2800 పరిశ్రమలు.. 50 దరఖాస్తులు
ABN , Publish Date - Jul 16 , 2026 | 06:20 AM
పలు వివాదాలకు, అధికార-ప్రతిపక్షాల మధ్య వాద ప్రతివాదాలకు కేంద్రంగా మారిన హిల్ట్ పాలసీ కింద దరఖాస్తులు నామమాత్రంగానే వచ్చాయి.
హిల్ట్ పాలసీకి స్పందన నామమాత్రమే.. నెలలు గడుస్తున్నా పురోగతి లేదు
భూముల కన్వర్షన్ ఫీజు అధికంగా ఉందంటున్న పరిశ్రమల అధిపతులు
భూములిచ్చి, మౌలిక వసతులు కల్పిస్తే పరిశ్రమల్ని తరలిస్తామని స్పష్టీకరణ
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): పలు వివాదాలకు, అధికార-ప్రతిపక్షాల మధ్య వాద ప్రతివాదాలకు కేంద్రంగా మారిన హిల్ట్ పాలసీ కింద దరఖాస్తులు నామమాత్రంగానే వచ్చాయి. హిల్ట్ విధానాన్ని వర్తింపచేసిన 22 పారిశ్రామిక వాడల్లో ఉన్న పరిశ్రమల సంఖ్య 2800 కాగా.. వచ్చిన దరఖాస్తులు కేవలం 50. హైదరాబాద్ నగరంలో దశాబ్దాల క్రితం ఏర్పాటైన పారిశ్రామిక వాడలను ఔటర్ రింగ్ రోడ్ వెలుపలకు తరలించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హిల్ట్-పీ)ని ప్రకటించింది. దీని ద్వారా 22 పారిశ్రామిక వాడల్లోని 9,292 ఎకరాల్లో ఉన్న భూములను నిర్దిష్ట నిబంధనల మేరకు బహుళ అవసరాల (మల్టీ పర్పస్ యూజ్) భూములుగా మార్చుకునే అవకాశం కల్పించింది. భూముల కన్వర్షన్ ప్రక్రియకు టీజీఐఐసీని నోడల్ ఏజెన్సీగా నియమించింది. కాగా, ఈ విధానాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. రూ.లక్షల కోట్ల భూ కుంభకోణం అంటూ ఆరోపణలు చేశాయి. దీనికి స్పందనగా ప్రభుత్వం.. హిల్ట్ పాలసీ విధానాలను పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రత్యేక జీవోను కూడా విడుదల చేసింది. అయితే పాలసీని ప్రకటించి నెలలు గడుస్తున్నా అమలు దిశగా ఆశించిన పురోగతి కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భూముల కన్వర్షన్ దరఖాస్తులకు జూన్ 30వ తేదీతో గడువు ముగియగా.. కేవలం 50 మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. వాటిలో ఎన్ని పరిశీలనలో ఉన్నాయి? ఎన్ని ఆమోదం పొందాయి? అనే అంశాలపై టీజీఐఐసీ ఇప్పటివరకు స్పష్టమైన సమాచారాన్ని వెల్లడించలేదని పరిశ్రమల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, హిల్ట్ విధానానికి పారిశ్రామికవేత్తల నుంచి సానుకూలత వ్యక్తం కావటం లేదు. భూముల కన్వర్షన్‌కు విధిస్తున్న ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర చార్జీలు అధికంగా ఉన్నాయని చాలామంది పరిశ్రమల యజమానులు భావిస్తున్నారని, అందుకే దరఖాస్తుకు ముందుకు రావటం లేదని సమాచారం. వచ్చిన ఆ కొద్దిపాటి దరఖాస్తులు కూడా మూతపడిన సంస్థలవేనని తెలుస్తోంది.
చర్చలు జరిపితేనే ముందడుగు
ప్రాసెసింగ్ ఫీజులను తగ్గించాలని, ఈ మేరకు తమకు ఉన్న ఇతరత్రా సందేహాల మీద కూడా అధికారులు స్పష్టతనివ్వాలని పరిశ్రమల యజమానులు కోరుతున్నారు. సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని సూచిస్తున్నారు. హిల్ట్ పాలసీ అమలుపై పర్యావరణవేత్తలు కూడా ఆసక్తితో ఉన్నారు. ‘నగరాభివృద్ధి, కాలుష్య నియంత్రణ, భూముల సమర్థ వినియోగం వంటి లక్ష్యాలతో తీసుకొచ్చిన ఈ విధానం విజయవంతం కావాలంటే కేవలం ఉత్తర్వులు జారీ చేయడం సరిపోదు. పరిశ్రమల యజమానుల ఆందోళనలను, సందేహాలను పరిష్కరించి, పారదర్శక ప్రక్రియలను అమలు చేయాలి. వేగవంతమైన అనుమతి ప్రక్రియను తీసుకురావాలి’ అని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
ఐదేళ్ల సమయం కావాలి
ప్రజా ప్రయోజనం దృష్ట్యా హిల్ట్ మంచి విధానమే. మేమూ స్వాగతిస్తున్నాం. మా నాచారం ఎస్టేట్‌లో 700 వరకు కంపెనీలు ఉండగా 20 వరకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశాం. ఓఆర్‌ఆర్ బయట మాకు ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్‌ను కేటాయించమని, హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకున్న వారికి దాంట్లో ప్రాధాన్యతను కల్పించాలని, కన్వర్షన్ ఫీజులను తగ్గించాలని, పూర్తి స్థాయి కన్వర్షన్ సమయాన్ని డిసెంబరు వరకు పొడిగించాలని కోరాం. కన్వర్షన్ చేసుకున్న వారికి బయటికి వెళ్లేందుకు ఐదేళ్ల సమయం ఇస్తే నూతన పరిశ్రమలు స్థాపించుకుంటాం. గ్రీన్, ఆరెంజ్, రెడ్ క్యాటగిరీల కంపెనీలను వేరు చేసి విడివిడిగా భూ కేటాయింపులు జరపాలి.
- నాచారం ఇండస్ట్రియల్ ఏరియా
లోకల్ అథారిటీ చైర్మన్ రామేశ్వర్ రెడ్డి మౌలిక సదుపాయాలు కల్పిస్తే వెళ్తాం
గాంధీనగర్ ప్రాంతంలో సుమారు 200 పరిశ్రమలున్నాయి. అందులో కేవలం ఒక్కటే హిల్ట్ పాలసీ కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ పాలసీతో నగరం మరింత అభివృద్ధి చెందుతుందనే ప్రభుత్వ ఆలోచనను స్వాగతిస్తున్నాం. కానీ, ఉన్నపళంగా పరిశ్రమలు మూసేసి కొత్త ప్రాంతంలో నెలకొల్పడం అంటే భారీఖర్చుతోపాటు చాలా సమయంతో కూడుకున్న వ్యవహారం. దీనికిగాను ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇవ్వాలి. ఓఆర్‌ఆర్ బయట ప్రభుత్వమే భూములు కేటాయించి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. అప్పుడు చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోపాటు భారీ పరిశ్రమలు కూడా హిల్ట్ కన్వర్షన్ కోసం ముందుకొచ్చే అవకాశం ఉంది.
- గాంధీనగర్ ఇండస్ట్రియల్
ఏరియా లోకల్ అథారిటీ చైర్మన్ స్వామి గౌడ్