HPV Vaccines: బాలికలకు హెచ్‌పీవీ టీకాలు
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:27 AM
రాష్ట్రంలోని 14 ఏళ్ల బాలికలందరికీ హ్యూమన్ పాపిలోమా వైర్‌స(హెచ్‌పీవీ) టీకాలను ఇవ్వనున్నారు. అందుకోసం వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది...
కేంద్రం నుంచి రానున్న 1.5 లక్షల టీకాలు
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని 14 ఏళ్ల బాలికలందరికీ హ్యూమన్ పాపిలోమా వైర్‌స(హెచ్‌పీవీ) టీకాలను ఇవ్వనున్నారు. అందుకోసం వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. తాజాగా ఈ టీకాలపై వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీతా సత్యనారాయణ ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హెచ్‌పీవీ టీకా ఇవ్వడంపై వైద్యాధికారులకు ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి 1.5 లక్షల టీకాలు రానున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ టీకాకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ఇంకా విడుదల చేయలేదని సమాచారం. కాగా హెచ్‌పీవీ టీకా హ్యూమన్ పాపిలోమా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ వైరస్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్, గొంతు కేన్సర్, జననేంద్రియ వార్ట్స్‌కు కారణమవుతుంది. అయితే ఈ వైరస్ సోకక ముందే టీకా తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, మంచి ఫలితాలను సాధించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. 9-15 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు ఈ టీకాలు రెండు డోసులు షెడ్యూల్ ప్రకారం ఇస్తారు.