నామినేటెడ్ పదవులపై ఆశలు..
ABN , Publish Date - Apr 16 , 2026 | 12:51 AM
జగిత్యాలకు చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. ఇటీవల జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో మంగళవారం Hopes for nominated positions..
జగిత్యాల, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): జగిత్యాలకు చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. ఇటీవల జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో మంగళవారం జగిత్యాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్లతో భేటీ అయి పలు అంశాలను చర్చించి వారిలో భరోసా నింపారు. సుమారు రెండున్నర గంటల పాటు కాంగ్రెస్ నేతలతో సమావేశమై పలు అంశాలను చర్చించడంతో పాటు వారి మనోవేదనను స్వయంగా తెలుసుకోవడంతో సమస్యలు గట్టెక్కుతాయని ఆశిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్యలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశం కాంగ్రెస్ క్యాడర్‌లో కొత్త జోష్‌ను నింపింది.
ఫమనోగతాన్ని వెల్లడించిన సీనియర్లు
జగిత్యాలకు చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ల మనోగతాలను సీఎం రేవంత్‌రెడ్డి తెలుసుకున్నారు. సమావేశంలో సీనియర్లు వెల్లడించిన పలు అంశాలను పరిశీలనలోకి తీసుకున్నారు. పది సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారు రావడానికి తమవంతు సహకారాలను అందించామన్నారు. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జగిత్యాలలో పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో అంతర్మథనానికి గురవుతున్నామని సీఎం ఎదుట పలువురు సీనియర్లు వాపోయారు. జగిత్యాలకు చెందిన తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కారెక్కడానికి సిద్ధమైనప్పటికీ తాము మాత్రం కాంగ్రెస్ వెంటే ఉండడానికి నిర్ణయించుకున్నామని తేల్చి చెప్పారు. నమ్ముకున్న నేత మధ్యలో వదలివేసి వెళ్లినా..పార్టీ అండగా ఉంటుందని.. ఎలాంటి కష్టం రానివ్వదని కాంగ్రెస్ సీనియర్లకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
ఫ కాంగ్రెస్‌లో జోష్ నింపిన సమావేశం
జగిత్యాల కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఆశలు చోటుచేసుకున్నాయి. సీఎం నిర్వహించిన ప్రత్యేక భేటీలో తమ అభిప్రాయాలను వెల్లడించామని, సాధ్యమైనంత తొందరలో నామినేటెడ్ పదవులు దక్కుతాయన్న అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్ర స్థాయి పలు కార్పొరేషన్ పదవులు గాని, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నామినేటెడ్ పదవులు కాని తమను వరిస్తాయని ఆశిస్తున్నారు. భవిష్యత్తులో ఇటు పార్టీలో గాని, అటు ప్రభుత్వంలో గాని ప్రాధాన్యత దక్కుతుందన్న భరోసాతో ఉన్నారు. సుమారు 70 మందితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించగా, అందులో ఎనిమిది మందికి పరిస్థితిని వెల్లడించే అవకాశం దక్కింది. ప్రసంగించిన ప్రతీ ఒక్కరు నామినేటెడ్ పదవుల అంశాలను ప్రధానంగా ప్రస్తావించడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆ దిశగా పరిశీలన జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఫవైరల్‌గా మారిన సీఎం చెప్పిన పిట్ట కథ..
జగిత్యాల రాజకీయాలపై సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ సీనియర్లకు వివరించిన ఓ సినిమా పిట్ట కథ పార్టీ శ్రేణుల్లో వైరల్‌గా మారింది. ప్రముఖ ‘అరుంధతి’ సినిమాలోని ఓ ఉదంతాన్ని సీఎం వివరిస్తూ ఓ ప్రేతాత్మ ఒక వ్యక్తి శరీరంలో చొస్తే తప్పుదోవ పోతుంటాడని, ప్రేతాత్మ ఆదేశించిన విధంగా వ్యవహరిస్తుంటాడని అన్నారు. అదేమాదిరిగా ప్రస్తుతం జగిత్యాల జీవన్‌రెడ్డి రాజకీయం కొనసాగుతోందని వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ లక్ష్యంగా పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చానని, సినిమాలోని కథ మాదిరిగా ఓ సీసాలో కేసీఆర్‌ను బంధించానని సీఎం అన్నారు. ప్రస్తుతం జీవన్‌రెడ్డి ఆ సీసా మూత తీయడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. కార్యకర్తలు, నేతలు గమనించాలని పార్టీకి, ప్రభుత్వానికి సహకరించిన అందరికీ అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఫజీవన్‌రెడ్డి కేంద్రంగా మారుతున్న జగిత్యాల రాజకీయం..
జగిత్యాల రాజకీయం జీవన్‌రెడ్డి కేంద్రంగా రంగులు మారుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారుతో కలిసి పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయిన జీవన్ రెడ్డి మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో జగిత్యాల రాజకీయం ‘అటుది ఇటు...ఇటుది అటు’గా మారిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలో భారీగా చేర్పులు, మార్పులు చోటుచేసుకోవడంతో జగిత్యాల రాజకీయంగా గరంగరంగా తయారైంది. దీనికి తోడు ఇరు పార్టీలకు చెందిన అగ్రనేతలు జగిత్యాల రాజకీయంపై దృష్టి సారించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.