Share News

Deputy CM Bhatti Vikramarka: హిల్ట్‌ పాలసీతో 10,776 కోట్ల ఆదాయం

ABN , Publish Date - Jan 07 , 2026 | 04:01 AM

రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ను కాపాడుకోవడానికే ‘హిల్ట్‌’ పాలసీని తీసుకొచ్చామని.. రాష్ట్రానికి రూ.10,776కోట్ల ఆదాయం వచ్చేలా ఆ విధానాన్ని రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు......

Deputy CM Bhatti Vikramarka: హిల్ట్‌ పాలసీతో 10,776 కోట్ల ఆదాయం

  • హైదరాబాద్‌ను, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే ఈ విధానం.. ప్రతిపక్షాలు విషం కక్కడం మానుకోవాలి

  • తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ను సభలో ప్రవేశపెట్టిన భట్టి

హైదరాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ను కాపాడుకోవడానికే ‘హిల్ట్‌’ పాలసీని తీసుకొచ్చామని.. రాష్ట్రానికి రూ.10,776కోట్ల ఆదాయం వచ్చేలా ఆ విధానాన్ని రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. మంగళవారం శాసనసభలో ‘హైదరాబాద్‌ పారిశ్రామిక భూ బదలాయింపు’ విధానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ఆదాయం తీసుకువచ్చే హిల్ట్‌ విధానంపై ప్రతిపక్షాలు విషం కక్కడం మానుకోవాలని హితవు పలికారు. ఈ పాలసీ లేకపోతే కన్వర్షన్‌కు ఎకరానికి రూ.12 లక్షలు మాత్రమే ఆదాయం వచ్చేదని.. కానీ దీని ద్వారా ప్రభుత్వానికి ఎకరానికి రూ.7 కోట్ల దాకా ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రిడ్‌, ఫ్రీ హోల్డ్‌ పాలసీ ద్వారా కేవలం రూ.574 కోట్ల ఆదాయమే వచ్చిందని, నూతన పాలసీతో అది అమాంతం పెరుగుతుందని పేర్కొన్నారు. హిల్ట్‌ విషయంలో ఏ అనుమానాలు ఉన్నా నివృత్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీనిపై ఎవరికైనా అనుమానం ఉంటే ప్రభుత్వానికి లేఖ రాయొచ్చని.. 2014 నుంచి ప్రస్తుత హిల్ట్‌ పాలసీ వరకు ఏ ఏజన్సీ ద్వారానైనా ఎలాంటి విచారణకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు డీజీల్‌ బస్సులను హైదరాబాద్‌ ఆవలికి తరలిస్తూ వాటి స్థానంలో ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెడుతున్నామని, అలాగే కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్‌ అవతలివైపునకు తరలిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలున్న భూములపై హక్కులన్నీ ఆయా యాజమాన్యాలవేనని, వాటిపై ప్రభుత్వానికి ఎటువంటి హక్కూ లేదని ఆయన తేల్చిచెప్పారు. అలాగే.. మంగళవారం శాసనసభలో ‘తెలంగాణ రైజింగ్‌-2047’ లక్ష్యాలపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన విజన్‌ డాక్యుమెంట్‌ను సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికే తమ ప్రభుత్వం క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ విధానాన్ని అనుసరించనుందని స్పష్టం చేశారు.


ఆ విధానం ద్వారా 2047 నాటికి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను 3 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతమున్న ఆర్ధిక విధానాలతో ముందుకెళితే 2047నాటికి సహజంగానే 1.2 ట్రిలియన్‌ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదుగు తామని ఆర్ధికవేత్తలు చెబుతున్నారని, కానీ ప్రతి రైతును, దళితుడిని, గిరిజనుడినీ, మహిళను అభివృద్ధిలోకి తీసుకురావాలంటే ఇది సరిపోదని చెప్పారు. అందుకే 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. అందులో భాగంగా ప్రాజెక్టుల ఏర్పాటుకు కొత్త ప్రాదేశిక భౌగోళిక హద్దులు ఏర్పాటు చేశామన్నారు. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) ద్వారా ఓఆర్‌ఆర్‌ లోపలివైపు అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇక్కడే భారత్‌ ఫ్యూచర్‌సిటీ ఉందని, ఇందులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) నగరంతో పాటు ఒక హెల్త్‌ సిటీ కూడా ఉంటుందని తెలిపారు. పెరి అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (ప్యూర్‌)లో ఓఆర్‌ఆర్‌-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్యన కర్మాగారాలు, లాజిస్టిక్స్‌ హబ్‌లు ఏర్పాటవుతాయని, బ్లూ-కాలర్‌ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఇక రూరల్‌ అగ్రి రీజియన్‌ ఎకానమీ (రేర్‌)లో ఆర్‌ఆర్‌ఆర్‌ అవతలివైపు వ్యవసాయాన్ని, అనుబంధ రంగాలనుప్రోత్సహించి అధిక విలువైన బయో ఎకానమీగా పరిగణిస్తామని వివరించారు. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో జర్మన్‌ డ్యూయల్‌-సిస్టమ్‌ ఆఫ్‌ అప్రెంటి్‌సషి్‌పను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే విజన్‌ డాక్యుమెంట్‌ లక్ష్యమని తెలిపారు. స్వయం సహాయక సంఘాల బృందాలకు రుణాలు ఇవ్వడమే కాకుండా వాటిని కార్పొరేట్‌ సంస్థలుగా మార్చనున్నట్టు భట్టి తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.కోటి బీమా బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నాం:భట్టి

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ త్వరలో రూ.కోటి బీమా పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకోసం బ్యాంకులతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. సింగరేణిలో కార్మికులందరికీ రూ.కోటి బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ఇదే విధానంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.కోటి బీమా అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కాగా, సింగరేణికి చెందిన ఖాళీ భూముల్లో కార్మికులు/మాజీ కార్మికులు ఇళ్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని, మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ సౌకర్యం కొనసాగించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. దీనిపై భట్టి జవాబు ఇస్తూ... ఇళ్ల నిర్మాణం విషయమై సింగరేణి పాలక మండలి సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 04:01 AM