నిషేధిత భూముల జాబితాపై 2రోజుల్లో ఉన్నతస్థాయి కమిటీ
ABN , Publish Date - Mar 27 , 2026 | 03:51 AM
రిజిస్ట్రేషన్ యాక్ట్ లోని సెక్షన్-22(ఏ) ప్రకారం నిషేధిత భూముల జాబితాలో పెట్టిన భూముల సమస్యలపై 2రోజుల్లో ఉన్నతస్థాయి కమిటీ వేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్ యాక్ట్ లోని సెక్షన్-22(ఏ) ప్రకారం నిషేధిత భూముల జాబితాలో పెట్టిన భూముల సమస్యలపై 2రోజుల్లో ఉన్నతస్థాయి కమిటీ వేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఆలేరు నియోజకవర్గంలో 49 వేల పేదల ఇళ్లు, స్థలాలను నిషేధిత జాబితాలో పెట్టారని, దీనివల్ల స్థానికంగా పేద వర్గాలు ఆందోళనలో ఉన్నాయని ఆలేరు శాసనసభ్యుడు బీర్ల అయిలయ్య శాసనసభలో గుర్తు చేశారు. ఈ సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ వేసి, నివేదిక తెప్పించుకొని, క్యాబినెట్‌లో చర్చించి, నిర్ణయం వెలువరిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఆస్తి పన్ను ఈనెల 31వ తేదీలోగా కడితే వడ్డీ రాయితీ 90 శాతం ఇచ్చే ఆఫర్‌ను రాష్ట్రమంతటా అమలు చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మజ్లిస్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాల ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు నగదు రహిత వైద్యం అందించాలని సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. జీవిత బీమా సౌకర్యం కల్పించాలని, రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు జీవన భృతి అందించాలని సూచించారు. శాసనసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని బీఆర్‌ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. 4మండలాలతో ఉన్న ఈ ప్రాంతం ఒక్కో సేవ కోసం ఒక్కో ప్రాంతానికి వెళ్లే పరిస్థితి ఉందని గుర్తు చేశారు. తక్షణమే ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ చేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎల్పీజీ కొరతను తీర్చాలి
రాష్ట్రంలో ఎల్పీజీ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మజ్లిస్ ఎమ్మెల్యే మేరాజ్ హుస్సేన్ చెప్పారు. వాణిజ్య సిలిండర్ల కొరతతో వేలాది మంది ఉపాధి కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. దీనికి మంత్రి జూపల్లి కృష్ణారావు బదులిస్తూ రాష్ట్రంలో 2నెలలకు సరిపడా ఎల్పీజీ గ్యాస్ నిల్వలున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.