ఇందిరమ్మ రెండో విడతపై.. నిరుపేదల ఆశలు
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:24 PM
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతలో ప్రతీ నియోజకవర్గానికి రెండు వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
-నియోజకవర్గానికి రెండు వేల గృహాలు
-గుడిసెవాసులకే మొదటి ప్రాధాన్యం
-రూ. 2 లక్షల సాయంతో పాత ఇళ్లకు మహర్దశ
నెన్నెల, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతలో ప్రతీ నియోజకవర్గానికి రెండు వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ పథకంతో మొదటి విడతలో వం దల మంది ప్రయోజనం పొందారు. లబ్దిదారులకు ఎ లాంటి ఇబ్బంది లేకుండా బిల్లుల చెల్లింపులు కావడం.. తమ కళ్ల ముందే చాలామంది అందమైన ఇళ్లు పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేస్తుండటంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. ఈసారి గుడిసెల్లో నివసించేవారికే ప్రాధాన్యత ఇవ్వాలనే నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుతం లబ్దిదారులు దశలవారీగా ఇంటి నిర్మాణం చేపడితే దా నికి అనుగుణంగా బిల్లులను మంజూరు చేస్తున్నారు. అయితే, పూరిళ్లలో నివాసం ఉండే వారు ముందుగా డ బ్బులు పెట్టి ఇళ్లు కట్టుకునే పరిస్థితి ఉండుదు. ఇలాంటి వారికి హౌజింగ్ శాఖ ద్వారానే ఇంటిని నిర్మించి ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు రూ. 2 లక్షలు ఆర్థిక సా యం చేయాలని ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణ యం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
-పల్లెల్లో గుడిసెలు మాయం..
తెలంగాణాను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో గుడిసెవా సులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లలో వారికే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గతంలో దరఖాస్తు చేసుకొని ఎల్-1 జా బితాలో ఉన్న పేర్లను మరోసారి గెజిటెడ్ అధికారులతో పరిశీలన చేయించారు. గతంలో గ్రామాలకు కేటాయిం చిన సంఖ్య ఆధారంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు అ ర్హులను ఎంపిక చేశారు. ఎల్-1 జాబితాలో ఉండి గుడి సెలో నివసిస్తుంటే వారికి నేరుగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తారు. అర్హులు ఎక్కువగా ఉంటే తక్కువ గుడిసెలున్న గ్రామాల నుంచి బదిలీ చేస్తారు. దీంతో పాటు ఇందిరమ్మ కమిటీలు జాబితా అందిస్తే అందు లోని అర్హులకు నిబంధనల మేరకు పరిశీలించి ఎంపిక చేస్తారు.
నిబంధనలు ఇలా..
మండలానికి కోటా ప్రకారం గ్రామాలకు ఇళ్లను కే టాయించి అర్హులను ఎంపిక చేయనున్నారు. ప్రజాపా లన, ప్రగతి ప్రణాళిక గ్రామ సభల్లో దరఖాస్తు చేసు కొని, ఎల్-1 జాబితాలో ఉన్న అర్హులకే ఇళ్లు మంజూరు చేయనున్నారు. సొంతంగా స్థలం ఉండి ఇల్లు లేనివారికి ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా పూరిళ్లలో నివాసం ఉం డేవారికి చోటు కల్పిస్తారు. ఆయా గ్రామాలకు కోటా ప్రకారం అర్హులను అధికారులు, ఇందిరమ్మ కమిటీలు గుర్తించి జాబితాను ఎంపీడీవోలకు పంపిస్తారు. అవి పీ డీ నుంచి కలెక్టర్ లాగిన్‌కు వెళ్తాయి. జిల్లా ఇన్‌చార్జీ మంత్రి ఆమోదంతో ఇళ్లు మంజూరవుతాయి. నియోజ కవర్గంలో మంజూరయ్యే రెండు వేల ఇళ్లలో 1500లు కొత్తవి నిర్మించి, మిగతావి గతంలో పెండింగ్‌లో ఉన్న వాటికి నిదులు కేటాయించే అవకాశాలున్నాయి. గతం లో గృహలక్ష్మి పథకంలో సగం నిర్మించిన ఇళ్లకు ప్రస్తు తం ఇందిరమ్మ పథకంలో మంజూరు లేకుండా బేస్ మెంట్ వరకు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తే బిల్లులు ఇవ్వాలని సర్కారు భావిస్తోంది.
-నిలిచిన నిర్మాణాలు పూర్తి చేసేలా..
ఇందిరమ్మ పథకంలో 2004 నుంచి 2015 వరకు మంజూరై.. నిర్మాణ పనులు నిలిచి పోయిన ఇళ్లకు మహర్దశ రానుంది. గోడల స్థాయిలోనే నిలిచిపోయిన ఇళ్లకు స్లాబ్ వేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం క ల్పించింది. ఇందుకోసం నియోజకవర్గానికి 500 ఇళ్లను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ అధికారులు నియోజకవర్గాలు, మండలాల వారీగా పా త ఇళ్ల జాబితాను సిద్ధం చేసి ఎంపీడీవోలకు పంపిం చారు. గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న ఇళ్లపై పంచాయ తీ కార్యదర్శులు సర్వే చేస్తున్నారు. గోడల వరకే నిర్మించి వదిలేసిన ఇళ్లకు స్లాబ్ నిర్మాణానికి ఒక్కో ఇంటికి రూ. 2 లక్షల చొప్పున మంజూరు చేయనున్నారు. లబ్దిదా రుల అసక్తికి అనుసారంగా స్లాబ్ వేసుకునేందుకు అవ కాశం కల్పించనున్నారు. పంచాయతీ కార్యాదర్శులు గ్రా మాల్లో సర్వే చేసి జాబితాను సిద్ధం చేస్తున్నారు. పి ల్లర్లతో నిర్మించిన ఇళ్లతో పాటు, పిల్లర్లు లేకుండా కేవ లం గోడల వరకు నిర్మించిన ఇళ్లపై స్లాబ్ వేసేందుకు అనువుగా ఉంటే రూ. 2 లక్షలు మంజూరు చేస్తారు. నిలిచిన నిర్మాణాలకు ఆర్థిక సాయం చేయాలనే ప్రభు త్వ నిర్ణయం పట్ల పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రారంభించని లబ్ధిదారుల్లో ఆందోళన..
జిల్లాలో మొదటి విడతలో 10,305 ఇందిరమ్మ ఇళ్ల ను మంజూరు చేశారు. వాటిలో దాదాపుగా 2000ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగతావి దర్వాజా, స్లాబు, బేస్‌మెంటు స్థాయిలో ఉన్నాయి. 1500 వరకు ఇళ్ల ని ర్మాణం ప్రారంభమే కాలేదు. పని మొదలు పెట్టని ఇళ్ల ను రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతండటంతో వారం దరూ ఆందోళన చెందుతున్నారు. తమకు సొంతంగా డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకునే తాహతు లేకనే పనులు మొదలు పెట్టలేదని అంటున్నారు. డబ్బులు లేక ఇళ్లు చేజారేపరిస్థితి ఉందని వాపోతున్నారు. రెండో విడతలో గుడిసె వాసులకు ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే యోచ నలో ఉన్నందున, తమకు కూడా అలాగే కట్టిస్తే సొం తింటి కల నెరవేరుతుందని అంటున్నారు.