హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో ఆకాశ హర్మ్యాలు
ABN , Publish Date - Jul 08 , 2026 | 06:16 AM
అది హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్ ప్రాంతం.. 2014 నుంచి ఆ ప్రాంతంలో ఒక్క ప్రైవేటు భవనానికి అనుమతి ఇవ్వలేదు. అలాంటిది ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు ఏకంగా 17 అంతస్తుల భారీ నిర్మాణానికి..
గుడ్డిగా అనుమతులిచ్చిన జీహెచ్‌ఎంసీ
2 సెల్లార్లు, స్టిల్ట్ ప్లస్ 17 అంతస్తులుగా 2 టవర్లు
బ్లిస్ పేరిట ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ భారీ ప్రాజెక్టు
ఆ ఒక్కటే ఎందుకంత ప్రత్యేకం అని అధికారుల ఆరా
కేటీఆర్ ఉండే జన్వాడ ఫాంహౌస్, ఈ నిర్మాణం ఒకరివే
అందుకే అక్రమ అనుమతులు అంటున్న ప్రభుత్వం
ఇది క్విడ్ ప్రో కో డీల్ అని అనుమానం
కీలక శాఖల ఎన్‌వోసీ లేకుండానే నాడు అనుమతులు
98 శాతానికిపైగా నిర్మాణాలు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే
నిర్మాణ సంస్థకు జీహెచ్‌ఎంసీ షోకాజ్ నోటీసు
అందులో ఫ్లాట్లు కొనొద్దని హెచ్చరించిన హైడ్రా
రిజిస్ట్రేషన్ గడువు కూడా ముగిసిందన్న రెరా
విక్రయాలు చేస్తే చట్టపరంగా చర్యలని హెచ్చరిక
హైదరాబాద్/సిటీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): అది హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్ ప్రాంతం.. 2014 నుంచి ఆ ప్రాంతంలో ఒక్క ప్రైవేటు భవనానికి అనుమతి ఇవ్వలేదు. అలాంటిది ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు ఏకంగా 17 అంతస్తుల భారీ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు వచ్చాయి. రెవెన్యూ అధికారుల నుంచి ఎన్‌ఓసీ లేదు, నీటి పారుదల శాఖ నుంచి అనుమతులు లేవు. ఇవేమీ లేకున్నా భారీ భవన నిర్మాణం కోసం జీహెచ్‌ఎంసీ అడ్డదారిలో అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం నిర్మాణ సంస్థ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మాణ ప్రాంతంలో 98 శాతం ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని, మరో రెండు శాతం బఫర్ జోన్‌లో ఉందని అధికారులు గుర్తించారు. అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని జీహెచ్‌ఎంసీ షోకాజు నోటీసు జారీ చేసింది. అక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేయవద్దని హైడ్రా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జన్వాడ ఫామ్‌హౌస్‌కి.. సోమాజిగూడ ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌సంస్థ చేపట్టిన బ్లిస్ ప్రాజెక్టుకు ఉన్న సంబంధం ఏంటో తేల్చాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. బడా బాబులకు గుడ్డిగా జీహెచ్‌ఎంసీ భవన నిర్మాణ అనుమతులు ఇస్తుందనడానికి ఇది మరో నిదర్శనం. డాక్యుమెంట్లు, ఇతరత్రా పత్రాలు సక్రమంగా ఉన్నా.. సామాన్యులు పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. నానా కొర్రీలు పెట్టి చుక్కలు చూపే పట్టణ ప్రణాళికా విభాగం.. రాజకీయ, అధికార అండదండలు, ధన బలం ఉన్న వాళ్లు దరఖాస్తు చేసిందే మహాభాగ్యం అన్నట్టు అనుమతులు ఇచ్చేస్తుంది. ఈ క్రమంలో జలాశయాలు, చెరువుల పక్కన ఉన్నా పట్టించుకోరు. ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుందా? బఫర్ జోన్‌లో ఉందా? అన్నదీ పరిశీలించరు. నిబంధనల్లోని లొసుగులు.. సాంకేతిక అంశాలను వారికి అనుకూలంగా మార్చి ‘అధికారి’క ముద్ర వేస్తారు. ఆక్రమణలతో ఇప్పటికే కుచించుకుపోయి, విస్తీర్ణం సగానికి తగ్గిన హుస్సేన్‌సాగర్ తీరంలో ఆకాశ హర్మ్యాల నిర్మాణం చర్చనీయాంశమైంది. రాజకీయ పలుకుబడి ఉపయోగించి.. యంత్రాంగాన్ని మెనేజ్ చేసి.. అనుమతులు తీసుకొని నిర్మించిన భవనాల భాగోతం.. నివాసయోగ్య పత్రం(ఓసీ) కోసం దరఖాస్తు చేయడంతో బహిర్గతమైంది. ఓసీ జారీ క్రమంలో సమగ్రంగా పరిశీలించిన అధికారులకు టవర్లు సాగర్ ఎఫ్‌టీఎల్/బఫర్ జోన్‌లో ఉన్నాయని నిర్ధారణ అయ్యింది. గతంలో తమ నుంచి ఎన్‌ఓసీ తీసుకోకుండానే అనుమతి ఇచ్చారని సంస్థలోని ఇరిగేషన్ విభాగం స్పష్టతనిచ్చింది. దీంతో నిర్మాణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని పేర్కొంటూ మంగళవారం జీహెచ్‌ఎంసీ నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఇదీ కథా కమామీషు...
సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్డు దగ్గర్లోని నెక్లెస్ రోడ్ ఎంఎంటీఎస్ స్టేషన్ సమీపంలో సర్వే నెంబర్ 22లో ఉన్న రెండు ఎకరాల భూమిలో ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ బహుళ అంతస్తుల భవన నిర్మాణం కోసం 2018లో జీహెచ్‌ఎంసీలో అనుమతి కోసం దరఖాస్తు చేసింది. రెండు సెల్లార్లు, స్టిల్ట్ ప్లస్ 17 అంతస్తులుగా రెండు టవర్లు, 21,992 చదరపు అడుగుల్లో క్లబ్ హౌస్ నిర్మాణానికి బల్దియా అనుమతి జారీ చేసింది. టవర్-ఏలో 85, టవర్-బీలో 68 ఫ్లాట్లు ఉన్నాయి. ప్రాజెక్టులో మొత్తం మూడు, నాలుగు పడకల గదుల ఫ్లాట్లే. సాగర తీరంలోనే స్థలం ఉన్నప్పటికీ.. అప్పటి పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు.. ఇరిగేషన్ విభాగం నుంచి ఎన్‌ఓసీ అడుగలేదు. సాధారణంగా చెరువులు, చిన్న కుంటల పక్కన స్థలంలో భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలన్నా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉందా? లేదా? అన్నది తెల్సుకునేందుకు ఇరిగేషన్, భూమి యజమాన్యపు హక్కులపై స్పష్టత కోసం రెవెన్యూ విభాగాల అభిప్రాయం కోరుతారు. నగరంలోని పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన హుస్సేన్‌సాగర్ పక్కన నిర్మించనున్న భవనాల విషయంలో ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోక పోవడం గమనార్హం.
స్థల యజమానితో వివాదం
2018లో అనుమతులు ఇచ్చినప్పటికీ స్థల యజమానితో వివాదం వల్ల ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగింది. స్థల యజమాని న్యాయస్థానాలను ఆశ్రయించగా పనులు చేపట్టకుండా ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. నాడు అధికారంలో ఉన్న వారి అండతో స్థల యజమానినినయాన, భయాన ఒప్పించి కోర్టు బయట రాజీ కుదుర్చుకున్నట్టు చెబుతున్నారు. అనంతరం పనులు వేగవంతం చేశారు. బ్లిస్ బై ప్రదీప్ కన్‌స్ట్రక్షన్‌గా నిర్మాణం చేపట్టారు.
