కుప్పకూలిన హోటల్ స్లాబ్
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:36 AM
వికారాబాద్ జిల్లా మర్పల్లిలో శనివారం ఉదయం శిథిలావస్థలో ఉన్న ఓ టిఫిన్ సెంటర్ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. టిఫిన్ చేసేందుకు వచ్చిన వారు భయాందోళనలతో పరుగులు తీయగా...
శిథిలాల కింద చిక్కుకుని నలుగురికి తీవ్ర గాయాలు
2 గంటలు శ్రమించి వారిని కాపాడిన స్థానికులు, పోలీసులు
వికారాబాద్ జిల్లా మర్పల్లిలో ఘటన
మర్పల్లి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా మర్పల్లిలో శనివారం ఉదయం శిథిలావస్థలో ఉన్న ఓ టిఫిన్ సెంటర్ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. టిఫిన్ చేసేందుకు వచ్చిన వారు భయాందోళనలతో పరుగులు తీయగా, నలుగురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికులు, పోలీసులు రెండు గంటల పాటు శ్రమించి జేసీబీతో శిథిలాలను తొలగించి ఆ నలుగుర్నీ ప్రాణాలతో కాపాడారు. నీజర్ (19)కు కుడికాలు, నడుము భాగంలో, రమేశ్ (38) తలకు, ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. వరుసకు అన్నాచెల్లెళ్లైన శివకుమార్(25)కు ఎడమ కాలు, కుడి చేయి, చందన(12)కు ఎడమ కాలు విరిగిందని వైద్యులు తెలిపారు. వారిని మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి తరలించారు. ఎస్సీ కార్పొరేషన్ దుకాణ సముదాయంలో ఈ టిఫిన్ సెంటర్ కొనసాగుతోంది. ప్రమాద సమయంలో అక్కడ 20 మంది వరకు ఉన్నారు. వారిలో నలుగురు టేబుళ్ల దగ్గర కూర్చోగా, మిగతా వారంతా బయటే ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో స్లాబ్ కూలిపోయింది. 50 సంవత్సరాల కిందట నిర్మించిన ఈ దుకాణ సముదాయం శిథిలావస్థకు చేరింది. ప్రభు త్వం గత ఏడాది కొత్తది నిర్మించేందుకు నిధులు మంజూరు చేసింది. కానీ ఇంతవరకు పనులు చేపట్టలేదు. దీనికి అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని పలువురు ఆరోపించారు. కాగా, క్షతగాత్రులను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పరామర్శించారు. సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివకుమార్, నీజర్‌లకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. బాధితులకు కుటుంబాలకు రూ.25 వేల చొప్పున ఆర్థికసహాయం అందించారు.