Share News

కేటీఆర్‌ కుమారుడికి 40 ఎకరాలు ఎలా వచ్చాయ్‌?

ABN , Publish Date - Sep 19 , 2026 | 06:29 AM

కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ భూమి ఉన్నట్లు సర్వేలో తేలితే చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుని, అర్హులైన పేదలకు, ముఖ్యంగా దళితులకు పంపిణీ చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో తనకు భూములే లేవని ప్రకటించిన కేసీఆర్‌కు ఇప్పుడు వందల ఎకరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు

కేటీఆర్‌ కుమారుడికి  40 ఎకరాలు ఎలా వచ్చాయ్‌?
pongulatisrinivasreddy

  • ఫాంహౌస్‌ సర్వే తర్వాతేవెల్లడిస్తాం

  • కేసీఆర్‌కు రెండెకరాల్లో ఇల్లుంటే ఎన్నికల

  • అఫిడవిట్‌లో ఎందుకు ప్రస్తావించలేదు

  • సిద్దిపేట ఆక్రమిత భూముల్లో పేదలకు ఇళ్లు

  • 22ఏ పరిష్కారానికి కమిటీ: పొంగులేటి

  • సిద్దిపేట ఆక్రమణల్లో ఇందిరమ్మ టవర్స్‌

  • అసైన్డ్‌ పట్టాలున్న వారి జోలికి పోము

  • రంగనాయక సాగర్‌

  • భూములపైనా విచారిస్తాం: పొంగులేటి

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ భూమి ఉన్నట్లు సర్వేలో తేలితే చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుని, అర్హులైన పేదలకు, ముఖ్యంగా దళితులకు పంపిణీ చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో తనకు భూములే లేవని ప్రకటించిన కేసీఆర్‌కు ఇప్పుడు వందల ఎకరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేటీఆర్‌ కొడుకు పేరిట 40 ఎకరాల భూమి ఉన్నట్లు చూపారని మంత్రి ప్రస్తావించారు. నూనూగు మీసాల పిల్లోడు ఏ వ్యాపారం చేసి, ఇంత భూమిసంపాదించారని ప్రశ్నించారు. శాసనసభ లాబీల్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో భూములపై నెలకొన్న వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలంటే రికార్డులు, భౌతిక పరిస్థితి రెండింటినీ సమన్వయం చేయాల్సి ఉంటుందని చెప్పారు. రికార్డుల్లో ఉన్న భూమి ఎంత? డాక్యుమెంట్లలో ఉన్నది ఎంత? భౌతికంగా ఎవరి స్వాధీనంలో ఉంది? ప్రభుత్వ భూమి ఎంత? అసైన్డ్‌ భూమి ఎంత? అన్నది సమగ్ర సర్వే ద్వారా తేలుస్తామన్నారు. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి, తాను మాట్లాడే ప్రతి అంశానికి సంబంధించిన అధికారిక రికార్డులు ఉన్నాయన్నారు.


సర్వే పూర్తయిన తర్వాత సాంకేతిక ఆధారాలతో వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. భూముల విషయంలో ప్రభుత్వం ఎవరినీ ఉద్దేశ పూర్వకంగా ఇబ్బంది పెట్టదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములు, ప్రైవేట్‌ పట్టా భూములు, భౌతిక స్వాధీనం, ఎన్నికల అఫిడవిట్లలో చూపిన ఆస్తుల మధ్య తేడాలు వంటి వివరాలన్నింటినీ రికార్డుల ఆధారంగా పరిశీలించాల్సిందేనని చెప్పారు. కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ పరిసరాల్లోని భూముల విషయంలో స్థానికుల నుంచి వచ్చిన సమాచారాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటన కూడా స్థానికుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా చేసిందేనని వెల్లడించారు. పుట్టుకతోనే కేసీఆర్‌ వందల ఎకరాల భూస్వామి అని చెబుతున్నప్పుడు ఆ భూముల వివరాలు ఎన్నికల అఫిడవిట్లలో ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌కు చిన్నప్పుడే రెండెకరాల్లో ఇల్లు ఉన్నట్లయితే ఆ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. హరీశ్‌రావు ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన భూములు, ప్రస్తుతం ఉన్న భూములు, భౌతికంగా ఆయన ఆధీనంలో ఉన్న భూములు, ట్రస్ట్‌ పేర్లతో ఉన్న భూములను కూడా పరిశీలిస్తామన్నారు. అఫిడవిట్లలో చూపిన విస్తీర్ణం కంటే ఎక్కువ భూమి ఉన్నట్లు తేలితే దాని చట్టబద్ధతను పరిశీలిస్తామని చెప్పారు. ఒక గుంట తేడా ఉన్నా అది ఎవరి పేరిట ఉందో రికార్డుల ద్వారా తేలాల్సి ఉంటుందన్నారు. హరీశ్‌ కుటుంబ సభ్యులు మాజీ సైనికుడి నుంచి భూములు కొనుగోలు చేశారన్న వాదనపై మంత్రి స్పందించారు. స్వాతంత్య్ర సమర యోధులు, మాజీ సైనికుల పేరిట జరిగిన లావాదేవీలన్నింటినీ పరిశీలిస్తామన్నారు.


సిద్దిపేట ప్రాంతంలో భూఆక్రమణలను వెలికి తీసి, సదరు భూమిలో ఇందిరమ్మ టవర్స్‌ను నిర్మిస్తామన్నారు. ఎర్రవల్లి అసైన్డ్‌ భూములపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ఒరిజినల్‌ అసైన్డ్‌ పట్టాలున్న రైతులను ఇబ్బంది పెట్టబోమని స్పష్టం చేశారు. రంగనాయక సాగర్‌ పరిసర భూముల విషయంలో అప్పటి ఇరిగేషన్‌ శాఖ రికార్డులు, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌, రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్‌ వివరాలను పరిశీలించాల్సి ఉందని తెలిపారు. శాఖల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, భూముల వర్గీకరణలో మార్పులు, రిజిస్ట్రేషన్‌ జరిగిన విధానం, రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ నిధులు వినియోగించారా? వంటి వివరాలను సేకరిస్తామని చెప్పారు. ఇరిగేషన్‌ శాఖ ఎంత భూమి అవసరమని కోరింది? తర్వాత ఆ భూమి రికార్డుల్లో మార్పులు జరిగాయా? వంటి వివరాలు సేకరిస్తామన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 06:29 AM