ముందు హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన చేయండి
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:05 AM
మూసీ నది కంటే ముందు హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
ఆ నీళ్లని తాగునీటిలానైనా మార్చండి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, మార్చి14 (ఆంధ్రజ్యోతి): మూసీ నది కంటే ముందు హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. హుస్సేన్‌సాగర్ నీటిని కొబ్బరి నీళ్లలా మారుస్తానని, ఆ నీళ్లను రాత్రి పూట ఎందులోనైనా కలుపుకోవచ్చంటూ మాజీ సీఎం కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను రాంచందర్ రావు గుర్తు చేశారు. హుస్సేన్‌సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలా కాకపోయినా కనీసం మంచినీటిగానైనా మార్చాలని సీఎం రేవంత్‌కు వినతి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలియజేసేందుకు బీజేపీ రూపొందించిన ‘ఇగ సహించదు తెలంగాణ - సేవ్ తెలంగాణ’ పోస్టర్‌ను ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్ రావు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ... మూసీ నది కంటే ముందు హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన చేయాలని అన్నారు. హుస్సేన్ సాగర్‌లో పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు కలుస్తూనే ఉన్నాయన్నారు. మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్‌లు కూడా పని చేయడం లేదని తెలిపారు. మూసీలో కలుస్తున్న కలుషిత జలాలను ఎలా నిలువరిస్తారో స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీ విగ్రహం ఏర్పాటుకు వంద ఎకరాలు అవసరమా? హైదరాబాద్ నగరాన్ని చూడ్డానికి గాంధీ విగ్రహం వద్దకు వెళ్లాలా? అందుకోసం వేలాది ఇళ్లు కూల్చివేయాలా? అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతర పోరాడటమే తమ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలో గ్యాస్ కొరత ఏ మాత్రం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసినా కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తోందని రాంచందర్‌రావు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రోజువారీ గ్యాస్ డిమాండ్ 55 లక్షల సిలిండర్లు కాగా, కాంగ్రెస్ సృష్టించిన భయాందోళన వల్ల 76లక్షలకు పెరిగిందన్నారు. ప్రజలను గందరగోళానికి గురిచేయడమే కాంగ్రెస్ లక్ష్యమని విమర్శించారు.
రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మ దహనం
పార్లమెంటు ఆవరణలో నిబంధనలకు విరుద్థంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని అవమానించారంటూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు శనివారం దహనం చేశారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ నిబంధనలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్ భవనం మెట్లపై కూర్చొని టీ తాగుతూ, పిక్నిక్ స్పాట్ లా వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమన్నారు. కాగా, మహేశ్వరం నియోజకవర్గం నుంచి వివిధ ఫెడరేషన్ల కార్యకర్తలు రాంచందర్‌రావు సమక్షంలో శనివారం బీజేపీలో చేరారు.