గచ్చిబౌలిలో 1.76 లక్షలకు చదరపు గజం
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:57 AM
నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు మరోసారి అధిక ధరలు పలికాయి.
కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో చదరపు గజం 1.64 లక్షలు
హౌసింగ్ బోర్డు స్థలాలకు డిమాండ్
వేలం ద్వారా 34.27 కోట్ల ఆదాయం
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు మరోసారి అధిక ధరలు పలికాయి. గచ్చిబౌలి ప్రాంతంలో చదరపు గజం రూ.1.76 లక్షలకు, కూకట్‌పల్లిలో రూ. 1.64 లక్షలకు కొనుగోలు చేశారు. నగరంలోని గచ్చిబౌలి, భౌరంపేట్, బాలాజీ నగర్, చింతల్ తదితర ప్రాంతాల్లోని మొత్తం 14 భూములను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి ఈ నెల 9వ తేదీన హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేపీహెచ్‌బీ హోసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్‌లో సోమవారం నిర్వహించిన వేలం పాటలో సుమారు 50 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. విక్రయించిన వాటిలో బౌరంపేట భూమితోపాటు బాచుపల్లిలో ఒక ఫ్లాట్ మినహా మిగిలినవి ఎంఐజీ, హెచ్‌ఐజీ కేటగిరీలోని ప్లాట్లు కావడంతో వీటిని దక్కించుకోడానికి పలువురు పోటీ పడ్డారు. గచ్చిబౌలిలో 263 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్‌కు రూ.50 వేల కనీస ధరగా నిర్ధారించి వేలం నిర్వహించగా, దీనికి చదరపు గజం రూ. 1.76 లక్షల ధర పలికింది. అదేవిధంగా కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లోని 266 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్‌ను వేలం పాటలో రూ. 1.64 లక్షలకు కొనుగోలు చేశారు. అలాగే చింతల్ ప్రాంతంలోని ఓపెన్ ప్లాట్లు కూడా మంచి డిమాండ్‌తో చదరపు గజం రూ.84 వేలు, రూ.74 వేల ధరలతో అమ్ముడు పోయినట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. అలాగే నిజాంపేటలోని సిద్ధి ప్లాట్‌కు కనీస ధర రూ. 15 లక్షలుగా నిర్ధారించగా.. దీనిని వేలం పాటలో రూ. 17.70 లక్షలకు కొనుగోలు చేశారు. అలాగే గచ్చిబౌలిలోని మరో ప్లాట్ చదరపు గజం లక్ష రూపాయలు పలికింది. కాగా బౌరంపేటలోని 2,600 చదరపు గజాల విస్తీర్ణంలోని భూమి చదరపు గజం రూ.61 వేలకు అమ్ముడుపోయింది. మొత్తంగా సోమవారం నాటి భూముల విక్రయాల ద్వారా రూ. 34.27 కోట్ల మేర ఆదాయం వచ్చిందని వివరించారు.