‘ప్రత్యామ్నాయం’ ఎలా..?
ABN , Publish Date - Oct 15 , 2026 | 01:01 AM
ఈసారి యాసంగిలో వరి వద్దని ప్రభుత్వం చెబుతోంది. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిద్ధం కావలని సూచిస్తోంది. దీంతో అన్నదాతలు ఏ పంటను వేయాలనే విషయంలో మదనపడుతున్నాడు. వరిసాగుకే అలవాటు పడిన రైతన్న ఉన్నపళంగా కొత్తపంట జోలికి వెళ్లేందుకు జంకుతున్నాడు. కొన్నేళ్లుగా
501కేఎన్ఆర్13
=================
- యాసంగిలో వరి వద్దంటున్న ప్రభుత్వం
- పప్పుధాన్యాల విస్తీర్ణం పెంచాలని సూచన
- ఉమ్మడి జిల్లాలో ఏటా తగ్గుతున్న దిగుబడి
- అన్నదాతలకు అవగాహన కల్పించడమే కీలకం
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
ఈసారి యాసంగిలో వరి వద్దని ప్రభుత్వం చెబుతోంది. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిద్ధం కావలని సూచిస్తోంది. దీంతో అన్నదాతలు ఏ పంటను వేయాలనే విషయంలో మదనపడుతున్నాడు. వరిసాగుకే అలవాటు పడిన రైతన్న ఉన్నపళంగా కొత్తపంట జోలికి వెళ్లేందుకు జంకుతున్నాడు. కొన్నేళ్లుగా ఆరుతడి పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల సాగు విషయంలో నెలకొన్న అనిశ్చితి, మార్కెటింగ్ సమస్యలు, కూలీల కొరత, గిట్టుబాటు ఇక్కట్ల నేపథ్యంలో వరిపంటనే సాగు చేశారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం వెంటాడుతుండడంతో ఈ వచ్చే యాసంగికి ఏమేద్దాం..? ఎంత విస్తీర్ణంలో పంటలను వేద్దామనే ఆలోచనల్లో అన్నదాత ఉన్నాడు. ఉన్న అరకొర సాగునీళ్లతో వచ్చే ఈ యాసంగిలో పంటను కాపాడుకోవాలంటే ప్రత్యామ్నాయంవైపు అడుగులు వేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోంది. కొన్నేళ్లుగా సంప్రదాయ వరిపంటకే అలవాటు పడిన రైతన్న ఒక్కసారి పంట మార్పిడికి ఏ మేరకు సిద్ధమవుతాడనే సందిగ్ధత అందరిలో నెలకొంది.
వానాకాలంలో సాగు చేసిన ప్రత్యామ్నాయ పంటలు ..(ఎకరాల్లో)
--------------------------------------------------------------
జిల్లా కంది పెసర మినుము సోయా మొక్కజొన్న
--------------------------------------------------------------
కరీంనగర్ 2,289 4,191 27 15 5,409
పెద్దపల్లి 289 54 18 - 895
జగిత్యాల 2,308 815 15 832 38,910
సిరిసిల్ల 2,803 2,160 150 - 4,500
-------------------------------------------------------------
మొత్తం 7,689 7,220 210 847 49,714
-------------------------------------------------------------
ఫ అనాసక్తికి కారణాలనేకం..
నీటి సదుపాయం ఎక్కువగా ఉన్న ఉమ్మడి జిల్లాలో ఏడాదికి రెండు పంటలు వరిని వేయడానికి రైతులు అలవాటుపడ్డారు. చీడపీడల బెడద తక్కువగా ఉండటం, పెట్టుబడి ఇతర ఖర్చులు తక్కువగా ఉండడంతోపాటు కూలీల అవసరం తక్కువ ఉంటుంది. మూడేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సీజన్లో వరి స్థానంలో ప్రత్యామ్నయ పంటల కోసం క్షేత్రస్థాయిలో అంచనాలు రూపొందించగా రైతులు అంతగా ఆసక్తి చూపించలేదు. సులభతరమైన వరిని కాదని పంట మార్పిడికి అన్నదాతలు ససేమిరా అనడంతో పప్పుధాన్యాలను వేసే రైతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఉద్యాన పంటల సాగు ఇటీవల కొంత పెరిగినా సాగు చేసిన భూ విస్తీర్ణంలో ఇతర పంటలు 25శాతం కూడా దాటలేకపోయాయి. తెగుళ్లు, నాణ్యమైన విత్తనాలు లేకపోవడంతో కూరగాయల సాగు అతి కష్టంగా 15 వేల నుంచి 18 వేల ఎకరాల్లో సాగవుతోంది. కోతుల బెడద ఎక్కువవడం వల్ల ఇతర పంటల జోలికి వెళ్లడానికి రైతన్నలు ఆసక్తి చూపించడం లేదు.
ఫ ఇలా చేస్తేనే సాధ్యం..!
- ప్రభుత్వం విత్తనాలను రాయితీపై అందించాలి. సాగుపై దృష్టి పెట్టే రైతులకు ప్రోత్సాహకాన్ని ఇవ్వాలి. సన్నధాన్యం మాదిరిగా ఎక్కువ విస్తీర్ణంలో వరి కాకుండా.. ఇతర ఏ పంటలు వేసినా వారిని గుర్తించి బోనస్ ఇవ్వాలి.
- దిగుబడిలో నష్టం వాటిల్లకుండా సస్యరక్షణ చర్యలపై వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు ఇవ్వాలి. రైతువేదికల ద్వారా ఎప్పటికప్పుడు పంటల పురోగతిని పర్యవేక్షించాలి.
- కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) ఒక్కటే కాకుండా కొనుగోళ్ల వసతులను మార్కెట్లలో పెంచాలి. ఉత్పత్తి అయిన పంటలకు సత్వరమే మార్కెటింగ్, గిట్టుబాటు ధరలను కల్పించే బాధ్యతలను మార్కెటింగ్ శాఖ తీసుకోవాలి.
- క్షేత్రస్థాయిలో భూముల ఆధారంగా పంటల సాగును ఎంపిక చేయాలి. అనుకూలమైన రకాలు, సకాలంలో విత్తనాల పంపకాలు, ప్రదర్శనలతో పంటల్లో వచ్చే లాభాలను అన్నదాతలకు తెలియజేయాలి.
ఫ వానాకాలంలో 78 శాతం వరి..
సాగుచేసిన భూభాగంలో ఈ వానాకాలంలో 78 శాతం మేర వరి పంటనే వేశారు. జిల్లావ్యాప్తంగా 12.36 లక్షల సాధారణ విస్తీర్ణంలో 11,91,935 ఎకరాల్లో అన్ని రకాల పంటలు వేశారు. ఇందులో వరి పంటనే 9,31,094 ఎకరాలల్లో వేశారు. మిగతా 2,60,841 ఎకరాల్లో మిగతా అన్ని పంటలు వేశారు. 2.6 లక్షల ఎకరాల్లోనూ పత్తి, మొక్కజొన్న 1.6 లక్షల ఎకరాల్లో సాగైంది. చిన్నాచితక పంటలన్నీ కలిపి లక్ష ఎకరాల్లోనే వేశారు. 22 శాతం సాగయ్యే పంటలను ఉన్నపళంగా పెంచాలంటే ప్రణాళికాబద్ధంగా ముందుకుపోవాలి. కనీసం 10 శాతం సాగులేని ఆరుతడి పంటలను ఒక్కసారిగా 50 శాతం పెంచడం కష్టమైన ప్రక్రియనే. అందుకనే క్రమక్రమంగా వీటి సాగు విస్తీర్ణాన్ని పెంచాలి.