Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:44 AM
అమెరికాలోని వాషింగ్టన్‌లో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన కొటికలపూడి కృష్ణ కిశోర్ .....
పాలకొల్లు టెకీ దంపతుల మృతి..పిల్లలిద్దరికీ తీవ్రగాయాలు..
పాలకొల్లు టౌన్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని వాషింగ్టన్‌లో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన కొటికలపూడి కృష్ణ కిశోర్ (టిన్ను- 52), భార్య ఆశ కన్నా(45) అక్కడికక్కడే మరణించారు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కృష్ణ కిశోర్ కుమారుడు, కుమార్తెలకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కిశోర్ 1999లో అమెరికా వెళ్లి, అక్కడే సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా స్థిరపడ్డారు. గత నెలలో కుటుంబంతో కిశోర్ పాలకొల్లు వచ్చి, బంధుమిత్రులను కలిసి ఎంతో సంతోషంగా గడిపారు. వారం రోజుల క్రితమే తిరిగి అమెరికా వెళుతూ, మార్గమధ్యలో దుబాయ్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నట్టు ఆయన సోదరుడు కృష్ణ తెలిపారు. అక్కడి నుంచి శనివారం అమెరికా బయలుదేరిన కిశోర్ కుటుంబం, ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి కారులో వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ఘోరం చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. దంపతుల మృతితో పాలకొల్లులోని వారి కుటుంబ సభ్యులు, బంధువుల కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.