Share News

హంగ్‌లో కింగ్‌ ఎవరు?

ABN , Publish Date - Feb 14 , 2026 | 04:26 AM

మున్సిపల్‌ ఎన్నికల్లో మూడు కార్పొరేషన్లు, 24 మున్సిపాలిటీల్లో హంగ్‌ ఫలితాలు వచ్చాయి. ఏపార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యత లభించకపోవడంతో ఇతర పార్టీలతో పొత్తులు, స్వతంత్రుల మద్దతు కీలకంగా మారాయి.

హంగ్‌లో కింగ్‌ ఎవరు?

  • నిజామాబాద్‌, కరీంనగర్‌, కొత్తగూడెం కార్పొరేషన్లలో హంగ్‌

  • 24 మున్సిపాలిటీల్లోనూ హంగ్‌ ఫలితాలు

హైదరాబాద్‌/వరంగల్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో మూడు కార్పొరేషన్లు, 24 మున్సిపాలిటీల్లో హంగ్‌ ఫలితాలు వచ్చాయి. ఏపార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యత లభించకపోవడంతో ఇతర పార్టీలతో పొత్తులు, స్వతంత్రుల మద్దతు కీలకంగా మారాయి. ఈ క్రమంలో హంగ్‌ స్థానాల్లో మేయర్‌, చైర్‌పర్సన్‌ పదవులను దక్కించుకునే కింగ్‌ ఎవరు? వారికి తోడుగా నిలిచే కింగ్‌ మేకర్‌ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది.

ఆ మూడు కార్పొరేషన్లలో..

నిజామాబాద్‌, కరీంనగర్‌, కొత్తగూడెం కార్పొరేషన్లలో ఎవరికీ పూర్తి మెజారిటీ రాలేదు. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌, ఎంఐఎం, కో-ఆప్షన్‌ సభ్యులు కలిస్తే.. వారికే పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై ఆ పార్టీల మధ్య ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. ఇక కొత్తగూడెంలోనూ కాంగ్రెస్‌, సీపీఐ కలిసి అధికారం చేజిక్కించుకునే దిశగానే అడుగులు పడుతున్నాయి. 66 సీట్లున్న కరీంనగర్‌లో బీజేపీ అత్యధికంగా 30 సీట్లు సాధించినా పీఠం దక్కే అంశంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇద్దరు స్వతంత్రులు ఇప్పటికే బీజేపీకి మద్దతిచ్చారు. బీజేపీకి ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్సీల కో-ఆప్షన్‌ ఓట్లు ఉన్నాయి. అయితే, బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమైతే పరిస్థితిలో మార్పు ఉండవచ్చనే చర్చ జరుగుతోంది.


24 మున్సిపాలిటీల్లో పరిస్థితి ఏమిటి?

రాష్ట్రంలో మొత్తం 24 మున్సిపాలిటీల్లో హంగ్‌ పరిస్థితి ఏర్పడింది. అందులో చాలా చోట్ల స్వతంత్రులు, ఎంఐఎం, కో-ఆప్షన్‌ ఓట్లతో కాంగ్రెస్‌ పార్టీనే చైర్‌పర్సన్‌ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో మొత్తం 30 వార్డులుండగా.. కాంగ్రెస్‌ 10, బీఆర్‌ఎస్‌ 12, బీజేపీ 4, ఫార్వర్డ్‌ బ్లాక్‌ 1, స్వతంత్రులు 3 గెలుచుకున్నారు. ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 16 కాగా.. ముగ్గురు స్వతంత్రులు, ఒక ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థి కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. దానికితోడు ఇక్కడ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీకి ఒక కో- ఆప్షన్‌ ఓటు ఉంది. ఇంకొకరి మద్దతు ఉంటే కాంగ్రెస్‌ గెలుపు సాధ్యమవుతుంది. జగిత్యాలలో చైర్‌పర్సన్‌ పీఠం దక్కాలంటే 26 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం. ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది.

మెట్‌పల్లి మున్సిపాలిటీలో పోటాపోటీగా ఉంది. రాయికల్‌ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌, స్వతంత్రుల మద్దతుతో బీజేపీ చైర్‌పర్సన్‌ సీటును దక్కించుకునే అవకాశాలున్నాయి. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో బీఆర్‌ఎస్‌, సీపీఐ కలిసేందుకు చర్చలు పూర్తయినట్టు తెలిసింది. కుమ్రంభీం జిల్లాలో ఆసిఫాబాద్‌లో 20 స్థానాలకుగాను కాంగ్రెస్‌ 7, బీఆర్‌ఎస్‌ 9, ఇండిపెండెంట్లు 4 స్థానాల్లో గెలుపొందారు. స్వతంత్రుల మద్దతు కీలకంగా మారింది. కాగజ్‌నగర్‌లో 30 వార్డులకుగాను కాంగ్రెస్‌కు 9, బీఆర్‌ఎ్‌సకు 11, బీజేపీకి 5, స్వతంత్రులకు 4, మజ్లిస్‌కు ఒక సీటు దక్కాయి. ఇక్కడ స్వతంత్రులు, ఎంఐఎం కీలకం కానున్నాయి. వేములవాడలో 28 వార్డులుండగా ఎవరికీ మ్యాజిక్‌ ఫిగర్‌ రాలేదు.

బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన నరాల శేఖర్‌, కుమ్మరి శిరీష, ఐల శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ క్యాంపులోకి వెళ్లారు. దీంతో కాంగ్రెస్‌ బలం 16కు చేరింది. మహబూబాబాద్‌లో సీపీఎం, స్వతంత్రులు, ఎక్స్‌ అఫీషియో ఓట్లతో పీఠం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. వర్ధన్నపేటలో ని 12 వార్డుల్లో కాంగ్రెస్‌ ఐదు, బీఆర్‌ఎస్‌ ఆరు, ఒక ఇండిపెండెంట్‌ గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి కాంగ్రె్‌సకు మద్దతు ఇవ్వటంతో బలం సమానమైంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఓటు వేసి, పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. వరంగల్‌ ఎంపీ కడియం కావ్య కూడా ఇక్కడ ఎక్స్‌అఫీషియోగా ఓటేసే అవకాశం ఉంది. జనగామ మున్సిపాలిటీలో 30వార్డులకుగాను కాంగ్రెస్‌ 12, సీపీఎం 1, ఇద్దరు స్వతంత్రులు కలిసి కాంగ్రెస్‌ క్యాంపు బలం 15కు చేరింది. బీఆర్‌ఎస్‌ 13, ఇద్దరు స్వతంత్రులు కలిపి ఆ క్యాంపు బలం కూడా 15కు చేరింది. దీనితో ఇరు పార్టీల నుంచి ఎక్స్‌ అఫీషియో సభ్యులే కీలకం కానున్నారు. కేసముద్రంలోని 16వార్డులకుగాను కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలకు చెరో 8 వచ్చాయి. దీనితో ఎక్స్‌అఫీషియో సభ్యులే కీలకంగా మారారు.

Updated Date - Feb 14 , 2026 | 07:35 AM