Family tragedy: భార్య గొంతు కోసి చంపిన భర్త
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:56 AM
కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. 20 ఏళ్లు కలిసి జీవించిన భార్యపై కక్ష పెంచుకుని, గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.
కూతురిపైనా హత్యాయత్నం..
గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం
తండ్రి, కూతురి పరిస్థితి విషమం
భార్యపై అనుమానంతోనే ఘాతుకం
సిద్దిపేటలో దారుణం
సిద్దిపేట క్రైం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. 20 ఏళ్లు కలిసి జీవించిన భార్యపై కక్ష పెంచుకుని, గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అభం శుభం తెలియని కన్న కూతురిని సైతం మట్టుపెట్టే యత్నం చేశాడు. ఈ దారుణ ఘటన సిద్దిపేటలోని ఆదర్శనగర్ కాలనీ-7లో సోమవారం తెల్లవారుజామున జరిగింది. ధూళిమిట్ట మండలం బెక్కల్‌కు చెందిన దున్నపోతుల ఎల్లయ్య, శ్రీలతకు 19 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె హర్షిత, కుమారుడు అజయ్ ఉన్నారు. హర్షిత మిట్టపల్లి కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా, అజయ్ కీసరలోని ఓ పైవ్రేట్ హాస్టల్‌లో ఉంటూ 8వ తరగతి చదువుతున్నాడు. బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం సిద్దిపేటకు వచ్చిన ఎల్లయ్య.. చిరు వ్యాపారాలు, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీలత కూడా కూలీ పనులకు వెళ్తూ, వేసవిలో సోడా బండి నడుపుతూ కుటుంబానికి అండగా ఉండేది. ఏడాది క్రితం హైదరాబాద్‌కు మకాంమార్చిన ఈ కుటుం బం.. ఇటీవల సంక్రాంతి పండుగకు ముందే తిరిగి సిద్దిపేటకు వచ్చి ఆదర్శనగర్ స్ట్రీట్ నంబర్-7లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తోంది.
పథకం ప్రకారమే హత్య
కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న ఎల్లయ్య, ఆమెను హత్యచేయాలని పథకం వేశాడు. ముందుగానే గడ్డిమందు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆదివారం రాత్రి భార్యాభర్తలు ఒక గదిలో, పిల్లలు మరో గదిలో నిద్రపోయారు. సోమవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఎల్లయ్య కత్తితో శ్రీలత గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం పిల్లలు పడుకున్న గదిలోకి వెళ్లి కూతురు హర్షిత మెడపై కత్తితో దాడిచేశాడు. ఆమె ప్రతిఘటించడంతో పక్కనే ఉన్న రోకలిబండతో తలపై బలంగా మోదాడు. నిద్రలేచిన కుమారుడు అజయ్.. భయంతో ఇంటి బయటకు పరుగులు తీసి కేకలు వేశాడు. బంధువు సురే్‌షకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. సురేష్ అక్కడికి చేరుకునే సమయానికి ఎల్లయ్య గడ్డి మందు తాగుతుండడంతో సురేష్ అడ్డుకున్నాడు. దీంతో ఎల్లయ్య కత్తితో తన గొంతు కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న హర్షితను సురేష్ ఆస్పత్రికి తరలించారు. హర్షితకు కూడా తండ్రి గడ్డి మందు తాగించినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. హర్షిత పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సీరియస్‌గా ఉన్న ఎల్లయ్యను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.