రాత్రికి రాత్రే చారిత్రక ఆలయం కూల్చివేత
ABN , Publish Date - May 07 , 2026 | 05:36 AM
కాకతీయుల ఘనచరిత్రకు సాక్ష్యంగా వున్న శతాబ్దాల నాటి ఓ శిథిల శివాలయం రాత్రికి రాత్రే నేలమట్టమైంది. అద్భుత శిల్ప సంపదతో వున్న ఆలయం చూస్తుండగానే...
నర్సంపేటలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కాంట్రాక్టర్ దుశ్చర్య
గల్లంతైన కాకతీయ గణపతిదేవుడి కాలం నాటి శాసనం
పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం: ఎమ్మెల్యే మాధవరెడ్డి
ఖానాపురం, మే 6 (ఆంధ్రజ్యోతి) : కాకతీయుల ఘనచరిత్రకు సాక్ష్యంగా వున్న శతాబ్దాల నాటి ఓ శిథిల శివాలయం రాత్రికి రాత్రే నేలమట్టమైంది. అద్భుత శిల్ప సంపదతో వున్న ఆలయం చూస్తుండగానే రాళ్ల కుప్పగా మారిపోయింది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్‌లో ఉన్న చారిత్రక శివాలయాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం సోమవారం రాత్రి జకాంట్రాక్టర్ పూర్తిగా కూల్చి కుప్పగా పోశారు. ఈ చర్యపై స్థానికుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో బుధవారం అధికార యంత్రాంగం వచ్చి ఆరా తీసింది. ఆలయం కూల్చివేత విషయం తమకు తెలియదంటే, తమకు తెలియదని అధికారులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. ఈ ఆలయాన్ని 1213లో కాకతీయ రాజు గణపతిదేవుడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఆలయం చుట్టూ ఓ మట్టికోట కూడా ఉంది. కాలక్రమంలో ఈ ఆలయం కొంతభాగం కూలిపోయింది. దీంతో గత 70 ఏళ్లుగా ఇక్కడ పూజలు జరగడం లేదు. ఆలయాన్ని పునర్నిర్మించాలని గ్రామస్థులు 2022లో పురావస్తుశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు ఆలయాన్ని సందర్శించారు. గుడిని తమ ఆధీనంలోకి తీసుకొని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చినా అడుగు ముందుకు పడలేదు. తాజాగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి బుల్డోజర్‌తో ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. మట్టికోటను కూడా కొంతమేర తొలగించి రహదారి నిర్మించారు. ఈ ఆలయంలో కాకతీయుల నాటి శాసనం ఉందని, ఆలయాన్ని కుప్పకూల్చడంతో అది కూడా గల్లంతయ్యిందని స్థానికులు చెప్పారు. జిల్లా కలెక్టర్ సత్యశారద, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బుధవారం ఆలయ శిథిలాలను పరిశీలించారు. యథాస్థానంలో ఆలయ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మాధవరెడ్డి తెలిపారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. శివాలయం పురావస్తు శాఖ పరిధిలో లేనందువల్ల హద్దులు గుర్తించలేదని అన్నారు. త్వరలోనే పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకెళ్లి పునర్మిర్మాణం చేపడతామని తెలిపారు.
