రెండో విడత ఇళ్లపై ఆశలు
ABN , Publish Date - May 21 , 2026 | 01:35 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత కేటాయింపులపై అర్హులైన వాళ్లు ఆశలు పెంచుకున్నారు. తెలంగాణ అవ తరణ దినోత్సవమైన జూన్ 2న అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఇళ్లను
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత కేటాయింపులపై అర్హులైన వాళ్లు ఆశలు పెంచుకున్నారు. తెలంగాణ అవ తరణ దినోత్సవమైన జూన్ 2న అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఇళ్లను కేటాయిస్తామని ఇప్పటికే ప్రభు త్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి ఎల్ 1, ఎల్ 2 కేటగిరీల్లో ఉన్న అర్హులకు ఇళ్లు మంజూరు చేసే అవకాశాలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూముల ఇళ్లు ముందుకు సాగకపోవడంతో అనేక మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారి సొంతింటి కల నెరవేరకుండా పోయింది. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత ఏడాది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ఆరంభించింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటా యించారు. అందులో భాగంగా జిల్లాకు మొత్తం 9438 ఇళ్లు కేటాయించారు. 2023 డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు జరిగిన ప్రజాపాలన గ్రామ సభల సందర్భంగా ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం, మహాలక్ష్మి, గృహలక్ష్మి, రైతు భరోసా, చేయూత పథకాల కోసం ఒకే ప్రొఫార్మాలో దర ఖాస్తులను స్వీకరించింది. అందులో భాగంగా జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,85,404, తెలంగాణ ఉద్యమకా రులకు 250 గజాల స్థలంతోపాటు ఇళ్లు మంజూరు కోసం 2,707 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖా స్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్‌ను క్రియేట్ చేసి తద్వారా క్షేత్ర స్థాయిలో సర్వే చేయించారు. సర్వే అనంతరం దరఖాస్తుదారులను మూడు కేటగిరీల్లో చేర్చారు. ఎల్ 1 కేటగిరీలో సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునే వాళ్లు, ఎల్ 2 కేటగిరీలో స్థలం లేని వాళ్లను, ఎల్ 3లో డాబా ఇళ్లు ఉండి, నాలు గు చక్రాల వాహనాలు, వ్యవసాయ భూములు గల వారిని, గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరై అర్ధంత రంగా నిలిపివేసిన వారిని కూడా ఇదే జాబితాల్లో చేర్చారు. మొదటి విడతలో సొంతంగా ఇంటి స్థలం గల ఎల్1 కేటగిరీలో ఉన్న వాళ్లకే ఇళ్లు మంజూరు చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు నియోజక వర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించింది. రెండో విడతలో నియోజకవర్గానికి ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తారనే విషయమై స్పష్టత లేదు. ఈసారి కొన్ని నిబం ధనలను సడలించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఎల్ 2 కేటగిరీలో ఉన్న గతంలో ఇంది రమ్మ ఇళ్లు మంజూరై బేస్‌మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసి నిలిపివేసిన ఇళ్ల లబ్ధిదారులకు తిరిగి మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఉద్యమకారులకు కూడా 250 గజాల స్థలంతో పాటు ఇళ్లు కూడా మంజూరు చేయనున్నట్లు తెలుస్తున్నది. రెండో విడత ఇళ్ల కోసం చాలా మంది అర్హులు ఎదురు చూస్తున్నారు.
ఫ మొదటి విడతలో 9438 ఇళ్ల కేటాయింపు
మొదటి విడతలో గతేడాది జిల్లాకు 9,438 ఇళ్లు కేటాయించారు. పెద్దపల్లి, రామగుండం అసెంబ్లీ నియో జకవర్గాలకు 3500 ఇళ్ల చొప్పున, మంథని నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు 1750 ఇళ్లు, ధర్మపురి నియోజకవర్గ పరిధిలో గల ధర్మారం మండ లానికి 688 ఇళ్లు కేటాయించారు. ఇందులో ఇప్పటి వరకు 6,429 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో 6008 ఇళ్లకు ముగ్గులు పోయగా 4,848 ఇళ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయి. ఇంకా 3009 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాల్సి ఉంది. పెద్దపల్లి నియోజకర్గంలో ఇంకా 405 ఇళ్లు, రామగుండం నియోజకవర్గంలో 2,110 ఇళ్లు, మంథని నియోజకవర్గంలో 311 ఇళ్లు, ధర్మారం మండలంలో 183 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాల్సి ఉంది. రామగుండం నియోజకవర్గంలో మినహా మిగతా చోట్ల ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మా ణాలను ఆరంభించకుంటే వాటిని రద్దు చేస్తున్నారు. ఆ ఇళ్లు మిగులుతున్నాయి. ఇళ్ల మంజూరు విషయంలో రామగుండం నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది. ఆ నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లల్లో సగం కూడా లబ్ధిదారులకు మంజూరు చేయకపోవడం గమనార్హం. ఏడాది కావస్తున్నా ఇళ్ల మంజూరు రామగుండంలో నత్తనడకన సాగుతున్నది. మొదట 1728 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయగా, ఇళ్లు నిర్మా ణాలు ఆరంభించని కారణంగా 338 ఇళ్లు రద్దయ్యాయి. మిగిలిన 1390లో 1266 ఇళ్లకు ముగ్గులు పోశారు. అవి వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయి. ఇళ్ల మంజూరు విష యంలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ నియోజక వర్గ ప్రజలు అంటున్నారు. 6008 ఇళ్లకు 4,848 ఇళ్లు ప్రగతిలో ఉన్నాయి. 890 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావ చ్చాయని జిల్లా గృహ నిర్మాణ శాఖ మేనేజర్ రాజేశ్వర్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఇళ్లు పూర్తి చేసు కున్న లబ్ధిదారులు గృహ ప్రవేశం కోసం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.