Share News

సీఎంఆర్‌ సర్దుబాటు చేసేదెలా....!

ABN , Publish Date - Nov 21 , 2026 | 11:25 PM

ప్రభుత్వం కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం అప్పగించిన బియ్యా న్ని మాయం చేసిన రైస్‌ మిల్లర్లు...తిరిగి ఆ లోటు భర్తీ చేసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో మిల్లర్లు బియ్యం భర్తీ చేసేందుకు ఉరుకు లు పరుగులు పెడుతున్నారు.

సీఎంఆర్‌ సర్దుబాటు చేసేదెలా....!

-బియ్యం లోటు భర్తీ చేసేందుకు మిల్లర్ల తంటాలు

-సుప్రీం కోర్టు ఆదేశాలతో ఉరుకులు పరుగులు

-జిల్లాలో పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బకాయిలు

-మిల్లర్లపై ఆర్‌ఆర్‌ యాక్టు ప్రయోగించేందుకు సన్నాహాలు

మంచిర్యాల, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం అప్పగించిన బియ్యా న్ని మాయం చేసిన రైస్‌ మిల్లర్లు...తిరిగి ఆ లోటు భర్తీ చేసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో మిల్లర్లు బియ్యం భర్తీ చేసేందుకు ఉరుకు లు పరుగులు పెడుతున్నారు. ప్రభు త్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి సీఎమ్మార్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) కోసం అప్పగించిన వడ్లను అధిక ధరలకు అమ్ము కొని కోట్లలో సొమ్ము చేసుకున్నారు. ఒక సీజన్‌లో వడ్లు అమ్ముకున్న మిల్లర్లు మరో సీజన్‌లో వచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి సీఎమ్మార్‌ పెట్టినట్లు చూపగా, పాత లోటును ఇప్పుడు భర్తీ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు.

వడ్లతో మిల్లర్ల వ్యాపారం...

ప్రభుత్వం సీఎమ్మార్‌ కోసం మిల్లర్లకు అప్పగించిన వడ్లను అమ్ముకొని ఆ డబ్బులతో వ్యాపారాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. వడ్లు క్వింటాలుకు రూ. 2200 నుం చి రూ. 2300కు, బియ్యం రూ. 3 వేల నుంచి రూ. 3200కు మార్కెట్లో అమ్ముకున్నట్లు బహిరంగంగా ప్ర చారం జరుగుతోంది. ఒక సీజన్‌కు సంబంధించిన వడ్ల ను అమ్ముకొని, మరో సీజన్‌ వడ్లు రాగానే మిల్లింగ్‌ చేసి సీఎమ్మార్‌ పెడుతున్నట్లు సమాచారం. ఇలా ఒ క్కో మిల్లర్‌ సీజన్‌కు రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కో ట్లకు పైగా సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభు త్వం కఠినంగా వ్యవహరిస్తుండటం, సుప్రీం కోర్టు కూ డా మిల్లర్లకు వ్యతిరేకంగా ఆదేశాలు ఇవ్వడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా ప్రత్యక్ష చర్యలకు సిద్దపడుతున్నారు. సీఎంఆర్‌ బకాయి ఉన్న మిల్లర్లపై రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌) యాక్టు ప్రయోగించేందుకు సన్నద్దం అవుతున్నారు.

సీఎంఆర్‌ పెండింగ్‌...

