Share News

‘హానర్‌హోమ్స్‌’ కేసులో ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Jul 09 , 2026 | 05:53 AM

హానర్‌ హోమ్స్‌ కంపెనీ ఎండీ ఫొటోను వాడుకొని ఆ సంస్థ ఉద్యోగిని మోసగించి రూ.4.7 కోట్లు కొట్టేసిన సైబర్‌ మోసం కేసులో ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు.

‘హానర్‌హోమ్స్‌’ కేసులో ఇద్దరి అరెస్టు

  • సత్తుపల్లి కేంద్రంగా మ్యూల్‌ ఖాతాల దందా

హైదరాబాద్‌, జూలై 8(ఆంధ్రజ్యోతి): హానర్‌ హోమ్స్‌ కంపెనీ ఎండీ ఫొటోను వాడుకొని ఆ సంస్థ ఉద్యోగిని మోసగించి రూ.4.7 కోట్లు కొట్టేసిన సైబర్‌ మోసం కేసులో ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. ‘బాస్‌ స్కామ్‌’గా పిలుస్తున్న ఈ కేసులో సైబర్‌ నేరగాళ్లకు తన బ్యాంకు ఖాతాను అప్పగించి మోసానికి సహకరించిన వ్యక్తితోపాటు మరొకరిని అరెస్టు చేసినట్లు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్‌ బుధవారం తెలిపారు. హానర్‌ హోమ్స్‌ నుంచి లక్ష్మి సాయిశ్రీ టీఆర్‌డీ ఇన్‌ఫ్రాకు రూ.1.80 కోట్లు బదిలీ కావడంతో ఆ ఖాతా గురించి పోలీసులు ఆరా తీశారు. కొత్తపేటలో నివసిస్తున్న మండవల్లి శివనాగరాజు ఐసీఐసీఐ బ్యాంకులో ఈ కరెంట్‌ ఖాతా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అతడిని అరెస్టు చేశారు. అప్పటికే నాగరాజు ఖాతాలోకి వచ్చిన రూ.1.80 కోట్లు వివిధ ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. ఈ లావాదేవీ నిర్వహించినందుకు శివనాగరాజుకు సైబర్‌ నేరగాళ్లు రూ.4 లక్షలు కమీషన్‌గా ఇచ్చినట్లు బయటపడింది. అయితే, తనకు సైబర్‌ నేరగాళ్లతో పరిచయం లేదని, సత్తుపల్లికి చెందిన దోసపాటి కృష్ణసాయికి తన ఖాతాను అప్పగించానని శివనాగరాజు చెప్పడంతో అతడిని కూడా అరెస్టు చేశారు. సైబర్‌ నేరగాళ్లకు కృష్ణసాయి ఏజెంట్‌గా ఉండి మ్యూల్‌ ఖాతాలను అందిస్తున్నట్లు విచారణలో తేలింది.

Updated Date - Jul 09 , 2026 | 05:54 AM