ పిలుపునే తమ స్వేచ్ఛకు అడ్డుగా భావించింది. కనికరం లేకుండా నిత్యం చిత్రహింసలు పెడుతోంది. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో వెలుగుచూసింది. గరిడేపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన నకిరేకంటి రవి నాలుగేళ్ల కిందట ఇందు అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా అది రెండో వివాహమే. మొదటి భర్తతో కలిగిన ధనుష్ అనే ఐదేళ్ల కుమారుడు ఆమెకు ఉన్నాడు. రవి, ఇందు దంపతులకు రెండేళ్ల క్రితం హేమంత్ అనే కుమారుడు కలిగాడు. ధనుష్, హేమంత్‌తో కలసి వీరు స్థానిక ఎన్నెస్పీ క్యాంప్‌లో నివాసం ఉంటున్నారు. తమ స్వేచ్ఛకు పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించి..హేమంత్, ధనుష్‌ను కొన్నిరోజులుగా తల్లిదండ్రులు చిత్రహింసలకు గురిచేస్తున్నారు. రాడ్డును కాల్చి వీపు, పిరుదుల మీద గాయాలు చేశారు. స్థానికుల సమాచారంతో ఐసీడీఎస్ ఇన్‌చార్జి నిర్మల విచారణ చేపట్టారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ గురువారం తెలిపారు. చిన్నారులను బాలరక్ష భవనానికి తరలించినట్లు చెప్పారు.