డామిట్.. కథ అడ్డం తిరిగింది!
ABN , Publish Date - Feb 14 , 2026 | 04:22 AM
కుర్చీపై కన్నేసిన ఆ నేతలు.. అసలు ఆ రేసులో నిల్చునే అవకాశాన్నే కోల్పోయారు. రచ్చ గెలిచేందుకు ఉత్సాహం చూపినా ఇంటనే గెలవలేకపోయారు! మునిసిపల్ ఎన్నికల్లో మేయర్, చైర్‌పర్సన్ పీఠాలు కచ్చితంగా తమకే దక్కేలా .....
మేయర్, ఛైర్‌పర్సన్ అభ్యర్థుల ఓటమి
నిజామాబాద్‌లో నామినేషన్‌కు ముందు రూ.8 కోట్ల పన్ను కట్టిన మహిళా అభ్యర్థి పరాజయం
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): కుర్చీపై కన్నేసిన ఆ నేతలు.. అసలు ఆ రేసులో నిల్చునే అవకాశాన్నే కోల్పోయారు. రచ్చ గెలిచేందుకు ఉత్సాహం చూపినా ఇంటనే గెలవలేకపోయారు! మునిసిపల్ ఎన్నికల్లో మేయర్, చైర్‌పర్సన్ పీఠాలు కచ్చితంగా తమకే దక్కేలా అధిష్ఠానం నుంచి హామీ తీసుకున్న అభ్యర్థులు తీరా సొంత గల్లీలోనే ఓటమి మూటగట్టుకున్నారు. తమ పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కినా.. సొంత డివిజన్లు, వార్డు ల్లో ఓడిపోవడంతో మేయర్, చైర్‌పర్సన్ కుర్చీలపై ఆశలే గల్లంతయ్యాయి. దీంతో సదరు అభ్యర్థులు షాక్‌కు గురయ్యారు. నిజామాబాద్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్, మజ్లిస్ కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను దక్కించుకునే అవకాశాలున్నాయి. ఇక్కడ మేయర్ అభ్యర్థిగా వంశీ హోటల్ యజమాని కాటిపల్లి నరేందర్‌రెడ్డి సతీమణి శమంతను అధికార కాంగ్రెస్ ముందుగానే ప్రకటించింది. 19వ డివిజన్ నుంచి శమంతను బరిలో దింపారు. అయితే ఆ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఆమె ఓడిపోయారు. శమంత కార్పొరేటర్‌గా నామినేషన్ వేసే సమయం లో ఇంటి, ఆస్తిపన్ను బకాయిల అంశం తెరపైకి వచ్చింది.
నరేందర్‌రెడ్డి దంపతులు అధికారికంగా రూ.8 కోట్ల పన్ను బకాయిలు చెల్లించారు. తాను పోటీచేస్తున్న 19 డివిజన్‌లో కూడా ఎన్నికల ఖర్చు పెద్ద ఎత్తున పెట్టినట్లు తెలిసింది. ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు డబ్బులు పంపిణీ చేసినట్లు సమాచారం. మేయర్ అభ్యర్థి కావటంతో 60 డివిజన్లకు కూడా ఎన్నికల ఖర్చులకు నిధులు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. మొత్తంగా రూ. 20 కోట్లు లెక్కకు వచ్చినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఆర్మూర్ మునిసిపాలిటీలో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన ముగ్గురు చైర్‌పర్సన్ అభ్యర్థులు ఓడిపోయారు.
రేసులో ఉన్న ఏబీ శ్రీదేవి, ఖాందేశ్ సంగీత, గడ్డం జ్యోతికి ఓటర్లు షాకిచ్చారు. కామారెడ్డి మునిసిపాలిటీలో కాంగ్రెస్ నుంచి చైర్‌పర్సన్ పదవులు ఆశించిన ఊరుదొండ వనిత, పాక జ్ఞానేశ్వరి, గుండుగుల సవితలు కూడా ఓడిపోయారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మునిసిపాలిటీలో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి కట్ట సురేశ్ కుమార్ గుప్తా, నారాయణపేట మునిసిపాలిటీలో సరిత భట్టాడ్ ఓటమిపాలయ్యారు. అలంపూర్‌లో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి ఇస్మాయిల్ ఓడిపోయారు. అమరచింత మునిసిపాలిటీలో చైర్‌పర్సన్ అభ్యర్థి లింగమ్మ ఓడిపోయారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో చైర్‌పర్సన్ అభ్యర్థులు ఎన్‌పీ నేహాశ్రీ, స్వప్నలు ఓటమిని చవిచూశారు.
ఓటుకు రూ.25వేలు, గ్రాము బంగారం చొప్పున ఇచ్చినా..
విజయం సాధిస్తామన్న ఆశలతో ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెట్టిన అభ్యర్థులు తీరా ఓడిపోవడంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అందునా.. తమకన్నా తక్కువ ఖర్చు పెట్టినవారి చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మెయినాబాద్ మునిసిపాలిటీ ఓ ప్రధాన పార్టీ అభ్యర్ధి ఓటర్లకు రూ.25వేలతో పాటు గ్రాము బంగారం చొప్పున పంచిపెట్టారు. ఇలా ఆ అభ్యర్థి వార్డులో ఏకంగా నాలుగున్నర కోట్లు ఖర్చుచేశారు. ఆ అభ్యర్థికి కనీస స్థాయిలో కూడా ఓట్లు రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చివరకు మూడోస్థానం కూడా దక్కలేదు. ఇక్కడ రూ.కోటి ఖర్చుపెట్టిన అభ్యర్ధికే విజయం వరించింది. ఈ మునిసిపాలిటీలో ఓటుకు రూ.50వేలు పంపిణీ చేసిన అభ్యర్థి విజయం సాధించారు.
ఈ వార్డులో ఆయన దాదాపు మూడున్నర కోట్లు ఖర్చుచేశారు. శంకరపల్లిలో ఓ వార్డులో పోటీపడి ఓటుకు రూ.30 వేల నుంచి రూ.35వేలు పంపిణీ చేసిన ఓ ప్రధా న పార్టీ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. ఆ అభ్యర్థి కన్నా తక్కువగా ఓటుకు రూ.20 వేల నుంచి 25వేలు పంపిణీ చేసిన అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ ఇంకా మూడు వార్డుల్లో ఓటుకు రూ. 20 వేల నుంచి 30వేల వరకు ఖర్చుపెట్టిన ముగ్గురు అభ్యర్థులు అధిక మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ ప్రధాన పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్ధి అంటూ ప్రాచుర్యం పొందిన అభ్యర్థిని సొంత పార్టీ వారే ఓడించడం గమనార్హం.