పది అంతస్తులు దాటితే..అధికారం హెచ్‌ఎండీఏకే!
ABN , Publish Date - Feb 13 , 2026 | 05:08 AM
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10 అంతస్తులు దాటిన భవనాలకు నిర్మాణ అనుమతులను ఇకపై హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (హెచ్‌ఎండీఏ) మంజూరు చేయనుంది.
ఆ లోపు భవనాలకే ‘గ్రేటర్’ కార్పొరేషన్ల అనుమతులు
లేఅవుట్లకు అనుమతులూ హెచ్‌ఎండీఏ చేతిలోకే..
వీటి నుంచి వచ్చే ఆదాయంలో కార్పొరేషన్లకు వాటా
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి12 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10 అంతస్తులు దాటిన భవనాలకు నిర్మాణ అనుమతులను ఇకపై హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (హెచ్‌ఎండీఏ) మంజూరు చేయనుంది. మూడు కార్పొరేషన్ల (జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి) పరిధిలో ఓపెన్ లేఅవుట్లు, గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లకు అనుమతులు ఇచ్చే అధికారం కూడా హెచ్‌ఎండీఏకే దఖలు పడింది. పది అంతస్తుల వరకు భవనాలకు మాత్రమే కార్పొరేషన్లు నిర్మాణ అనుమతులు జారీ చేస్తాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో నంబర్ 45ను జారీ చేసింది. ఈ అనుమతుల జారీ కోసం హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగంలో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధి మొత్తం 11 జిల్లాల పరిధిలో 10,472 చదరపు కిలోమీటర్ల మేర ఉండటం గమనార్హం. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్-2030 ప్రకారం పట్టణ ప్రణాళికను అమలు చేస్తున్నారు.
కార్పొరేషన్లకు, హెచ్‌ఎండీఏలకు వాటా..
మూడు కార్పొరేషన్ల పరిధిలో పది అంతస్తులకుపైన భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో... సదరు కార్పొరేషన్‌కు, హెచ్‌ఎండీఏకు వాటాలు ఉంటాయి. అనుమతుల కోసం ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న తరహాలో ఫీజులే మొత్తం మూడు కార్పొరేషన్లకు వర్తిస్తాయి. ఇందుకు అనుగుణంగా లేఅవుట్లు, పది అంతస్తులు దాటిన భవన నిర్మాణ దరఖాస్తులు హెచ్‌ఎండీఏకు.. పది అంతస్తుల వరకు ఉన్న దరఖాస్తులు ఆయా కార్పొరేషన్లకు వెళ్లేలా బిల్డ్‌నౌలో మార్పులు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే అందిన దరఖాస్తులను మాత్రం ఆయా కార్పొరేషన్లు, శాఖలే పరిశీలించి, అనుమతులు జారీ చేస్తాయి.
త్వరలో హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌లో మార్పులు
ప్రస్తుతం ఆరు జోన్లు, ఇద్దరు డైరెక్టర్లతో హెచ్‌ఎండీఏ ప్రణాళికా విభాగం కొనసాగుతోంది. మూడు కార్పొరేషన్ల పరిధిలో అదనంగా వచ్చిన బాధ్యతల నేపథ్యంలో.. అదనంగా మూడు జోన్లను ఏర్పాటు చేసి, మరో ముగ్గురు డైరెక్టర్లను నియమించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. హెచ్‌ఎండీఏలో ఇటీవలే ఇద్దరు సీపీఓలకు డైరెక్టర్ హోదా పదోన్నతి లభించింది. వారికితోపాటు డైరెక్టర్ టౌన్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) నుంచి డిప్యూటేషన్‌పై ఓ మహిళా డైరెక్టర్ హెచ్‌ఎండీఏకు వచ్చేందుకు అనుమతిచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు హెచ్‌ఎండీఏ ప్రణాళికా విభాగంలో మార్పులు చేపట్టే అవకాశం ఉంది.