Share News

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై ఆశలు

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:35 AM

జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అసెంబ్లీలో ప్రకటించడంతో మార్పులు, చేర్పులపై చర్చ మొదలైంది. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించి అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేసిందని పేర్కొన్న మంత్రి, వాటన్నింటినీ సరిచేస్తామని ప్రకటించారు.

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై ఆశలు

అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి ప్రకటన

అసెంబ్లీ నియోజకవర్గమంతా ఒకే జిల్లాలో ఉంచాలనే సూచనలు

ఆలేరు, నకిరేకల్‌ రెవెన్యూ డివిజన్ల కోసం ఎదురుచూపు

తెరపైకి పలు మండలాల ఏర్పాటు డిమాండ్లు

అసెంబ్లీ నియోజకవర్గం ఒకే జిల్లాలో..

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అసెంబ్లీలో ప్రకటించడంతో మార్పులు, చేర్పులపై చర్చ మొదలైంది. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించి అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేసిందని పేర్కొన్న మంత్రి, వాటన్నింటినీ సరిచేస్తామని ప్రకటించారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పునర్వ్యవస్థీకరణపై ఆశలు పెరిగాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పాటు అవసరమైన చోట్ల రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించగా, ఆయా డిమాండ్లు మరోసారి తెరపైకి వస్తున్నాయి.

కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గాలు కొన్ని ఒకే జిల్లా పరిధిలోకి రాగా, మరికొన్ని అసెం బ్లీ నియోజకవర్గాలు రెండు, మూడు జిల్లాల పరిధిలోకి వచ్చాయి. తాజాగా, రెవెన్యూ మంత్రి వ్యాఖ్యలతో అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా మార్పులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో విస్తరించగా, మునుగోడు నియోజకవర్గం నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో ఉంది. నకిరేకల్‌ నియోజకవర్గంలో రామన్నపేట మండలం యాదాద్రి జిల్లాలోకి వెళ్లగా, మిగిలిన అన్ని మండలాలు నల్లగొండ జిల్లాలో ఉన్నాయి. ఒకే నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లో ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పాటు, రోడ్ల నిర్మాణాలు, ఇతర పలు సమస్యలపై ఎమ్మెల్యేలు, ప్రజలు రెండు, మూడు జిల్లాల పరిధిలోని కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎక్కువ మండలాలున్న జిల్లాలో అభివృద్ధి ఒక తీరుగా ఉంటే, తక్కువ మండలాలు కలిగిన జిల్లాలో అభివృద్ధిపై దృష్టి పెట్టలేని పరిస్థితి ఉం ది. తుంగతుర్తి నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల్లో సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి, తిరుమలగిరి, నాగారం,నూతనకల్‌, మద్దిరాల, అర్వపల్లి మండలాలు ఉండగా,యాదాద్రి జిల్లాలో మోత్కూరు, అడ్డగూడూరు మండలాలు, నల్లగొండ జిల్లాలో శాలిగౌరారం మండలం ఉంది. నియోజకవర్గం మూడు జిల్లాల్లో ఉండడంతో ఏశాఖకు సంబంధించి కూడా డివిజన్‌ కార్యాలయం లేని పరిస్థితి నెలకొంది. పైగా నియోజకవర్గమంతా ఒక పథకాన్ని అమలు చేయాలన్నా మూడు జిల్లాల అధికారులను, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపురం మండలాలు యాదాద్రి జిల్లాలో ఉండగా, మిగిలిన మునుగోడు, చండూరు, గట్టుప్పల్‌, నాంపల్లి, మర్రిగూడ మండలాలు నల్లగొండ జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ సైతం ఏ పథకం కోసమైనా రెండు జిల్లాలను సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నకిరేకల్‌ నియోజకవర్గంలో నకిరేకల్‌, కేతేపల్లి, కట్టంగూరు, నార్కట్‌పల్లి, చిట్యాల మండలాలు నల్లగొండ జిల్లాలో ఉండగా, రామన్నపేట మండలం యాదాద్రి జిల్లాలో ఉంది. దీంతో రామన్నపేట మండలం ఒక్కటే యాదాద్రి జిల్లాలో ఉండడంతో ఈ మండలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఈ ప్రభావం కనిపిస్తోంది.

తెరపైకి కొత్త డివిజన్లు, మండలాలు

రెవెన్యూశాఖ ద్వారా కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలా ల డిమాండ్లపై నివేదికలు తెప్పించి క్యాబినెట్‌లో చర్చించి అవసరమైన చోట ఏర్పాటు చేస్తామని రెవెన్యూ మంత్రి ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో కొత్త డివిజన్లు, మం డలాల డిమాండ్లు మరోసారి తెరపైకి వస్తున్నాయి. నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో మాట్లాడుతూ, నకిరేకల్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయడంతోపాటు, అమ్మనబోలు మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంలోనే రెవెన్యూ మంత్రి జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త డివిజన్లు, మండలాల ఏర్పాటుపై స్పష్టత ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో నకిరేకల్‌, ఆలేరు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉంది. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో అమ్మనబోలు, యాదాద్రి జిల్లాలో వెలిమినేడు, వేములకొండ, అర్రూరు, రఘునాథపురం, సూర్యాపేట జిల్లాలో కీతవారిగూడెం మండలాల ఏర్పాటు డిమాండ్లు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఈ మండలాల ఏర్పాటు కోసం గత ప్రభుత్వ హయాంలో ఉద్యమాలు, ఆందోళనలు కొనసాగాయి. అదేవిధంగా నల్లగొండ జిల్లాలోని చింతపల్లి మండలంలోని మాల్‌, గొడకండ్లను రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలోని కొన్ని గ్రామాలతో కలిపి మాల్‌ మండలాన్ని ఏర్పాటు చేసి, ఆ మండలాన్ని రంగారెడ్డి జిల్లాలో కలపాలనే డిమాండ్‌ ఆ ప్రాంతం నుంచి మొదలైంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త డివిజన్‌, మండలాల ఏర్పాటుపై సమీక్షిస్తామని మంత్రి ప్రకటించడంతో ఈ డిమాండ్లన్నీ మరోసారి వినవస్తుండటంతో ఇవి ఏ రూపు సంతరించుకుంటాయనే అంశం ఆసక్తిరేపుతోంది.

Updated Date - Jan 08 , 2026 | 12:35 AM