Inter-State Water Resources: 30న జల వివాదాల కమిటీ భేటీ
ABN , Publish Date - Jan 17 , 2026 | 06:14 AM
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ఈ నెల 30న తొలిసారి భేటీ కానుంది.
ఢిల్లీలో సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ అధికారుల తొలి భేటీ
ఇరు రాష్ట్రాల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్న కమిటీ సభ్య కార్యదర్శి
హైదరాబాద్/ న్యూఢిల్లీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ఈ నెల 30న తొలిసారి భేటీ కానుంది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీ ఢిల్లీలోని సేవాభవన్‌లో 30న మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. కమిటీ సభ్య కార్యదర్శి రాకేశ్‌కుమార్ దీనిపై శుక్రవారం ఇరు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశారు. ఇరు రాష్ట్రాలకు చెందిన సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా 4 అంశాలపై చర్చించనున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. ఈ భేటీలో ఏపీ నుంచి జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఆ శాఖ ఈఎన్‌సీ, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగంచీఫ్ ఇంజనీర్... తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్‌సీ (జనరల్) మహ్మద్ అంజాద్ హుస్సేన్‌తోపాటు కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు, జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) చీఫ్ ఇంజనీర్ పాల్గొననున్నారు. కాగా, పోలవరం-బనకచర్ల/నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రాఽథమిక సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎ్‌ఫఆర్) మదింపు కోసం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చేపట్టిన ప్రక్రియను విరమించుకుంటేనే ఉన్నతస్థాయి కమిటీ సమావేశానికి హాజరవుతామని తెలంగాణ ఇదివరకే తేల్చి చెప్పింది. ఈ క్రమంలో భేటీ విషయంలో తెలంగాణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది.