హెచ్‌ఐవీ రక్తం ఎక్కించిన ఘటన..ఆత్మహత్య చేసుకున్న యువతి
ABN , Publish Date - Apr 11 , 2026 | 05:11 AM
ప్రేమించిన మరదలు పెళ్లికి నిరాకరించిందన్న అక్కసుతో ఉన్మాదిగా మారిన యువకుడు.. ఆమెకు హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కించాడు. ఆ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు బలవన్మరణానికి పాల్పడింది.
మార్చి 11న బలవంతంగా రక్తం ఎక్కించిన యువకుడు
సోషల్ మీడియాలో ప్రచారం
తీవ్ర మనోవేదనకు గురైన యువతి
సూసైడ్ నోట్ రాసి, సెల్ఫీ వీడియో తీసుకొని బలవన్మరణం
ఘట్‌కేసర్ రూరల్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ప్రేమించిన మరదలు పెళ్లికి నిరాకరించిందన్న అక్కసుతో ఉన్మాదిగా మారిన యువకుడు.. ఆమెకు హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కించాడు. ఆ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లాకు చెందిన యువకుడి(25) కుటుంబం పాతికేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి నివాసముంటోంది. అతని తల్లిదండ్రులిద్దరికీ హెచ్‌ఐవీ పాజిటివ్ ఉంది. తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. యువకుడు తమ ఇంటికి సమీపంలో ఉండే మరదలి(24)ని ఇష్టపడుతున్నాడు. పెద్దలూ సమ్మతించడంతో ప్రేమ కొనసాగింది. ఇటీవల వివాహానికి సిద్ధమయ్యారు. అయితే, యువతి తండ్రి.. యువకుడికి ఇటీవల రక్త పరీక్షలు చేయించగా హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలింది. దీంతో వివాహం రద్దు చేసుకున్నారు. కక్ష పెంచుకున్న యువకుడు గత నెల 11నఆమెకు హెచ్‌ఐవీ సోకిన రక్తాన్ని బలవంతంగా ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు. విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యువకుణ్ని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. ఎయిడ్స్ ఉన్న రక్తం ఎక్కిచారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో యువతి తీవ్ర మనోవేదనకు గురైంది. శుక్రవారం ఆమె నానమ్మ ఇంటికి వెళ్లి.. సెల్ఫీ వీడియోలో ‘మమ్మీ డాడీ.. నాకు బతకాలని లేదు. సోషల్ మీడియాలో వైరల్ చేసి నా జీవితం నాశనం చేశారు. నేను చేయని తప్పుకు నన్ను బలిచేశారు. నా క్యారెక్టరే నా రెస్పెక్ట్. నిజానిజాలు తెలుసుకోకుండా ఓ అమ్మాయిని సోషల్ మీడియాలో ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ‘అమ్మా నాన్న నన్ను క్షమించండి. నాకు బతకాలని లేదు. మరో జన్మంటూ ఉంటే మీ కడుపునే పుడతాను. చెల్లి, తమ్ముడు.. అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోవాలి’ అని సూసైడ్ నోట్ రాసింది. అనంతరం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. యువతిని ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.