Land Encroachments: ఐడీపీఎల్ భూముల అన్యాక్రాంతంపై ఉన్నత స్థాయి సర్వే
ABN , Publish Date - Jan 04 , 2026 | 05:16 AM
ఐడీపీఎల్ భూముల అన్యాక్రాంతంపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి సర్వేకి ఆదేశించింది. పరిశ్రమకు చెందిన భూములను కొంతమంది ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో.....
ఆర్జేడీ శ్రీహరి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
హైదరాబాద్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ఐడీపీఎల్ భూముల అన్యాక్రాంతంపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి సర్వేకి ఆదేశించింది. పరిశ్రమకు చెందిన భూములను కొంతమంది ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పెద్దఎత్తున ఆక్రమించారు. ఆక్రమిత భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రూ.వందల కోట్ల అక్రమార్జనకు పాల్పడుతున్నారు. భూముల అన్యాక్రాంతంపై గత ఏడాది డిసెంబరు 11న రూ.4000 కోట్ల ఐడీపీఎల్ భూములు కృష్ణార్పణం అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం అయింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం తొలుత విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. క్షేత్రస్థాయి పరిస్థితులపై విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. ఇదే తరుణంలో తాజాగా భూముల ఆక్రమణలపై ఉన్నత స్థాయి సర్వే నిర్వహించాలని సర్వే ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతును ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆర్జేడీ శ్రీహరి నేతృత్వంలో నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమకు కేటాయించిన 902 ఎకరాలను మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ఇప్పటికే నిషేధిత జాబితాలో ఉన్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మొత్తం భూముల్లో ఎన్ని ఎకరాలు కబ్జా చేశారు?.. పరిశ్రమకు కేటాయించిన భూముల హద్దులు, అన్యాక్రాంతం అయిన భూముల వివరాలపై ఉన్నతస్థాయి సర్వే కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.