ఓసీకి దరఖాస్తు చేయడంతో
ప్రాజెక్టు పనులు పూర్తవడంతో తాజాగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం నిర్మాణ సంస్థ దరఖాస్తు చేసింది. ప్రాజెక్టుపై గతంలో ఫిర్యాదులు రావడం.. హుస్సేన్ సాగర్‌కు సమీపంలో ఉండడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు సంస్థలోని ఇరిగేషన్ విభాగం పరిశీలనకు పంపారు. ప్రాజెక్టు నిర్మాణ విస్తీర్ణం 7640.89 చదరపు మీటర్లు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఆధారంగా టవర్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్టు గుర్తించారు. 7359.15 చదరపు మీటర్ల నిర్మాణ విస్తీర్ణం ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని, మరో 285.74 చ.మీలు బఫర్ జోన్‌లో ఉన్నట్టు తేల్చారు. దీంతో అసలు భాగోతం బయటపడింది. సోమవారం జీహెచ్‌ఎంసీ, హైడ్రా కమిషనర్లు ఆర్‌వీ కర్ణన్, ఏవీ రంగనాథ్, జిల్లా కలెక్టర్ ప్రియాంక సదరు టవర్లను పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ నివేదిక ఆధారంగా చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు నోటీసులు జారీ చేసింది. తప్పుడు సమాచారంతో తీసుకున్న అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, ఏడు రోజుల గడువు ఇచ్చారు. అయితే, అనుమతి తీసుకున్న 2018 నాటికి హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నోటిఫై కాలేదని, సమీపంలో మరో ప్రముఖ సంస్థ టవర్లకూ గతంలో అనుమతులు ఇచ్చారని ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. సాగర తీరం సమీపంలోని సామాన్యుల ప్లాట్లలో భవన నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో బడా నిర్మాణ సంస్థకు పర్మిషన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సాగర తీరం సమీపంలో ఉన్నా ఇరిగేషన్ ఎన్‌ఓసీ లేకుండా గతంలో అనుమతి ఎలా ఇచ్చారు? పర్మిషన్ జారీ చేసిన అధికారులు ఎవరు? ఎవరి ఒత్తిడి మేరకు పర్మిషన్ ఇచ్చారు? అసలు 2018లో ఏం జరిగింది? అన్న దానిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నదీ చర్చనీయాంశమైంది. చట్ట ప్రకారం నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చామని కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. విధి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనపైప్రభుత్వానికి నివేదించనున్నట్టు సమాచారం.
నాకు ఫామ్‌హౌస్.. నీకు హుస్సేన్ సాగర్
కేటీఆర్ లీజుకు తీసుకుని ఉంటున్న జన్వాడలోని ఫామ్‌హౌస్ ఆస్తి తనదేనని ప్రదీప్ రెడ్డి గతంలో కోర్టుకు తెలిపారు. అదే ప్రదీప్ రెడ్డి కి చెందిన నిర్మాణ సంస్థకు హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో రెండు భారీ టవర్ల నిర్మాణానికి అనుమతులు ఎలా వచ్చాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ప్రదీప్ రెడ్డి ఎవరని ప్రభుత్వ అధికారులు ఆరా తీస్తే.. హుస్సేన్ సాగర్ చెరబట్టేందుకు ఆయన తెరవెనుక ఎవరున్నారనేది ఆసక్తి రేపుతోంది. జన్వాడ, మిర్జాగూడ గ్రామాల పరిధిలోని సర్వే నంబర్లు 301, 313 వరకు ఉన్న భూముల్లో నిర్మాణాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో కేసులు నమోదయ్యాయి. తానే ఆ ఆస్తికి యజమానినని ప్రదీప్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ నివాసం ఉంటున్న జన్వాడ ఫామ్‌హౌస్ భూమి, సోమాజిగూడ ప్రాజెక్టు అనుమతుల మధ్య ఏదైనా పరస్పర ప్రయోజన ఒప్పందం(క్విడ్ ప్రొ కో) జరిగిందా? అనే అనుమానాలను ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. జన్వాడలో ఫామ్‌హౌస్ భూమికి సహకరించినందుకు ప్రతిఫలంగా సాగర్ ఎఫ్‌టీఎల్‌లో బహుళ అంతస్తుల ప్రాజెక్టుకు ప్రత్యేక అనుమతులు ఇచ్చారనే రాజకీయ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎలా అనుమతులిచ్చారో
హైడ్రా, సాగునీటి శాఖ అధికారులు బ్లిస్ ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ ప్రాజెక్టు స్థలంలో నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో 7355.15 చదరపు మీటర్లు హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 285.74 చదరపు మీటర్లు 30 మీటర్ల బఫర్ జోన్‌లో ఉన్నట్లు తేల్చారు. ప్రాజెక్టు స్థలంలో నిర్మాణానికి అనువైన భూమి ఒక్క చదరపు మీటరు కూడా లేదని నిర్ధారణ అయ్యింది. కీలక శాఖల అనుమతులు లేకుండానే బహుళ అంతస్తుల ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ రావడం వెనుక అప్పటి పురపాలక శాఖలో ఎవరు చక్రం తిప్పారనే ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణ ఏర్పడిన తరువాత ఎఫ్‌టీఎల్‌లో మరే ప్రైవేటు సంస్థకు ఈ తరహా నిర్మాణ అనుమతులు ఇవ్వలేదని, ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు మాత్రమే అసాధారణ రీతిలో అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. తెర వెనుక ఎవరు ఒత్తిడి తెచ్చారు? అధికారులను ఎవరు ప్రభావితం చేశారు?అనే ప్రశ్నలకు నిర్మాణ సంస్థ సమాధానం చెప్పాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.