Share News

kumaram bheem asifabad- రెండు మున్సిపాలిటీల్లో హంగ్‌

ABN , Publish Date - Feb 13 , 2026 | 11:32 PM

ఆసిఫాబాద్‌,/ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ రెండు మున్సిపాలిటీల్లో హంగ్‌ ఏర్పడింది. శుక్రవారం మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగగా రెండు మున్సిపాలిటీల్లోను ఓటర్లు విభిన్న రీతిలో తమ తీర్పును వెలువరుచారు. ఏ పార్టీకి కూడ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అయా మున్సిపాలిటీల్లో హంగ్‌ ఏర్పడింది.

kumaram bheem asifabad- రెండు మున్సిపాలిటీల్లో హంగ్‌
ఆసిఫాబాద్‌లో ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది

- బీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉన్నా దక్కని మ్యాజిక్‌ ఫిగర్‌

- స్వతంత్ర అభ్యర్థులే కీలకం

- జిల్లాలో బీఆర్‌ఎస్‌కు 20, కాంగ్రెస్‌కు 16, బీజేపీకి 5, స్వతంత్రులు 8, ఎంఐఎం 1 స్థానంలో గెలుపు

- పట్టణ ఓటర్ల విలక్షణ తీర్పు

-ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల కౌంటింగ్‌

ఆసిఫాబాద్‌,/ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ రెండు మున్సిపాలిటీల్లో హంగ్‌ ఏర్పడింది. శుక్రవారం మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగగా రెండు మున్సిపాలిటీల్లోను ఓటర్లు విభిన్న రీతిలో తమ తీర్పును వెలువరుచారు. ఏ పార్టీకి కూడ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అయా మున్సిపాలిటీల్లో హంగ్‌ ఏర్పడింది. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డు కౌన్సిలర్‌ స్థానాలు ఉండగా ఇందులో కాంగ్రెస్‌ 7 స్థానాలు, బీఆర్‌ఎస్‌ 9 స్థానాలు, నాలుగు స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఇక్కడ బీజేపీకి ఒక్క సీటు కూడ దక్కలేదు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ఇండిపెండెంట్‌ అభ్యర్థులే కీలకం కానున్నారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థుల మద్దతును ఏ పార్టీ కూడగట్టుకుంటే వారే చైర్మన్‌ పదవిని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో స్వతంత్ర అభ్యర్థులను తమ పార్టీకే మద్దతు తెలుపాలని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. 1వ వార్డు స్వతంత్ర అభ్యర్థి జాడి వినోద్‌కుమార్‌ను కాంగ్రెస్‌ నాయకులు కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించగా బీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకొవడంతో కొద్ది సేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అనంతరం అభ్యర్థిని వారి చెరనుంచి విడిపిం చారు. తొమ్మిది వార్డు కౌన్సిలర్‌ స్థానాల్లో గెలుపొందిన బీఆర్‌ఎస్‌కు ఇద్దరు ఇండిపెండెంట్‌లు మద్దతు అవసరం. ఒకవేళ ఇండిపెండెంట్‌ అభ్యర్థుల్లో ఇద్దరు బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపితే బీఆర్‌ఎస్‌ చైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏడు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌ పార్టీకి మరో నాలుగు స్థానాలు అవసరముండగా ఇండిపెండెంట్‌ నలుగురు వారికి మద్దతు తెలిపితే ఆ పార్టీ చైర్మన్‌ పీఠాన్ని చేజిక్కించుకొనుంది. దీంతో ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కీలకంగా మారారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డు కౌన్సిలర్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ 9 వార్డు కౌన్సిలర్‌ స్థానాల్లో, బీఆర్‌ఎస్‌ 11 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో, స్వతంత్రులు 4 స్థానాల్లో, ఎంఐఎం ఒక స్థానంలో గెలుపొందారు. ఇక్కడ కూడ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. నాలుగు స్థానాల్లో గెలిచిన స్వతంత్రులు, ఒక స్థానంలో గెలిచిన ఎంఐఎం అభ్యర్థులే కీలకం కానున్నారు.

- ఉత్కంఠ భరితంగా కౌంటింగ్‌..

ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల/కళాశాలలో శుక్రవారం మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించగా ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ భరితంగా సాగాయి. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్‌ కేంద్రాల వద్దకు అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులు, అదికారులు చేరుకున్నారు. అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఎన్నికల పరిశీలకులు అలోక్‌ కుమార్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, పోలీసుల పర్యవేక్షణలో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. రెండు హలుల్లో పది టేబుళ్లను ఏర్పాటు చేసి రెండు రౌండ్లలో ఓట్లను లెక్కించారు. మొదట పోస్టల్‌ బ్యాలేట్‌ ఓట్లను లెక్కించిన తర్వాత వార్డుల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కించారు. ప్రతి రౌండులో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో జయపజయలపై అందరి అంచనాలు తారుమారయ్యాయి. గెలుపొందిన అభ్యర్థులు ఉత్సహంగా కనిపించగా ఓటమి చెందిన అభ్యర్థులు నిరాశతో వెళ్లిపోయారు. ఆసిఫాబాద్‌లో కౌంటింగ్‌ ఏర్పాట్లపై కలెక్టర్‌ కె హరిత ఆరా తీశారు.

ఆసిఫాబాద్‌లో బోణి కొట్టని బీజేపీ..

ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ బోణి కొట్టలేక పోయింది. మున్సిపాలిటీలో 20 వార్డులుండగా 18 వార్డులలో పార్టీ అభ్యర్థులను బరిలో ఉంచినప్పటికిని ఏ ఒక్క అభ్యర్థి కూడా విజయం సాధించలేదు. వార్డు 6, వార్డు 14, వార్డు 20లలో గెలిచిన అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మిగతా వార్డుల్లో మూడు, నాలుగు స్థానాలకు చేరుకుంది. దీంతో బీజేపీ పార్టీకి మున్సిపల్‌ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడ దక్కలేదు. బరిలో నిలిచిన అభ్యర్థులు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు.

కీలకం కానున్న స్వతంత్రులు..

ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థులే కీలకంగా మారారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్‌కు 9, కాంగ్రెస్‌కు 7 స్థానాలు రాగ నాలుగు స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. దీంతో మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకొవాలంటే స్వతంత్ర అభ్యర్థుల మద్దతు తప్పనిసరి. ప్రదాన పార్టీలైన బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ పీఠం దక్కించుకునేందుకు స్వతంత్ర అభ్యర్థులకు గాలం వేస్తున్నారు. తమకే మద్దతు తెలుపాలని ఒత్తిడికి తీసుకువస్తున్నారు. తమకే మద్దతు తెలిపితే చైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవులు కట్టబెడతామని అఫర్లు ఇస్తున్నారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులకు మంచి గిరాకీ నెలకొంది. ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో ఏ పార్టీ అభ్యర్థి చైర్మన్‌ పీఠం కైవసం చేసుకుంటారో అని సర్వత్రా చర్చ జరుగుతోంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు శుక్రవారం స్థానిక డీవీఎస్‌ పాఠశాలలో నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తొలి రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం రాగా, రెండో రౌండ్‌లో కాంగ్రెస్‌ అధిక్యం సాధించింది. 30 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి 11 స్థానాలు రాగా, కాంగ్రెస్‌ 9, బీజేపీ 5, స్వతంత్రులు 4, ఎంఐఎం1 స్థానం రావటం విశేషం. 30 వార్డులకు చైర్మన్‌ కావాలంటే మ్యాజిక్‌ సంఖ్య 16 కౌన్సిలర్‌ స్థానాలు వస్తే దక్కించుకునే అవకాశాలున్నాయి. అయితే ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజా ర్టీ రాక పోవడంతో ఏయే పార్టీలు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారనేది ఇప్పుడు పట్టణంలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. బీఆర్‌ఎస్‌కు కొంత మంది స్వతంత్ర అభ్యర్థులు మద్దతిచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బలం లేని పరిస్థితి ఉంది. అయినా కూడా ఇతర పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లను బీఆర్‌ఎస్‌కు మద్దతు కూడ గట్టుకునేందుకు సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. . కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు ఎలాంటి ఎత్తుగడ వేస్తారన్నది ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కొంత మంది బీఆర్‌ఎస్‌కు, మరి కొంత మంది కాంగ్రెస్‌ మద్దతు తెలుపుతారనే చర్చ జరుగుతోంది. అయితే గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థుల ఇంటి వద్దకు ప్రధాన పార్టీలు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన వారిని ఇప్పటికే పాటి క్యాంపునకు తరలించారు.

Updated Date - Feb 13 , 2026 | 11:32 PM