Share News

భువనగిరి మునిసిపల్‌ అధికారులపై హెచ్చార్సీ కేసు

ABN , Publish Date - Mar 29 , 2026 | 07:07 AM

భువనగిరి జిల్లా కేంద్రంలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన అమానుష ఘటనపై మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) శనివారం కేసు నమోదు చేసింది.

భువనగిరి మునిసిపల్‌ అధికారులపై హెచ్చార్సీ కేసు

యాదాద్రి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): భువనగిరి జిల్లా కేంద్రంలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన అమానుష ఘటనపై మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) శనివారం కేసు నమోదు చేసింది. మునిసిపల్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం జరిగిందని హైకోర్టు న్యాయవాది వినోద్‌ హిందుస్థాని ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకుంది. వీధి కుక్కల బెడదను అరికట్టడంలో భువనగిరి మునిసిపల్‌ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కుక్కల దాడిలో చూపుకోల్పోయిన బాలుడు ప్రియాంశ్‌ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని వినోద్‌ హెచ్‌ఆర్‌సీకి విన్నవించారు. కాగా, కంటికి శస్త్రచికిత్స అనంతరం ప్రియాంశ్‌ శనివారం ఎల్‌వీ ప్రసాద్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. అంతకు ముందు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.

Updated Date - Mar 29 , 2026 | 07:08 AM