Share News

‘హిల్ట్‌’ పాలసీకి మరో 3 నెలల గడువు

ABN , Publish Date - Aug 07 , 2026 | 06:27 AM

హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ ల్యాండ్స్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పాలసీ (హిల్ట్‌) కింద దరఖాస్తులు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలలు గడువు ఇచ్చింది.

‘హిల్ట్‌’ పాలసీకి మరో 3 నెలల గడువు

  • జూన్‌ 5కు ముందున్న రిజిస్ట్రేషన్‌ విలువలతోనే భూముల మార్పిడికి చాన్స్‌

  • అక్టోబర్‌ 31 వరకు దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ ల్యాండ్స్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పాలసీ (హిల్ట్‌) కింద దరఖాస్తులు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలలు గడువు ఇచ్చింది. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ లోపల ఉన్న 22 పారిశ్రామిక ఎస్టేట్‌, పార్కుల భూములను నివాస, వాణిజ్య, మిశ్రమ వినియోగ (మల్టీ యూజ్‌) అవసరాలకు అనుగుణంగా మార్చుకునేందుకు తీసుకొచ్చిన ఈ పాలసీకి.. తొలుత నెల రోజులే సమయం ఇవ్వడంతో తగిన స్పందన రాలేదు. దీనితో ప్రభుత్వం మరింత గడువు ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్‌ 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియకు సంబంధించి జూన్‌ 5కు ముందు అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్‌ విలువలతోనే భూముల మార్పిడి వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. గతంలో హిల్ట్‌ పాలసీకి కేవలం నెల రోజులే సమయం ఇవ్వడంతో దరఖాస్తు చేసుకోలేకపోయామని.. మళ్లీ అవకాశం ఇవ్వాలని పరిశ్రమల సంఘాలు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. హిల్ట్‌ పాలసీకి సంబంధించిన ఇతర నిబంధనలు, మార్గదర్శకాలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.


పరిశ్రమల విజ్ఞప్తిపై కనిపించని స్పందన

ఓఆర్‌ఆర్‌ లోపల మొత్తం 22 పారిశ్రామిక ఎస్టేట్‌లు/పార్కుల్లో సుమారు 2,800 పరిశ్రమలు 9,292 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. అందులో రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం కేటాయించాల్సిన భూములు పోగా.. సుమారు 4,740 ఎకరాల భూములను బహుళ వినియోగానికి వీలుగా మార్చుకునే అవకాశం ఉంది. అయితే పదోవంతు పరిశ్రమల నుంచి కూడా హిల్ట్‌ కోసం ఆసక్తి వ్యక్తం కాలేదు. ఓఆర్‌ఆర్‌ బయట కొత్త పరిశ్రమలను నెలకొల్పడానికి వీలుగా పారిశ్రామికవాడలను అభివృద్ధి చేయాలని.. తరలింపు కోసం పరిశ్రమల తీరును బట్టి (రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌ల వారీగా) రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు గడువు ఇవ్వాలని.. కొత్త పరిశ్రమల స్థాపన కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని విజ్ఞప్తులు వచ్చాయి. అయితే గురువారం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 26లో అవేమీ పేర్కొనలేదు. కేవలం గడువు పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Updated Date - Aug 07 , 2026 | 06:28 AM