పాకిస్థాన్ వస్తా.. ఉగ్రదాడుల్లో శిక్షణ ఇవ్వండి
ABN , Publish Date - May 25 , 2026 | 05:53 AM
తాను ఉగ్రవాదిగా మారతానని, ఉగ్రదాడులు చేయడంలో తనకు శిక్షణ ఇవ్వమని కోరుతూ... పాకిస్థాన్‌లోని టెర్రరిస్టు ముఠాలతో ఆన్‌లైన్‌లో .....
టెర్రరిస్టు ముఠాలతో ఆన్‌లైన్ చాటింగ్
కొందరు ప్రముఖుల వివరాలు ఐఎస్ఐకి చేరవేత
గుర్తించిన కేంద్ర నిఘావర్గాలు
మేడ్చల్‌లో హోటల్ వెయిటర్ అరెస్టు
రెండు డమ్మీ పిస్టళ్లు స్వాధీనం
హైదరాబాద్, మేడ్చల్ టౌన్, మే 24(ఆంధ్రజ్యోతి): తాను ఉగ్రవాదిగా మారతానని, ఉగ్రదాడులు చేయడంలో తనకు శిక్షణ ఇవ్వమని కోరుతూ... పాకిస్థాన్‌లోని టెర్రరిస్టు ముఠాలతో ఆన్‌లైన్‌లో చాటింగ్ చేస్తున్న ఓ హోటల్ వెయిటర్‌ను ఆదివారం మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే దేశంలోని కొందరు ప్రముఖుల వివరాలను ఇతను ఉగ్రసంస్థలకు చేరవేయడంతో పాటు, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రభావంలోకి వెళ్లిపోయాడని... ఆ దేశానికి వెళ్లేందుకు సైతం ప్రయత్నిస్తున్నాడని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఉత్తర్‌ప్రదేశ్ గజియాబాద్‌కు చెందిన నిందితుడు జయీద్‌ఖాన్ నుంచి రెండు డమ్మీ పిస్టళ్లు, మొబైల్ ఫోన్లు, కొంతమంది వీవీఐపీలకు చెందిన కీలక సమాచారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరిలో మేడ్చల్ పట్టణానికి వలస వచ్చిన జయీద్‌ఖాన్‌కు స్ధానిక ముబారక్ హోటల్‌లో పనిచేసే ఫైజల్‌తో పరిచయం ఏర్పడింది. ఇతని సహకారంతో జయీద్‌ఖాన్ అదే హోటల్‌లో వెయిటర్‌గా చేరాడు. కాగా జయీద్ తరచూ దేశ వ్యతిరేక కార్యకలాపాలపై రీల్స్, తుపాకులు పట్టుకుని దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రాంలో పెట్టసాగాడు. ఇదే క్రమంలో ఇద్దరు యువకులు హబీబ్, రాణా ఇతని పోస్టులకు లైక్‌లు కొట్టి పరిచయం పెంచుకున్నారు. తరచూ వాట్సాప్ చాటింగ్‌లు చేసుకునేవారు. అనంతరం జయీద్ తనకు ఆయుధాలు సమకూర్చాలని హబీబ్, రాణాలను కోరడంతో వారు పాకిస్థాన్‌లోని ఐఎస్ఐకి చెందిన షహబాజ్‌ను ఇన్‌స్టాగ్రాం ద్వారా పరిచయం చేశారు. ఈక్రమంలో జయీద్ ఇన్‌స్టాగ్రాం ద్వారా కొన్ని ఉగ్రవాద సంస్ధలతో సంబంధాలు నెరపుతున్నాడు. ఉగ్రవాద శిక్షణలో పాల్గొంటానని పదే పదే చాటింగ్‌లలో కోరేవాడు. దీంతో పాక్‌లోని ఆ సంస్థల ప్రతినిధులు అతనికి కొన్ని పరీక్షలు పెట్టారు. భారత్‌లోని కొందరు వీవీఐపీల వివరాలను అందజేయాలని సూచించారు. వెంటనే జయీద్ వాటిని సేకరించి వారికి పంపించాడు. ఈ క్రమంలో జయీద్ ఇన్‌స్టాగ్రాంలో పెడుతున్న పోస్టులు, ఉగ్రవాద లింకులు, పాక్ నుంచి అతనికి అందుతున్న ఆదేశాలను కేంద్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు గుర్తించి మేడ్చల్ పోలీసులను అప్రమత్తం చేయడంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితుడు పనిచేస్తున్న ముబారక్ హోటల్ యాజమాన్యం, సిబ్బంది కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఇక్కడ పనిచేసే వారిలో చాలామంది ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉండటం గమనార్హం.