Share News

భార్య కాలు, చేయి నరికేసిన భర్త

ABN , Publish Date - May 14 , 2026 | 04:03 AM

భార్యపై అనుమానంతో రగిలిపోతున్న భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్య నిద్రలో ఉండగా ఆమె కాలు, చేయిని గొడ్డలితో నరికేశాడు.

భార్య కాలు, చేయి నరికేసిన భర్త

  • ఆమె నిద్రలో ఉండగా ఘాతుకం

  • సంగారెడ్డి జిల్లా గంగోజిపేటలో ఘటన

పుల్‌కల్‌, మే 13(ఆంధ్రజ్యోతి): భార్యపై అనుమానంతో రగిలిపోతున్న భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్య నిద్రలో ఉండగా ఆమె కాలు, చేయిని గొడ్డలితో నరికేశాడు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండలం గంగోజిపేట గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుల్కల్‌ ఎస్సై నల్లా విశ్వజన్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గంగోజిపేటకు చెందిన కుమ్మరి వీరమణి, దుర్గయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. దుర్గయ్య శివంపేట బీరు పరిశ్రమలో కాంట్రాక్ట్‌ కార్మికుడు. భార్యపై అనుమానం పెంచుకున్న దుర్గయ్య.. ఆమెతో తరచూ గొడవ పడేవాడు. దీంతో వీరమణి భర్తకు దూరంగా తన పిల్లలతో కలిసి సంగారెడ్డిలో వేరుగా నివాసముంటోంది. డ్వాక్రా గ్రూపు డబ్బులు కట్టేందుకు వీరమణి ఈ నెల 11న గంగోజీపేటకు వచ్చింది. ఈ ఒక్క రాత్రికి ఇంట్లోనే ఉండి ఉదయం వెళ్లమని భర్త దుర్గయ్య కోరగా వీరమణి ఉండిపోయింది. ఆమె నిద్రపోయిన తర్వాత దుర్గయ్య ఇంట్లో ఉన్న గొడ్డలితో ఆమె కుడి కాలు నరికి వేరు చేశాడు. అనంతరం కుడి చేయిని కూడా నరికాడు. వీరమణి కేకలు విని ఇరుగుపొరుగు అక్కడికి చేరుకోగా దుర్గయ్య పారిపోయాడు. పోలీసులకు, వీరమణి కుమారుడికి స్థానికులు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వీరమణి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆమె కుమారుడు హరీశ్‌ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు దుర్గయ్యను అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.

Updated Date - May 14 , 2026 | 04:03 AM