మంచిర్యాల జిల్లాలో 2022-23 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి సుమారు 1.60 లక్షల టన్నుల వడ్లు మిల్లుల్లో నిల్వ ఉండాల్సి ఉండగా, ఆ మేరకు అందుబాటులో లేకపోవడంతో మిల్లర్లు పక్కదారి పట్టించారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అప్పటి నుంచి ప్రతియేటా పౌరసరఫరాల శాఖ అధికారులు రైస్‌ మిల్లులకు సీఎంఆర్‌ ధాన్యం కేటాయించడం, వారు దాన్ని అమ్ముకోవడం షరా మామూలైపోయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత సీఎంఆర్‌ బకాయిలున్న మిల్లులకు జియో ట్యాంగ్‌ నిలిపివేయడమేగాకుండా, ధాన్యం రికవరీ చేస్తూ వస్తోంది. జిల్లాలో మొత్తం 54 రైస్‌ మిల్లులు ఉండగా 2025-26 సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌కు సంబంఽధించి 28 మిల్లులకు జియో ట్యాగింగ్‌ ఇవ్వగా మొత్తం 48,539 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్‌ కోసం అప్పగించారు. అందులో ఇప్పటి వరకు 77 శాతం మాత్రమే తిరిగి ఇవ్వడం గమనార్హం. మరో 11,409 మెట్రిక్‌ టన్నులకు సంబంధించిన బియ్యం ఇవ్వాల్సి ఉంది. అలాగే ఆ ఏడాది రబీ సీజన్‌లో 21 మిల్లులకు జియో ట్యాగింగ్‌ ఇచ్చి 41,991 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అప్పగించారు. అందులో ఇప్పటి వరకు కేవలం 21,600 మెట్రిక్‌ టన్నులకు సంబంధించిన బియ్యాన్ని తిరిగి ఇవ్వగా మరో 20,000 మెట్రిక్‌ టన్నులు పెండింగులో ఉంది.

అడ్డదారులు తొక్కుతున్న మిల్లర్లు....

సీఎంఆర్‌ లక్ష్యం పూర్తి చేసేందుకు ప్రభుత్వం పట్టుదలతో ఉండటంతో డిఫాల్టర్లుగా మారిన మిల్లర్లు తమ బియ్యం లోటును భర్తీ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. క్రిమినల్‌ కేసుల నుంచి తమకు విముక్తి కల్పించాలని మిల్లర్లు పెట్టుకున్న స్పెషల్‌ లీవు పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో బకాయిలు చెల్లించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. తమకు అప్పగించిన బియ్యం మాయం కాగా, వాటికి బదులుగా నగదు చెల్లించడం మిల్లర్లకు తలకు మించిన భారంలా తయారైంది. సీఎంఆర్‌ కోసం ధాన్యం తీసుకున్న మిల్లర్లు క్వింటాలు వరి నుంచి 67 కిలోల ముడి బియ్యం తిరిగి ఇవ్వవలసి ఉంది. దాన్ని భర్తీ చేసేందుకు అడ్డదారులు తొక్కుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందు కోసం ఎంఎల్‌ఎస్‌ (మండల లెవల్‌ స్టాకిస్ట్‌) పాయింట్ల ఇంచార్జిలు కొందరితో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నట్లు తెలుస్తోంది. వారి ద్వారా చౌక ధరల దుకాణాల నుంచి ప్రజలకు పంపిణీ చేసే పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా సేకరించేందుకు సిద్దపడుతున్నారు. మిల్లర్లకు సహకరించేందుకుగాను ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ఇంచార్జిలు కొన్ని రేషన్‌ షాపుల నుంచి పీడీఎస్‌ బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా సేకరించిన బియ్యాన్ని అధిక ధరలకు మిల్లర్లకు అమ్ముతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉండగా, రాష్ట్ర ఎల్లలు దాటి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్న పీడీఎస్‌ బియ్యంపైనా మిల్లర్లు కన్నేసినట్లు తెలుస్తోంది. నెలనెలా రేషన్‌ షాపుల నుంచి లబ్దిదారులకు అందుతున్న పీడీఎస్‌ బియ్యం నుంచి సింహభాగం కొందరు డీలర్ల ద్వారా మహారాష్ట్రకు తరలి వెళ్తున్నాయి. అలా ఇతర రాష్ట్రాలకు తరలిన పీడీఎస్‌ రైస్‌ను అక్కడి పంట పేరుతో తిరిగి ఇక్కడికే అధిక ధరలకు విక్రయం కోసం పంపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైస్‌ మిల్లుల్లో బియ్యం కొరత ఉండటంతో మహారాష్ట్ర నుంచి బియ్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా లారీల్లో తరలించి, సీఎంఆర్‌ లోటు భర్తీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Nov 21 , 2026 | 11:25 PM