మోకిలలో ప్లాట్ల వేలానికి మంచి స్పందన
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:36 AM
హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మోకిలలో చేపట్టిన ప్లాట్ల వేలానికి కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వచ్చింది.
సగటున గజానికి 80 వేలకు పైగా ధర!
హైదరాబాద్ సిటీ, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మోకిలలో చేపట్టిన ప్లాట్ల వేలానికి కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. సోమవారం 50 ప్లాట్లను ఆన్‌లైన్‌లో వేలం వేయగా అన్నీ అమ్ముడయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 25 ప్లాట్లు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో 25 ప్లాట్లకు వేలం నిర్వహించారు. సగటున చదరపు గజం రూ.80వేలకు పైగా పలికినట్లు తెలిసింది. రెండు ప్లాట్లు చదరపు గజం లక్షకు పైగా పలికినట్లు సమాచారం. ఈ రెండు ప్లాట్లు వంద అడుగుల రోడ్డుకు ఆనుకొని ఉండడంతో కొనేందుకు ఎక్కువ మంది పోటీ పడినట్టు తెలిసింది. మంగళవారం మరో 50 ప్లాట్లను రెండు విడతల్లో విక్రయించనున్నారు.